Rajahmundry Adulterated Milk | రాజమండ్రి కల్తీ పాల ఘటనలో వీడిన మిస్టరీ.. వ్యాపారి నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది!

Rajahmundry Adulterated Milk | ఏపీలోని రాజమండ్రిలో కల్తీ పాల మరణాలపై ఫోరెన్సిక్ ల్యాబ్ సంచలన విషయాలు వెల్లడించింది. కల్తీ పాలు తాగిన ఘటనలో 10 మంది మరణించగా.. అందులో ఐదుగురి మరణాలకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్, ఆర్ఎఫ్ఎస్ఎస్ ల్యాబ్ నివేదికలు వచ్చాయి.

Reported by: Chandram | ఆంధ్ర ప్రదేశ్ | Mar 07, 2026, 10:09 pm IST
Read Time: 4 mins
Rajahmundry Adulterated Milk | రాజమండ్రి కల్తీ పాల ఘటనలో వీడిన మిస్టరీ.. వ్యాపారి నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది!

Rajahmundry Adulterated Milk | ఏపీలోని రాజమండ్రిలో కల్తీ పాల మరణాలపై ఫోరెన్సిక్ ల్యాబ్ సంచలన విషయాలు వెల్లడించింది. కల్తీ పాలు తాగిన ఘటనలో 10 మంది మరణించగా.. అందులో ఐదుగురి మరణాలకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్, ఆర్ఎఫ్ఎస్ఎస్ ల్యాబ్ నివేదికలు వచ్చాయి. ఈ వివరాలను అధికారులు శనివారం వెల్లడించారు. రాజమండ్రిలో పాల వ్యాపారి గణేశ్ అమ్మిన పాలల్లో ఇథైలిన్ గ్లైకాల్ అనే ప్రమాదకర రసాయనం కలిసినట్లుగా ఫోరెన్సిక్ నివేదికలో అధికారులు వెల్లడించారు. ఈ కెమికల్ కలిపిన పాలను తాగడం వల్లే కిడ్నీలు దెబ్బతిని బాధితులు చనిపోయినట్లుగా నిర్ధారించారు.

కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన అడ్డాల గణేశ్వరరావు వరలక్ష్మీ పాల కేంద్రం పేరుతో పాల వ్యాపారం చేస్తున్నాడు. పాలను నిల్వ చేసేందుకు ఫ్రీజర్‌ను వాడుతున్నాడు. అయితే ఫ్రీజర్ లీకవ్వడంతో, ఆ ప్రదేశంలో ఎంసీల్ అతికించాడు. అయితే గత నెల 15వ తేదీన వ్యాపారి గణేశ్ పోసిన పాలు చేదుగా ఉన్నాయని పలువురు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. కానీ కస్టమర్ల రివ్యూను పట్టించుకోకుండా వ్యాపారి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. తెల్లారి కూడా అవే పాలను రాజమండ్రిలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేశాడు. అయితే ఫ్రీజర్ లీకవ్వడంతో.. ప్రమాదకరమైన రసాయనాలు విడుదలయ్యాయి. అవి పాలతో కలవడం వల్ల విషతుల్యమయ్యాయి. రాజమండ్రిలో కల్తీ పాల మరణాలు సంచలనం సృష్టించడంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఫ్రిజర్‌తో పాటు అందులోని ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకుని ల్యాబ్‌లో పరీక్షించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

గత నెల 16వ తేదీన కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన 20 మందిలో ఇప్పటివరకు 10 మంది మరణించారు. మిగిలిన 10 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, కల్తీ పాల ఘటన దుమారం రేపడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పాల వ్యాపారి గణేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.