విధాత, హైదరాబాద్ :
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓడిపోతామని తెలుసుకుని రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి మమ్మల్ని తిట్టినా.. మేం మాత్రం గౌరవంగానే మాట్లాడుతామన్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ఏం చేసిందో.. రెండేళ్లలో రేవంత్ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి నిజాయితీ పరుడైతే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోనైనా, గాంధీ భవన్‌లోనైనా, అసెంబ్లీలోనైనా.. ఎక్కడైనా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. ‘మా ప్రభుత్వంలో 42 ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించాం. మా హయాంలో దాదాపు పూర్తి కావొచ్చిన ప్రాజెక్టులనే కాంగ్రెస్ పూర్తి చేసింది. కొత్తగా ఈ రెండేళ్లలో ఒక్క రోడ్డు అయినా నిర్మించారా?. కొత్త రోడ్ల సంగతి తర్వాత కనీసం రోడ్లపై పడిన గుంతలైనా పూడ్చారా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
సీఎం అంటే చీఫ్ మినిస్టర్, కట్టింగ్ మినిస్టర్ కాదు.. అందుకే రేవంత్ కొంత హుందాగా ఉండాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పుణ్యమా అని మళ్లీ వాటర్ ట్యాంకర్‌లపై ఆధారపడే పరిస్థితి వచ్చిందన్నారు. నగరంలో శానిటేషన్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని.. కేసీఆర్ కూడా సీఎంగా ఒక ఏరియాను ఎంచుకొని అక్కడ శానిటేషన్ పనులు పర్యవేక్షించారు అని గుర్తు చేశారు. స్వచ్ఛ్ హైదరాబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వేలాది స్వచ్ఛ్ ఆటోలను ప్రవేశపెట్టారని తెలిపారు. మా హయాంలో ప్రతి రోజు 7.5 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించారన్నారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్‌లో మేం 30 అవార్డులు సాధించామని.. బెస్ట్ క్వాలిటీలో నెంబర్ వన్ సిటీగా హైదరాబాద్ నిలిచిందని గుర్తు చేశారు.
పదేళ్లు కేసీఆర్ హైదరాబాద్‌ను క్లీన్‌సిటీగా మారిస్తే.. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం దాన్ని మురికి కూపంగా మార్చిందని విమర్శించారు. పదేళ్లలో ఒక్క హైదరాబాద్‌లోనే లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టామని.. ఈ రెండేళ్లలో ఒక్క ఇళ్లైనా కట్టారా.. దమ్ముంటే దీనిపై చర్చకు రావాలి అని కేటీఆర్ సవాల్ విసిరారు. కొత్తగా ఒక్క ఇల్లు కట్టకపోగా.. వేలాదిగా పేదల ఇళ్లను ఈ ప్రభుత్వం కూలగొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రోను పూర్తి చేసింది మా ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. మెట్రో సీఎఫ్‌వో, ఎల్‌అండ్‌టీ సీఎఫ్‌ఓను ఈ ప్రభుత్వం బెదిరించిందని ఆరోపించారు. కాంక్రీట్ జంగిల్‌లో కొత్తగా లంగ్ స్పేస్‌లు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ దేనన్నారు.
ప్రతి గ్రామంలో నర్సరీలు… అంటే దాదాపు 16,000 నర్సరీలు ఏర్పాటు చేశామని, కాంగ్రెస్ మీ ప్రభుత్వంలో కొత్తగా ఒక్క నర్సరీ అయినా పెట్టలేదని.. పైగా ఉన్న చెట్లను నరికేశారని విమర్శించారు. రూ.10వేల కోట్లకు కక్కుర్తిపడి హెచ్‌సీయూలో జీవవైవిధ్యాన్ని దెబ్బతీశారని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీసీ కెమెరాలు పెట్టి కేసీఆర్ హైదరాబాద్‌లో శాంతి భద్రతలు పెంచితే.. ఇప్పుడు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో క్రైమ్ రేటు భారీగా పెరిగిందని.. డే లైట్ మర్డర్లు కూడా పెరిగాయని దుయ్యబట్టారు. మహారాష్ట్రలోని ముంబై పోలీసులు.. హైదరాబాద్ చర్లపల్లిలో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారంటే అంతకంటే అవమానం ఉంటుందా? అని కేటీఆర్ నిలదీశారు.
