Nigeria | నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నైగర్ నదిలో పడవ మునిగి 103 మంది మృతి చెందారు. పెళ్లి వేడుక ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర నైజీరియాలోని క్వారా స్టేట్‌లోని పటేగి జిల్లాలో ఓ పెళ్లి వేడుక నిమిత్తం 300 మంది దాకా వెళ్లారు. అయితే వివాహం ముగిసిన తర్వాత ఆ 300 మంది ఒకే బోటులో ఎక్కారు. ఈ బోటు నైగర్ నది దాటుతుండగా ప్రమాదవశాత్తు నీట మునిగింది. దీంతో 103 మంది ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి 100 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు.
స్థానిక గ్రామ పెద్ద అబ్దుల్ గనా లుక్పాడా మాట్లాడుతూ.. నైగర్ నది సమీపంలోని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు దాదాపు 300 మంది ఎగ్బోటి గ్రామంలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అయితే సోమవారం రాత్రి భారీ వర్షం కురియడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వరద నీరు పోటెత్తడంతో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది.
దీంతో పెళ్లి వేడుకకు వెళ్లిన 300 మంది తమ గ్రామాలకు తిరిగి వచ్చేందుకు బోటును ఆశ్రయించారు. మోతాదుకు మించి బోటులో ఎక్కించు కోవడంతో అది నీటిలో మునిగిపోయింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు చోటు చేసుకున్నట్లు తెలిపారు.