Outsourcing Employees | తెలంగాణ వ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాల కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. రెండు నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా వారిని ప్రభుత్వం పస్తు పెడుతున్నది. నెలనెలా జీతాలు వస్తేనే బతకలేని ప్రస్తుత పరిస్థితుల్లో రెండు నెలలు పెండింగ్‌లో పెట్టడంతో తమ పరిస్థితి దయనీయంగా ఉన్నదని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వాపోతున్నారు. బొటాబొటీ జీతాలతో పనిచేసే వారికి డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క డబ్బులు ఇవ్వకుండా, బడా కాంట్రాక్టర్లకు వందల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదలు, మధ్య తరగతి ప్రజల కోసం తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని గొప్పలు చెప్పుకోవడం తప్పితే ఆచరణలో మాత్రం అది కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 52 ప్రభుత్వ విభాగాలు, కార్పొరేషన్లు, సొసైటీలలో సుమారు రెండు లక్షల మంది వరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో సుమారు పాతిక నుంచి ముప్పై వేల మంది వరకు కార్పొరేషన్లు, సొసైటీల్లో కొనసాగుతున్నారు. మిగతా వారందరూ ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్నారు. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ముగింపు (మార్చి 31వ తేదీ) వరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారు. ఆ తరువాతి నెల ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏడాది పాటు విభాగాలవారీగా ఆర్థిక శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల కోసం బడ్జెట్ కేటాయిస్తుంది. ఏడాది పాటు ప్రస్తుతం పనిచేస్తున్న వారికి లేదా కొత్తవారికి జీతాలు చెల్లించేందుకు ఆమోదం తెలిపే బడ్జెట్ ఫైలు ప్రస్తుతం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వద్ద పెండింగ్‌లో ఉన్నదని సమాచారం. ఆయన ఫైలును పరిశీలించి సంతకం చేస్తే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు ఖజానా నుంచి మంజూరు అవుతాయి. సదరు ఫైలుపై ఆమోదం తెలపాల్సిందిగా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు కోరుతున్నా.. డిప్యూటీ సీఎం మాత్రం నాన్చుడు ధోరణి అనుసరిస్తున్నారని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఈ విషయమై అడిగితే.. ‘అంత తొందర ఏముంది? చూద్దాం లే..’ అంటూ ఫైలును పక్కనపెట్టారని విశ్వసనీయంగా తెలిసింది. ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలు ఇవ్వకుండా, రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించకుండా.. ఏడాదిన్నర కాలంగా ముప్పుతిప్పలు పెడుతున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు వాపోతున్నారు. కొందరు ఉద్యోగులు అయితే రూ.1 లక్ష పెండింగ్ బకాయిల కోసం కూడా సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారంటే ఆర్థిక శాఖ నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చని అంటున్నారు. బడా బడా కాంట్రాక్టర్లకు మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వందల కోట్ల రూపాయలు చకచకా చెల్లిస్తున్న ఆర్థిక శాఖ.. చిన్న ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల బాధ్యతగా పనిచేయకపోవడం శోచనీయమని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు.
పదవీ విరమణ చేసిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కొద్ది నెలల క్రితం తనకు రావాల్సిన రూ.1 కోటి కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేషీలో ఒక ఉద్యోగిని సంప్రదించారని తెలిసింది. తాము చెప్పిన ప్రకారం పదిశాతం కమీషన్ ఇస్తే వెంటనే మంజూరు చేస్తామని, లేదంటే ఆ డబ్బులు వచ్చే వరకు ఎదురు చూడాల్సిందేనని ముఖం మీదే చెప్పారని సమాచారం. అవి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని, అంత మొత్తం ఇచ్చుకోలేనని చెబితే ఏమాత్రం విన్పించుకోలేదని తెలిసింది. ‘ఏడాది వరకు ఇవ్వకుండా ఆపితే వడ్డీ రూపంలో ఎంత నష్టపోతారో తెలుసా? ఆ మొత్తాన్నే మేము అడుగుతున్నాం’ అంటూ సదరు అధికారులు బదులివ్వడంతో ఆ రిటైర్డ్ ఉద్యోగి చేసేదేమీ లేక బయటకు వెళిపోయారని చర్చించుకుంటున్నారు. తెలంగాణ ఆర్థిక శాఖ దుస్థితి, దబాయింపులకు ఇదొక నిదర్శనంగా ఉందని పలువురు అంటున్నారు.
ఎక్సైజ్, ఆరోగ్య, అటవీ శాఖలో రెండు నెలల నుంచి, తెలంగాణ మోడల్ స్కూలులో మూడు నెలల నుంచి, గిరిజన గురుకులాల్లో ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని సమాచారం. ప్రతి నెలా జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబాలను నెట్టుకురావడం చాలా కష్టంగా ఉందని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వాపోతున్నారు. ప్రతి నెలా మొదటి వారంలో పాల బిల్లు, ఇంటి కిరాయి, కిరాణా సరుకుల కొనుగోలు, పిల్లల బడి ఫీజులు, కాలేజీ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నందున వ్యయం కూడా ఎక్కువగానే ఉంటుంది. సుమారు ఒక లక్షా డెబ్బై వేల మంది రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఎప్పుడు చెల్లిస్తారా? అని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. సచివాలయంలోని ఒక విభాగంలో పనిచేస్తున్న ఐదుగురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇటీవల పీకి పారేశారు. రేపటి నుంచి రావొద్దు అని రెండు రోజుల క్రితం ముఖం మీదే చెప్పేశారని తెలిసింది. హఠాత్ వార్త తెలిసిన ఆ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురై ఇంటి ముఖం పట్టారు. అందులో ఒక ఉద్యోగి భువనగిరి రైల్వే స్టేషన్ వరకు సైకిల్ పై వచ్చి, అక్కడి నుంచి రైలులో హైదరాబాద్ నాంపల్లి స్టేషన్‌కు వస్తారు. అక్కడి నుంచి సచివాలయానికి నడుచుకుంటూ వచ్చి డ్యూటీ చేసి తిరిగి సాయంత్రం రైలులో వెళ్తాడు. ఇలా పనిచేసే ఒక ఉద్యోగిని కనికరం లేకుండా సచివాలయం అధికారులు తొలగించడం మానవత్వానికే మచ్చగా మారిందని ఉద్యోగ నేతలు చెబుతున్నారు. ఇలా తొలగించిన ఉద్యోగి జీతం పొదుపు చేసిన సొమ్ములతో ప్రభుత్వం ఏం సాధిస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Outsourcing Employees | తెలంగాణలో ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు సర్కారీ మేత.. ఇదిగో లెక్క!
Outsourcing Employees | ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఊచకోత! పొదుపు చర్యల్లో తెలంగాణ సర్కార్..
Outsourcing Agencies | తెలంగాణలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నిలువు దోపిడీ?
Government Employees | ప్రభుత్వ ఉద్యోగులకు రూ.30వేల కోట్ల బకాయిల పాపం ఎవరిది?