శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని ఫూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. జవాన్లతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కులను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన బలగాలు కూడా ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు కాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులు కాగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ముగ్గురు జవాన్లను ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.
అయితే రాజౌరీ -ఫూంచ్ రీజియన్‌లోని డేరా కీ గాలి(డీకేజీ) ఏరియాలో ఉగ్రవాదులు తల దాచుకున్నట్లు భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో బుధవారం రాత్రి నుంచి అక్కడ బలగాలు ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఆ బలగాలకు తోడుగా, నిన్న మధ్యాహ్నం మరో రెండు ట్రక్కుల్లో జవాన్లను డీకేజీ ఏరియాకు తరలించారు. ఈ వాహనాలను పసిగట్టిన ఉగ్రవాదులు.. జవాన్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులు ప్రారంభించారు. బలగాలు కూడా కాల్పులు జరిపారు.
రాజౌరీ జిల్లాలోని కలాకోట్ ఏరియాలో గత నెలలో యాంటీ టెర్రర్ ఆపరేషన్‌ను ఆర్మీ సైన్యం నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఐదుగురు జవాన్ల ప్రాణాలు ఉగ్రవాదుల తూటాలకు బలయ్యాయి. ఇందులో ఇద్దరు క్యాప్టెన్స్ ఉన్నారు. గత కొన్నేండ్ల నుంచి ఉగ్రవాద దాడులకు రాజౌరీ – ఫూంచ్ రీజియన్ అడ్డాగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో జరిగిన రెండు దాడుల్లో 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గత రెండేండ్లలో ఈ ఏరియాలో మొత్తం 35 మంది సైనికులు అమరులయ్యారు.