మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా..? ఇంట్లోనే ఈ టెక్నిక్‌ ద్వారా ఈజీగా కనిపెట్టేయొచ్చు!

మీరు తాగే పాలు అసలైనవేనా? నీళ్లు, డిటర్జెంట్, స్టార్చ్ వంటి కల్తీలను ఇంట్లోనే ఈ 4 టెక్నిక్స్‌తో నిమిషాల్లో కనిపెట్టేయండి.

ఈ రోజుల్లో కల్తీ పెరిగిపోయింది. ఇంట్లో వాడే నిత్యావసర వస్తువల నుంచి తినే తిండి, తాగే పాల వరకూ అన్నీ కల్తీనే. ముఖ్యంగా పాలు (Milk). ఒకప్పుడు స్వచ్ఛమైన బర్రెపాలు దొరికేవి. కానీ ప్రస్తుతం పాలను కూడా కల్తీ చేసి అమ్ముతున్నారు. పాల కల్తీ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన సమస్యగా మారింది. పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో క్యాల్షియం కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎదిగే పిల్లల్లో ఎముకల బలోపేతం కావడానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. కానీ ప్రస్తుతం మార్కెట్లో కల్తీపాలే దొరుకుతున్నాయి. వీటిని తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది.

దేశవ్యాప్తంగా పరీక్షించిన పాల నమూనాల్లో 68.7 శాతం నీళ్లు, డిటర్జెంట్‌, స్టార్చ్‌, సింథటిక్‌ సమ్మేళనాలు ఉన్నట్లు తేలింది. యూరియా, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వంటి వాటితో కల్తీ పాలు తయారు చేసి ప్రజలకు అమ్ముతూ కొంద‌రు సొమ్ము చేసుకుంటున్నారు. వాటిని తాగ‌డం వ‌ల్ల చాలా మంది అనారోగ్యం బారిన ప‌డుతున్నారు. అందుకే పాలను తాగే ముందు వాటి స్వచ్ఛతను పరీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఇంట్లోనే ఈజీగా పాల స్వచ్ఛతను (Purity Of milk) తెలుసుకోవచ్చు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

వాటర్‌ టెస్ట్‌..

ఇండియన్ జర్నల్ ఆఫ్ డెయిరీ సైన్స్ (Indian Journal of Dairy Science) ప్రకారం.. పాలల్లో నీళ్లు కలిశాయో..? లేదో..? ఇంట్లోనే ఈజీ పద్ధతిలో తెలుసుకోవచ్చు. ముందుగా వాలుగా ఉన్న ఓ స్టీల్‌ ప్లేట్‌ తీసుకోవాలి. దానిపై ఓ చుక్క పాలను వేయండి. పాలు స్వచ్ఛమైనవి అయితే.. ఆ పాల చుక్క నెమ్మదిగా కిందకు జారుతుంది. అంతేకాదు, మిల్క్‌ డ్రాప్‌ కిందకు జారినప్పుడు తెల్లటి గుర్తు ఏర్పడుతుంది. అలా అయితే, అవి స్వచ్ఛమైన పాలు అని అర్థంచేసుకోవాలి. ఒక వేళ పాలలో నీళ్లు కలిసి ఉంటే.. ఆ పాల చుక్క ప్లేట్‌మీద వేయగానే వేగంగా కిందకు వెళ్తుంది. ఎలాంటి తెల్ల గుర్తూ ఏర్పడదు.

స్టార్చ్ టెస్ట్‌..

పాలు చిక్కగా, తెల్లగా ఉండేందుకు కొందరు స్టార్చ్ (పిండి పదార్థం)ను కలుపుతారు. అంటే బియ్యపు పిండి, ఆరోరూట్ లేదా కార్న్‌స్టార్చ్ వంటి వాటిని మిక్స్‌ చేస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. పాలల్లో స్టార్చ్‌ కలిసిందో లేదో ఇంట్లోనే ఈజీగా తెలుసుకోవచ్చు. ఒక గ్లాసు పాలల్లో కొంచెం అయోడిన్‌ ద్రావణాన్ని కలపాలి. ఆ పాలలో స్టార్చ్‌ ఉంటే అవి నీలం రంగులోకి మారుతాయి. ఒకవేళ పాలు లేత గోధుమ రంగులోకి మారితే అవి స్వచ్ఛమైనవనని అర్థం చేసుకోవాలి.

డిటర్జెంట్‌ టెస్ట్‌..

కొందరు పాలల్లో డిటర్జెంట్‌ కలుపుతారు. మనం ఒక బాటిల్‌లోకి పాలు, నీళ్లు సమానంగా తీసుకోవాలి. వాటిని బాగా షేక్‌ చేయాలి. అప్పుడు బాటిల్‌లో నురగ ఏర్పడితే అందులో డిటర్జెంట్‌ ఉందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ అవి స్వచ్ఛమైన పాలు అయితే నురగ చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు వెంటనే ఆ నురగ తగ్గిపోతుంది కూడా.

వేడి చేసి..

పాలను వేడి చేయడం ద్వారా అవి కల్తీ పాలా.. స్వచ్ఛమైన పాలా అనేది తెలుసుకోవచ్చు. పాలను వేడి చేసినప్పుడు అవి ఆవిరయ్యే తీరు ఆధారంగా వాటిలో ఎంతవరకు నీళ్లు లేదా యూరియా కలిసిందో తెలుసుకోవచ్చు. స్వచ్ఛమైన పాలను వేడి చేసినప్పుడు పాల మధ్యలో బుడగలా వస్తుంది. అక్కడే మరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. అదే కల్తీ పాలను వేడి చేసినప్పుడు ఈ ప్రక్రియ స్థిరంగా ఉండదు. పాత్ర అంచుల వరకు పాలు మరుగుతాయి. పాలల్లో నీళ్లు ఎంత కలిపారన్నదాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. యూరియాతో కల్తీ అయ్యి ఉంటే ఆ పాలు ఆవిరి కావు. పాత్ర అంచుకు చుక్కల్లా అంటుకుంటుంది. పాలల్లో 30 శాతం కంటే ఎక్కువ నీరు కలిపినా.. 0.4 శాతం యూరియా కలిసినా ఈ విధానం ద్వారా గుర్తించవచ్చు.

ఇవి కూడా చదవండి :

Meenakshi Chaudhary | పడుకుని పోజులిచ్చిన మీనాక్షి చౌదరి.. ఫోటోస్ చూస్తే వావ్ అనాల్సిందే!
Mahesh Babu | రాజమౌళి సినిమా కోసం రన్నింగ్ స్టైల్ కూడా మార్చిన మహేష్ బాబు.. ‘వారణాసి’పై అంచనాలు రెట్టింపు

Latest News