Jupally Krishna Rao | రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఆయా మున్సిపాలిటీల పరిధిలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి నేతలు, కార్యకర్తలు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా కసరత్తులు చేస్తున్నారు. రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ.. ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన సొంత నియోజకవర్గం కొల్లాపూర్ పట్ణణ వీధుల్లో మంత్రి జూపల్లి సైకిల్‌పై తిరుగుతూ శారీరక శ్రమ, మానసిక ఉల్లాసం, ఆరోగ్యకర జీవనశైలి ప్రాధాన్యతను గురించి ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. నేటి ఆధునిక జీవనశైలిలో వాహనాలపై అధిక ఆధారపడటం వల్ల శారీరక శ్రమ తగ్గి, అనేక రకాల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో సైకిల్ ప్రయాణం వంటి సాధారణ అలవాట్లు శరీర దృఢత్వంతో పాటు మనసుకు ఆనందాన్ని అందిస్తాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి విజయం అందించాలని ప్రజలను మంత్రి జూపల్లి కోరారు.
సైకిల్ వినియోగం ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, కాలుష్య నియంత్రణకు, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో సాధ్యమైనంతవరకు సైకిల్‌ను వినియోగించాలని, శారీరక శ్రమ చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, యువత, రైతులు తమ దైనందిన జీవితంలో సైకిల్ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు పిలుపునిచ్చారు. మంత్రి జూపల్లి చేపట్టిన ఈ వినూత్న ప్రచారానికి పట్టణ ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.
కొల్లాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కొల్లాపూర్ పట్టణంలోని 11వ వార్డులో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ‘ప్రజా ప్రభుత్వం’ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
