విధాత, హైదరాబాద్ : తెలంగాణలో వేసవి ఎండల కంటే ఎక్కువగా రాజ్యసభ ఎన్నికల వేడి సెగలు రేపుతుంది. రాష్ట్రం నుంచి కాంగ్రెస్ కు చెందిన అభిషేక్ సింఘ్వీ, బీఆర్ఎస్ కు చెందిన సురేష్ రెడ్డిల పదవీ కాలం ముగియ్యడంతో వారి స్థానంలో ఇద్దరు అభ్యర్థులకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతుండగా.. నామినేషన్ల దాఖలుకు రేపు 5వ తేదీ చివరి రోజు. దీంతో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ లు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.
ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
రాజ్యసభ అభ్యర్థుల విషయంపై అధిష్టానంతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు.
అభ్యర్థుల ఎంపికకి సంబంధించి తగిన ప్రతిపాదనలతో ఢిల్లీ రావాలని అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆయన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్ లతో కలిసి అధిష్టానంతో అభ్యర్ధుల ఎంపికపై చర్చిస్తారు. ప్రస్తుతం కాంగ్రెస్ కు ఉన్న బలం మేరకు ఎంఐఎంతో కలిసి రెండు స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక స్థానాకి అభిషేక్ సింఘ్వీ పేరును ఖరారు చేస్తారని ప్రచారం వినిపిస్తుంది. మిగిలిన ఒక స్థానానికి ఏఐసీసీకి ముగ్గురి పేర్లను ప్రతిపాదించనుండగా రేసులో వీహెచ్, వేం నరేందర్ రెడ్డి, పుంజాల వినయ్ కుమార్ పేర్లు ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది.
రాజ్యసభ స్థానం కోసం ఇప్పటికే 16మంది కాంగ్రెస్ నాయకులు ముందుకొచ్చారని, వారిలో సమర్ధవంతమైన బీసీలు నలుగురు రాజ్యసభ అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు అని, రాష్ట్రం నుండి ఒకరికి ఇస్తారా? లేదా ఇద్దరికి ఇస్తారా? అనేది నేటి సమావేశంలో తేలుతుందని ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడిగా మాదిగకి అవకాశమివ్వాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచుతున్నారు. మాదిగలను పార్లమెంట్ వెళ్లకుండా కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆరోపిస్తూ..బుధవారం డీసీసీల ముట్టడికి పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పోటీ చేస్తే…పోటీ ఉత్కంఠభరితం
రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ ఇద్దరు సభ్యులను గెలిపించుకునేందుకు సొంతంంగా అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యా బలం లేదు. ఒక్క రాజ్యసభ ఎంపీ స్థానం గెలవడానికి 40.66 మంది ఎమ్మెల్యేల మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. అధికార కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు గెలవడానికి 82 మంది ఎమ్మెల్యేలు అవసరం. సీపీఐ ఎమ్మెల్యేతో కలిపి కాంగ్రెస్ బలం 67 మంది మాత్రమే. బీఆర్ఎస్ పార్టీకి 37మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 40ఓట్ల కోటాకు 3తక్కువ. బీఆర్ఎస్ సొంతంగా అభ్యర్థిని పోటీకి దించి తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసినట్లయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలు 10మందికి ఇబ్బంది తప్పదు. ఓపెన్ బ్యాలెట్ పద్దతిలో జరిగే రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో పార్టీ ఎన్నికల ఎజెంట్లకు ఎమ్మెల్యేలు తమ ఓటు ఎవరికి వేస్తున్నామో చూపించి మరి వేయాల్సి ఉంటుంది. విప్ జారీ చేస్తే అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చట్టపరంగా సమస్యలు ఎదురవుతాయి. ఇప్పటికే తాము బీఆర్ఎస్ లో ఉన్నామని ఆ 10మంది ఎమ్మెల్యేలు అటు సుప్రీంకోర్టుకు, ఇటు స్పీకర్ కు నివేదించుకున్నారు. స్పీకర్ సైతం వారు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారని తీర్పు ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో వారు రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ విప్ ధిక్కరించి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసే ధైర్యం చేస్తారా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
ఈ పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్ పార్టీ రెండో స్థానాన్ని గెలుచుకునేందుకు బేరసారాలకు దిగవచ్చని అంచనా వేస్తున్నారు. రెండో సీటు గెలిచేందుకు ఎంఐఎం సభ్యులు 7గురు మద్దతునిచ్చినా…అప్పుడు ఇంకా కాంగ్రెస్ కు మరో 4గురు ఎమ్మెల్యేలు కావాలి. ఎంఐఎం సహకరిస్తుందా..అందుకు వారి డిమాండ్లు ఏమిటన్నది ఆసక్తికరం. బీజేపీ తటస్థంగా ఉండి ఓటింగ్ కు గైర్హాజరైతే కాంగ్రెస్ గెలుపు సులభతరం కానుంది. అందుకు బీజేపీ అంగీకరిస్తుందా లేదో చూడాల్సి ఉంది. బీఆర్ఎస్ రాజ్యసభ సీటును గెలిచేందుకు బీజేపీ, ఎంఐఎం సహకరిస్తే ఆ పార్టీకి గెలుపు సునాయసమే. అయితే ఎంఐఎం, బీజేపీల వ్యూహాం ఏమిటన్నదే.. ఇప్పుడు కాంగ్రెస్ రెండో సీటు గెలుపు ఓటములను నిర్ణయించనుంది.
ఇవి కూడా చదవండి :
Kakatiya Vishnu Idol| వెయ్యేళ్ల శిల్పం కిరీటం…కాకతీయ కళా వైభవానికి కొత్త దర్పణం!
Valsad Lift Accident | లిఫ్ట్ యాక్సిడెంట్.. వామ్మో తృటిలో చావు తప్పింది.. !
