విధాత, వరంగల్ ప్రతినిధి:
పసలేని, పనికిరాని వాళ్ళు చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను నాశనం చేసిందని, ముందు వాళ్ల కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని సూచించారు. వాళ్ల విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కొండా సురేఖ సమస్య సమసిపోయిందని ఇప్పుడు దానిపై మాట్లాడడానికి ఏమి లేదని అన్నారు. ‘30ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఏనాడూ రౌడీయిజం చేయలేదు. భూ కబ్జాలకు చేయలేదు. అవినీతికి పాల్పడలేదు’ అని కడియం అన్నారు. అభివృద్ధిలో పోటీ పడలేకనే నాపై విమర్శలు చేస్తారని మండిపడ్డారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా పని చేస్తున్నానని కడిచయం శ్రీహరి స్పష్టం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని 5566.15 కిలోమీటర్ల ఆర్ అండ్ బీ హ్యామ్ రోడ్ల అభివృద్ధికి 10వేల 547.38 కోట్లు మంజూరు చేసిందని అందులో మొదటి విడతలోనే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలో 8రోడ్లు 91.55 కిలోమీటర్లు 171.82కోట్లు మంజూరు అయ్యాయని కడియం వెల్లడించారు. నియోజకవర్గం గత 15ఏళ్ళు చేతకాని దద్దమ్మల చేతిలో చాలా నష్టపోయిందని ఆరోపించారు. జరిగిన నష్టాన్ని ఎమ్మెల్యే గా ఎన్నికైన నాటి నుండి సాధ్యమైనంత వరకు పూడ్చే ప్రయత్నం చేస్తున్నాని కడియం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురావేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు సామాజిక న్యాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపెద్ద పీట వేస్తున్నారని వెల్లడించారు. ఆదర్శవంతమైన పథకాలు అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ఈ 5ఏళ్లతో పాటు వచ్చే 5 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రి గా కొనసాగాలని ఆకాంక్షించారు. రేవంత్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందని ఆకాంక్షించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎన్ని పసలేని విమర్శలు చేసినా దేశంలో బీసీ రిజర్వేషన్ల అమలు జరిగితే దాని పూర్తి క్రెడిట్ రేవంత్ రెడ్డికే దక్కుతుందని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
