Man Ki Baath | ‘మన్ కీ బాత్’ లో కొమురం భీమ్ వీరత్వాన్ని కొనియాడిన ప్రధాని మోదీ

ఈ రేడియో ప్రోగ్రాంలో తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ గురించి మోదీ ప్రస్తావిస్తూ యావత్ దేశానికి ఆయన చేసిన ఉద్యమాన్ని, ఆయన ధీరత్వాన్ని పరిచయం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా భీమ్ గొప్పతనం, త్యాగం, పోరాటాల గురించి దేశ ప్రజలందరికీ వివరించారు ప్రధాని మోదీ.

PM Modi

న్యూఢిల్లీ :

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తోన్న రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’. ఇది దేశ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన రేడియో ప్రోగ్రాం గా నడుస్తోంది. ప్రతి నెలా చివరి ఆదివారం నాడు ‘మన్ కీ బాత్’ ప్రోగ్రామ్ బ్రాడ్ కాస్ట్ అవుతుంది. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణం చేసిన నాటి నుంచి ఆయన దీన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ దేశ ప్రజల మనస్సును తాకుతోంది. ఇందులో దేశంలోని మరుగున పడిన కళలు, కళాకారులు, సేవ కార్యక్రమాలు చేస్తూ పేరు లేని వారిని ప్రధాని మోదీ పరిచయం చేస్తూ వస్తున్నాడు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు చాలా మందిని ఈ ప్రోగ్రాం ద్వారా ప్రజల ముందుకు అనేక మందిని తీసుకొచ్చారు.

ఈ క్రమంలో ఈ నెలలో నేడు చివరి ఆదివారం కావడం వల్ల 127వ మన్ కీ బాత్ కార్యక్రమం టెలికాస్ట్ అయింది. దీనికి ఒక స్పెషల్ కూడా ఉంది. ఈ రేడియో ప్రోగ్రాంలో తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ గురించి మోదీ ప్రస్తావిస్తూ యావత్ దేశానికి ఆయన చేసిన ఉద్యమాన్ని, ఆయన ధీరత్వాన్ని పరిచయం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా భీమ్ గొప్పతనం, త్యాగం, పోరాటాల గురించి దేశ ప్రజలందరికీ వివరించారు ప్రధాని మోదీ. 20వ శతాబ్దం తొలినాళ్లలో దేశంలో స్వాతంత్ర్య ఆశలు పూర్తిగా సన్నగిల్లిన సమయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అప్పట్లో బ్రిటిషు పాలకులు దేశం అంతటా అణచివేతకు పాల్పడ్డారని, ప్రజలను విపరీతంగా దోచుకున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని దేశభక్తులకు ఆ కాలంలో అణచివేత మరింత భయంకరంగా ఉండేదని, బ్రిటీష్ పాలకులతో పాటు క్రూరత్వం నిండిన నిజాం పాలకుల అకృత్యాలను కూడా వారు భరించాల్సి వచ్చిందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.

పేదలు, అణగారిన వర్గాలు, గిరిజన ప్రజలపై అంతులేని అమానుష దాడులు జరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘అటువంటి క్లిష్టమైన కష్ట పరిస్థితుల్లో 20 సంవత్సరాల వయస్సున ఓ యువకుడు ఈ అణచివేతకు ఎదురుతిరిగారు. అన్యాయాన్ని ఎదిరించిన నిలిచారు. నిజాం పాలకులు, బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి ముందుకు వచ్చాడు’ అని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కొమురం భీమ్ నిజాం అధికారిని సైతం హతమార్చి.. అరెస్టు కాకుండా తప్పించుకోవడంలో విజయవంతమయ్యాడని ప్రధాని మోదీ చెప్పారు. అక్టోబర్ 22వ తేదీన కొమురం భీమ్ జయంతిని నిర్వహించుకున్నామని తెలిపారు. కొమరం భీమ్.. ముఖ్యంగా గిరిజన సమాజంలోని లక్షలాది మంది ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వీలైనంత ఎక్కువ కొమురం భీమ్ గురించి తెలుసుకోవాలని మోదీ ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు.