అమరావతి : ఏపీ(Andhra Pradesh)లొని విశాఖ పట్నం(Visakhapatnam), అల్లూరి సితరామరాజు జిల్లాల్లో మంగళవారం తెల్లవారుజామున 4.24 నిమిషాలకు స్వల్ప భూకంపం(earthquake) సంభవించింది. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొంతమంది భూకంపం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ముఖ్యంగా మురళీనగర్, గాజువాక, మాధురవాడ, ఎంవీపీ కాలనీ, ఎండాడ, భీమిలి, పెందూర్తి, గోపాలపట్నం ప్రాంతాల్లో తేలికపాటి ప్రకంపనాలు నమోదయ్యాయని స్థానికులు తెలిపారు. భీమిలి బీచ్ రోడ్‌లో భూమి కంపించింది. సింహాచలంలోనూ స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా 3.7 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. జి.మాడుగుల సమీపంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.0 చుట్టుపక్కలగా నమోదై ఉండవచ్చని భూకంపశాఖ అంచనా వేస్తోంది. అధికారిక ధృవీకరణ కోసం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) పరిశీలన ప్రారంభించింది. భూకంపం తక్కువ తీవ్రతతోనే ఉన్నప్పటికీ, ప్రజల్లో ఒకింత ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలు లేవని అధికారులు తెలిపారు. అయినప్పటికీ, జాగ్రత్త చర్యలుగా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
