Kanpur | డ్రైవింగ్‌ రాని.. ముగ్గురు మూర్ఖపు కారు దొంగల కథ

విధాత: చెత్త పని చేసినా.. తెలివిగా చేయాలంటారు! కానీ.. ఈ ముగ్గురు దొంగలకు దొంగతనంలో కనీసమైన అనుభవం ఉన్నట్టు లేదు. అదే వారి కొంప ముంచింది. పోలీసులకు పట్టిచ్చింది. ఇది కాన్పూర్‌ (Kanpur) కు చెందిన ముగ్గురు దొంగల కథ. దబావులి ప్రాంతంలో ఒక మారుతి వ్యాన్‌ను దొంగిలించేందుకు ఆ ముగ్గురూ ప్లాన్‌ వేశారు. ఈ ముగ్గురిలో ఇద్దరు కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు కూడా ఉన్నారు. సొంతగా ఒక వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేసి.. దానిలో కారును అమ్మకానికి […]

  • Publish Date - May 24, 2023 / 02:27 AM IST

విధాత: చెత్త పని చేసినా.. తెలివిగా చేయాలంటారు! కానీ.. ఈ ముగ్గురు దొంగలకు దొంగతనంలో కనీసమైన అనుభవం ఉన్నట్టు లేదు. అదే వారి కొంప ముంచింది. పోలీసులకు పట్టిచ్చింది.
ఇది కాన్పూర్‌ (Kanpur) కు చెందిన ముగ్గురు దొంగల కథ. దబావులి ప్రాంతంలో ఒక మారుతి వ్యాన్‌ను
దొంగిలించేందుకు ఆ ముగ్గురూ ప్లాన్‌ వేశారు. ఈ ముగ్గురిలో ఇద్దరు కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు కూడా ఉన్నారు.

సొంతగా ఒక వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేసి.. దానిలో కారును అమ్మకానికి పెట్టి, సొమ్ము చేసుకుందామని అనుకున్నారు. ఏ కారును కొట్టేయాలో ముందే నిర్ణయించుకున్నారు. మే 7వ తేదీన అనుకున్న సమయానికి ఆ కారు దగ్గరకు చేరుకున్నారు.

కానీ.. అప్పుడే వారికి ఒక విషయం అర్థమైంది. ఆ కారును తీసుకుపోవడం అసాధ్యమని. ఎందుకంటే.. ఆ ముగ్గురు దొంగల్లో ఏ ఒక్కరికీ డ్రైవింగ్‌ రాదు. అయినా తగ్గేదే లే.. అంటూ ఆ కారును తోసుకుపోవడం మొదలు పెట్టారు.

చిమ్మచీకటిలోనే మారుతి వ్యాన్‌ను తోసుకుంటూ తోసుకుంటూ దాదాపు పది కిలోమీటర్లు వెళ్లారు. ఎక్కడున్నామని చూస్తే.. అది వారికి తెలియని ప్రాంతం. మరోవైపు ఒళ్లు సహకరించే పరిస్థితి లేకపోయింది. కాలు తీసి కాలు వేయలేనంతగా అలసిపోయారు. ఇక చేసేది లేక కారును వదిలేసి వెళ్లిపోదామని డిసైడై పోయారు.

కొంచెం తెలివిని ఉపయోగించిన ఆ దొంగలు.. సదరు కారు ఎక్కడిదో, ఎవరిదో తెలియకుండా దాని నంబర్‌ ప్లేట్లు పీకేసి.. ఒక పొద చాటున దాచిపెట్టేసి.. ఏమీ తెలియనట్టు వెళ్లిపోయారు. కానీ.. ఆ తెలివి పని చేయలేదు.

పోలీసులు వాళ్ల జాడ కనిపెట్టి.. అరెస్టు చేశారు. వీరిలో ఒకడు ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదువుతుంటే.. మరొకడు బీకాం ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. మరో యువకుడు ఉద్యోగం చేస్తున్నాడు.

Latest News