Maganti Gopinath Posters Controversy | జూబ్లీహిల్స్‌లో పోలింగ్ కు ముందు గోపన్న పోస్టర్ల కలకలం!

జూబ్లీహిల్స్‌లో పోలింగ్‌కు ముందు గోపన్న పోస్టర్లు రాజకీయ కలకలం రేపాయి. కేటీఆర్‌పై గోపినాథ్ అభిమానుల ఆరోపణలతో వాతావరణం వేడెక్కింది.

Maganti Gopinath Fan Posters

విధాత, హైదరాబాద్ : మరికొన్ని గంటల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ జరుగునున్న వేళ నియోజకవర్గంలో వెలిసిన పోస్టర్లు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. మాగంటి గోపినాథ్ అభిమానుల పేరుతో నియోజకవర్గంలో వెలిసిన పోస్టర్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పోస్టర్లలో.. మా అభిమాన నాయకుడు కీ.శే. మాగంటి గోపీనాథ్ మరణం మాకు ఎంతో బాధను మిగిలించిందని, గోపినాథ్ మరణం తర్వాత జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో మాకు పలు అనుమానాలు కలుగుతున్నాయని, జూన్ 2న మాతో కలిసి పుట్టిన రోజు జరుపుకున్న గోపన్న మరుసటి రోజునే ఆసుపత్రిలో చేరడం..అక్కడ గోపన్న తల్లిని చూడనివ్వకపోవడం, కేటీఆర్ ఆ మూడు రోజులలో వ్యవహరించిన తీరు పట్ల కూడా మాకు తీవ్ర అనుమానాలు ఉన్నాయని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. గోపన్న మరణం వెనుక తప్పకుండా ఏదో జరిగిందని మేము నమ్ముతున్నామని, సునీతమ్మ సెక్యూరిటీకి లేఖ రాయడం, తొందరపడి అంత్యక్రియలు నిర్వహించడం వంటి విషయాలు మరింత అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయని అందులో పేర్కొన్నారు.

నిన్న గోపినాథ్ అమ్మ మాట్లాడిన తర్వాత మా అనుమానాలు మరింత బలపడ్డాయని, ఆసుపత్రిలో వేలు ముద్రలు తీసుకున్నారా? ఎందుకు అన్నను అమ్మకి చూపించలేదు? ఈ ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పక తప్పదు అని, గోపన్న అభిమానులారా..అన్న మనకు దూరం కావడం సాధారణ ఘటన కాదు అని, కేటీఆర్ నిజం చెప్పాలి, సమాధానం ఇవ్వాలి అంటూ పోస్టర్లలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్లను జూబ్లీహిల్స్ బస్తీలలో గోపీనాథ్ అభిమానుల పేరుతో అంటించారు. పోలింగ్ కు ముందు బీఆర్ఎస్ ను దెబ్బతిసేందుకు, కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని.. రాజకీయ ప్రత్యర్థులు ఎవరో ఈ పోస్టర్లను వేసినట్లుగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.