విధాత, హైదరాబాద్ :
నేడు బీహార్ అసెంబ్లీ రెండో విడత పోలింగ్ తో పాటు, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతోంది. కాగా, జూబ్లీహిల్స్ బై పోల్ లో సాయంత్రం 5 గంటల 47.16 శాతం పోలింగ్ నమోదు అయింది. ఉదయం 7 గంటలకు ఎన్నిక ప్రారంభం అయింది. స్టార్టింగ్ లో కొంచెం ఓటింగ్ నెమ్మదించినా తరువాత పుంజుకున్నది. కాగా, పోలింగ్ సమయంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ లు ఎన్నికల సంఘానికి పోటాపోటీగా ఫిర్యాదు చేశారు. కృష్ణా నగర్ పోలింగ్ బూత్ దగ్గర ఫేక్ ఐడీలతో కాంగ్రెస్ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో ఆ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
జూబ్లీహిల్స్ పరిధిలోని అపెక్స్ స్కూల్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్లు 4, 5, 6, 7 వద్ద పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలింగ్ కేంద్రం లోపల పలువురు గుమికూడటంతో లాఠీఛార్జ్ చేశారు. అలాగే, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓటర్లు లేకపోవడంతో నాగార్జున నగర్ కాలనీ, ఎల్లారెడ్డిగూడ పోలింగ్ బూత్ వెలవెలబోయాయి. కాగా, సాయంత్రం ఆరుగంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ సమయం వరకు క్యూలో ఉన్న వారికి ఎన్నికల సంఘం ఓటు వేసేందుకు అనుమతినివ్వనుంది.
అలాగే, బీహార్ అసెంబ్లీ నియోజకవర్గాల స్థానాలకు రెండో విడత ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 60.40 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని 20 జిల్లాల్లోని మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొదటి విడత పోలింగ్ ఈ నెల 6వ తేదీన నిర్వహించగా 64.46 శాతం ఓటింగ్ నమోదయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.