Medaram | ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి గాంచిన మేడారం మహా జాతరలో ఆదివాసీ సంస్కృతి ఉట్టి పడేలా అత్యద్భుతంగా పునర్నిర్మాణం చేసిన ఆలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున భక్తులకు అంకితం చేశారు. వన దేవతల గద్దెలను సహచర మంత్రులతో కలిసి ప్రారంభించారు.
ఈ మహా జాతర ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సమేతంగా హాజరయ్యారు. సతీమణి గీతారెడ్డితో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనువడు కూడా వన దేవతల గద్దెల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ కుటుంబం మొక్కులు చెల్లించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. మనవడు రేయాన్ష్ తో కలిసి తులాభారం వేసుకుని సమ్మక్క సారలమ్మలకు బంగారం సమర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
నిన్న కేబినెట్ సమావేశంలో మేడారంలోనే నిర్వహించారు. ఆదివారం రాత్రి మేడారంలోనే బస చేసిన సీఎం, మంత్రులు.. సోమవారం ఉదయం పునర్నిర్మాణం చేసిన ఆలయంలో కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ ప్రాంగణాన్ని ప్రారంభించారు. తొలుత అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పైలాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.
ఏళ్ల నాటి కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలకు శిల్ప రూపం దిద్దుకుంది. చారిత్రక కట్టడాల తరహాలో అద్భుత కట్టడం ఆవిష్కృతమైంది. సమ్మక్క-సారలమ్మ మహాజాతర నిర్మాణ పనులు చరిత్రలోనే ఓ మైలు రాయిగా నిలిచిపోయేలా సర్కార్ చేపట్టింది. రాతిశిలలతో అభివృద్ధి పనులకు ప్రాణం పోయగా, 4 వేల టన్నుల గ్రానైట్‌పై ఆదివాసీ చరిత్ర సంస్కృతి తెలియజేసేలా 7 వేల చిత్రాలను హృద్యంగా చిత్రీకరించారు. సెప్టెంబర్ 23న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టగా మూడు నెలల వ్యవధిలోనే పనులను పూర్తి చేశారు. సమ్మక్క సారలమ్మ చరిత్ర, పునర్నిర్మాణ నిర్మాణ పనులు ఆదివాసీల మూలాలు జాతర చరిత్రను కళ్లకు కట్టినట్టుగా నిర్మాణాలు చేపట్టారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీటవేస్తూ చరిత్రను కళ్లకు కట్టే విధంగా వందల ఏళ్లు చెక్కు చెదరకుండా పనులు పూర్తి చేశారు.
