విధాత, హైదరాబాద్ :
కాకతీయ రాజ్యంలో కట్టడాలకు పెట్టింది పేరు ఓరుగల్లు. కాకతీయ రాజుల అనేక కట్టడాలు, చెరువులు నిర్మించి తెలంగాన చరిత్రలో చెరపలేని పేరు సంపాదించుకున్నారు. ఇందులో ముఖ్యంగా గొలుసుకట్టు చెరువులు, బావులు, దేవాలయాలు, కోటలు ప్రధానంగా ఉన్నా్యి. ఇందులో వరంగల్ నగరంలో ఉన్న శివనగర్ లో ఉన్న బావి కాకతీయుల వైభవానికి నిదర్శనంగా నిలుస్తోంది. మూడు అంతస్తుల్లో నిర్మించిన ఈ బావిలో.. మొదలి అంతస్తు స్నానం చేయడానికి, రెండో అంతస్తు దుస్తులు మార్చుకోవడానికి నిర్మిస్తే.. మూడో అంతస్తు దైవ పూజ కోసం ఉపయోగించే వారు.
కాగా, రాణి రుద్రమదేవి సొరంగ మార్గం ద్వారా వచ్చి ఈ బావిలో స్నానం చేసేది అనే చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ఈ మూడంతస్తుల బావి నుంచి వేయి స్తంభాల వరకు సొరంగమార్గం కూడా ఉండేదని.. ప్రస్తుతం ఇది పూడుకపోయిందని స్థానికులు చెబుతున్నారు. స్నానం చేసేటప్పుడు శత్రువులు దాడి చేస్తే బావిలోని ప్రతిబింబం ద్వారా అంతం చేసేవారని కథనంగా ఉంది. నలువైపులా 14 మీటర్ల వెడల్పుతో చతురస్రాకారంలో ఉండే ఈ బావి.. గోడల పైన ఉన్న శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటాయి. ఎప్పుడు నీటితో నిండి ఉండే ఈ బావిని ఇటీవల ఆధునికరించడంతో అందంగా ముస్తాభై పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. వరంగల్ ఫోర్టురోడ్డు శివనగర్‌లో ఉన్న ఈ చారిత్రక బావి పునరుద్ధరణ పనులు పూర్తవడంతో సోమవారం మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు.
