Outsourcing Employees | కన్నీళ్లు పెట్టిస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ‘మరణ వాంగ్మూలం’

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు (Outsourcing Employee ) ఎంతటి వేదనను అనుభవిస్తున్నారో కంప్యూటర్‌ ఆపరేటర్‌ సోమిరెడ్డి బలవన్మరణం (Tragic death) కళ్లకు కడుతున్నది. బలవన్మరణానికి ముందు అతడు పంపిన వాట్సాప్‌ మెసేజ్‌ heart touching whatsapp message కళ్లల్లో నీళ్లు తెప్పిస్తున్నది.

  • Publish Date - September 13, 2025 / 07:22 PM IST

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విధాత) : 

Outsourcing Employees | పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పరిధిలోని పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రతి నెలా జీతాలు రాకపోవడం, ఆర్థిక సమస్యలు వెంటాడటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ సోమిరెడ్డి రైలుకు ఎదురెళ్లి చనిపోయాడు. ఇటీవలే సీతక్క ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు మైదం మహేశ్‌ వేతనాలు అందక ప్రాణాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడమే కాకుండా స్మశాన వాటికలో పనిచేయించారు. డబ్బులు లేక భార్యా పిల్లలు తిండిలేక అవస్థలు పడటంతో తీవ్ర వేదనకు గురై తన కుమారుడు గడ్డి మందు తాగాడని తల్లి రాజమ్మ తెలిపారు. జీతాలు రాక ఆమె నియోజకవర్గంలో ఒకరు చనిపోగా, ఆ తరువాత ఆమె శాఖలోనే పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చనిపోవడం శోచనీయమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథలో పనిచేస్తున్న సుమారు 18వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధలు కూడా వర్ణనాతీతంగా ఉన్నాయి. కొందరికి 12 నెలలు, మరికొందరికి 4 నెలలు, ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. వారు ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా చెత్తబుట్టపాలు అవుతున్నాయి కానీ శాశ్వత పరిష్కారం లభించడం లేదు.

ఇది ప్రభుత్వ హత్యే

ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ హత్యని తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ జేఏసీ అధ్యక్షులు పులి లక్ష్మయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సోమిరెడ్డి సూర్యాపేట జిల్లా  తుంగతుర్తి ఎంపీడీవో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నారు. రెండు నెలలుగా జీతాలు లేక కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల శుక్రవారం 4 గంటల 30 నిమిషాలకు నల్లగొండలో జన్మభూమి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. పలు ప్రభుత్వ విభాగాలలో జీతాలు సక్రమంగా రాక, ఎప్పుడు ఇస్తారో తెలియక అనేక అవస్థలు పడుతున్నారు. కాల్ 104, మిషన్ భగీరథ, పశు వైద్య, సంక్షేమ హాస్టళ్లు, పోలీస్ డిపార్ట్‌మెంట్‌, మోడల్ స్కూళ్లు, వైద్య ఆరోగ్య శాఖలో ప్రతి నెలా జీతాలు ఇవ్వకపోవడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక పక్క కాంట్రాక్టు ఏజెన్సీ ల దోపిడి మరొపక్క సరైన సమయానికి జీతాలు రాక యావత్తు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు అనేక బాధలు పడతున్నారు. ప్రతి నెలా మొదటి వారంలో పిల్లలకు స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాం, ఇంటి కిరాయి కట్టలేకపోతున్నాం. పూట గడవడం కోసం అప్పులు చేసి కిరాణా సరకులు తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ముఖ్య పండగలు ఉన్నా అవి కూడా కుటుంబంతో కలిసి చేసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మేమున్నాం. తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో మా నుంచి ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సోమిరెడ్డి ఆత్మహత్య ఘటనకు నిరసనగా మంగళవారం చలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ జేఏసీ అధ్యక్షులు పులి లక్ష్మయ్య తెలిపారు.

మానవత్వాన్ని కలచివేసే వాట్సాప్‌ సందేశం

నా మిత్రులందరికీ ప్రత్యేక పాదాభివందనాలు అంటూ ఈ రోజు బలవన్మరణానికి పాల్పడిన సోమిరెడ్డి వాట్సప్ మెస్సేజ్ ప్రతి ఒక్కరి హృద‌యాన్ని ద్రవింప చేస్తోంది. మెస్సేజ్‌లో తను వెలిబుచ్చిన సమస్యలు సహచరులను కలచివేస్తున్నది. ‘నేను ప్రతిరోజు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాను. కానీ నా ఇంట్లో పరిస్థితులు నాకు ఏమాత్రం సహకరించలేదు. మీ అందరితో పాటు నేను కూడా మీతో కొనసాగాలనుకున్నాను. కానీ ఆర్థిక వ్యవస్థ నన్ను దూరం పెట్టింది. నా కుటుంబ వ్యవస్థ ఆర్థిక పరిస్థితి భరించలేక నన్ను ఆహుతి కోరింది. ప్రతీ నెల వేతనాలు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. యథావిధిగా ప్రతినెల జీతం వచ్చేది ఉంటే నా పరిస్థితి ఇలా ఉండేది కాకపోవచ్చు. నా ఆర్థిక వ్యవస్థ నన్ను సంక్షభంలో ముంచేసింది. కుటుంబంలో పూట గడవని పరిస్థితి తలెత్తింది. ఏమి చేయాలో అర్థం కాక.. మిమ్మల్ని వీడి పోతున్నాను. నన్ను క్షమించండి. నా కుటుంబానికి అండగా ఉండండి, చిరకాలం మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాను’.

ఇవికూడా చదవండి..

Outsourcing Agencies | తెలంగాణలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నిలువు దోపిడీ?
Outsourcing Employees | తొందరేముంది.. చూద్దాంలే! ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలపై డిప్యూటీ సీఎం నాన్చుడు?
ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల కమీషన్ రూ.900 తీసుకునేది రూ.12 వేలు