- కోట్లు వెనకేసుకుంటున్న సంస్థలు! కల్పతరువులా మారిన ఔట్‌సోర్సింగ్
- ప్రభుత్వం నుంచి 10% కమిషన్.. ఆ మొత్తమే సుమారు వందకోట్లు
- పీఎఫ్, ఈఎస్ఐ సొమ్ములూ స్వాహా.. సెలవు పెట్టినా వేతనంలో కోతలు
- ఔట్ సోర్సింగ్ ఉండదన్న కేసీఆర్.. పదేళ్లలో రెట్టింపు నియామకాలు
- కాంగ్రెస్ ప్రభుత్వంలో భద్రత కరువు
- ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్
Outsourcing Agencies | ప్రభుత్వ నియామకాలు అటకెక్కిన వేళ.. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలే దిక్కవుతున్నాయి. దీని పేరుతో ప్రభుత్వానికి ఖర్చు తగ్గిందనుకున్నా.. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు మాత్రం కోట్లు వెనకేసుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నుంచే అధికారికంగా సంస్థలకు పదిశాతం కమిషన్ పేరిట నెలకు వంద కోట్లు వెచ్చిస్తున్నట్టు సమాచారం. బీఆరెస్ హయాంలో ఇబ్బడి ముబ్బడిగా ఔట్‌సోర్సింగ్ నియామకాలు సాగాయి. ఇప్పుడు ఆర్థిక కష్టాలు, పొదుపు చర్యల పేరిట ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు కత్తెర వేస్తుండటంతో సగటు ఉద్యోగస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల మంది వరకు వివిధ పేర్లతో ఔట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్నారని అంచనా. తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే భద్రత లభించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే వేతనం పూర్తిగా అందుతుందని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటున్నారు. ఏపీ రాష్ట్రం తరహాలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కేసీఆర్ హయాంలో యథేచ్ఛగా
తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులు ఉండరని, ఔట్ సోర్సింగ్ అనే పదం విన్పించకుండా పరిపాలన చేస్తానని ఉద్యమ సమయంలో కే చంద్రశేఖర్ రావు మాటలు చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి పీఠమెక్కగానే శాశ్వత నియామకాలను అటకెక్కించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెట్టింపు చేశారు. ఈ ఉద్యోగాలను ప్రైవేటు ఏజెన్సీలకు కల్పతరువుగా మార్చారు. కొత్త రాష్ట్రం, జోన్ల విభజన పేరుతో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించింది. ప్రభుత్వ శాఖల్లో పనులకు ఆటంకం లేకుండా ఉండేందుకు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ నియామకాలను పెద్ద ఎత్తున చేపట్టారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తమ ఉద్యోగాలకు భద్రత ఉంటుందని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కంటినిండా నిద్రపోయారు. అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తుండడంతో ఇప్పుడు వారిలో భయం మొదలైంది. ఆర్థిక లోటు పేరుతో ప్రభుత్వం కోతలకు సిద్ధమవుతున్నదన్న వార్తలు వారిలో గుబులు రేపుతున్నాయి. శాఖలవారీగా వివరాలు తెప్పించుకుని శాఖాధిపతులు కోతలు అమలు చేస్తున్నారని సమాచారం. ఒకేసారి తొలగించకుండా దశలవారీగా కార్యాచరణ అమలు చేస్తున్నారని తెలుస్తున్నది. కొందరు అధికారులు అయితే వారం పది రోజుల ముందే సమాచారం ఇచ్చి, వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదని చెబుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఇలాంటి సంఘటనలను తెలుసుకుని మిగతా ఆఫీసులలో పనిచేస్తున్నవారు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని టీజీఈ జేఏసీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. భద్రత కల్పించకపోగా ఖజానా లోటు పేరుతో, మిగులు సిబ్బంది పేరుతో తమ పొట్టకొడుతున్నారని వారికి తెలియచేశారు. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులకు ఈ విషయాన్ని వివరించారు.
కార్పొరేషన్ ఏర్పాటు చేయండి..
పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అదే తరహాలో తెలంగాణలోనూ ఏర్పాటు చేయాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆ దిశగా ప్రభుత్వం అధ్యయనం చేసి, నివేదిక రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఎన్ఎంఆర్, గౌరవ వేతనంతో ఎంత మంది? ఎక్కడెక్కడ పనిచేస్తున్నారనే వివరాలు సేకరించింది నివేదికను తయారు చేసింది. ఈ నివేదికపై మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి కార్యరూపం తీసుకు రావాల్సి ఉంది.
ప్రైవేటు ఏజెన్సీల ఆగడాలు… దోపిడీలు
శాశ్వత నియామకాలు లేకపోవడంతో ప్రైవేటు ఏజెన్సీలు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతున్నదని చెబుతున్నారు. వందల ఏజెన్సీలు కోట్లాది రూపాయలు దండుకుంటూ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నాయని అంటున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు 81,341, జీపీ ఎంపీడబ్ల్యూ 53,185, టీజీఆర్టీసీ ఔట్ సోర్సింగ్ 1,27,326, ఎన్ఎంఆర్, డైలీవేజ్ 13,138, గౌరవ వేతనజీవులు 2,18,830 కలిపితే మొత్తం సుమారు ఐదు లక్షల మంది వరకు పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. కొన్ని విభాగాలలో నాలుగు నెలల వరకు కూడా జీతాలు ఇవ్వకుండా సతాయిస్తున్నారు. అందుకు ఉపాధి హామీ సిబ్బందే ఉదాహరణ వారికి నాలుగు నెలల వేతనాలను ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీవోలతో సహా మొత్తం 3200 మందికి పైగా సిబ్బందికి రూ.62 కోట్లను విడుదల చేశారు. ఇప్పటికే కొందరి ఖతాల్లో జీతాలు జమ కాగా మిగతావారికి నేడో రేపో జీతాలు అందనున్నాయి. ఇదెలా ఉన్నా.. ఈఎస్ఐ, పీఎఫ్ అనేది మచ్చుకు కూడా కన్పించదు. కాని వారి నెలవారి వేతనాల నుంచి ఈ రెండింటిని అమలు చేస్తున్నామని డబ్బులు తీసుకుంటున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. పైగా ప్రొఫెషనల్ ట్యాక్స్ పేరుతోనూ కోతలు పెడుతున్నారని అంటున్నారు. ఉదాహరణకు ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి నెలకు రూ.15,600 వేతనం ఉంటే 12 శాతం ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ పేరుతో రూ.1,875, ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ కింద రూ.118, ప్రొఫెషనల్ ట్యాక్స్ పేరుతో రూ.110 కలుపుకుని మొత్తం రూ.2145 వరకు కట్ చేసి మిగతా మొత్తాన్ని చెల్లిస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ఇలా ప్రతి ఉద్యోగి నుంచి తీసుకోవడమే కాకుండా సెలవులు తీసుకుంటే అదనంగా కోత వేస్తారని సమాచారం. మరికొన్ని ఏజెన్సీలు రూ.2500 వరకు తీసుకుంటున్నాయని, కానీ వీటిని సంబంధిత ఖాతాల్లో జమ చేయడం లేదని తెలుస్తున్నది. ఫలితంగా ఈఎస్ఐ, పీఎఫ్ అమలు కావడం లేదు. తెలంగాణ అంబేద్కర్ సచివాలయంలోనే వీటిని అమలు చేయడం లేదని ఒక అధికారి తెలిపారు.
కార్పొరేషన్ ఏర్పాటుతో భద్రత, సక్రమ వేతనాలు
ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే నేరుగా ఉద్యోగుల ఖాతాల్లోకి వేతనాలు ప్రతి నెలా వేస్తారు. ఉద్యోగ భద్రత లభించడంతో పాటు ఏజెన్సీ వేధింపులు, కమిషన్ల బాధల నుంచి పూర్తి విముక్తి లభిస్తుంది. ఈఎస్ఐ, పీఎఫ్ కచ్చితంగా అమలు పరచే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నందున ఈ లాభాలు ఉంటాయని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ఒక్కో ఉద్యోగికి కనీసం రూ.2వేల నుంచి రూ.5 వేల వరకు అదనంగా ప్రయోజనం చేకూరుతుందనడంలో సందేహం లేదు. అంతే కాకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ విధానం అమలవుతుంది. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది పనిచేస్తున్నారు, ఎక్కడెక్కడ పనిచేస్తున్నారనేది ప్రభుత్వ వద్ద వివరాలు ఉంటాయి. ఒక శాఖలో వారి అవసరం లేనట్లయితే పనిభారం ఉన్న శాఖల్లోకి పంపించి ఉద్యగ భద్రత కల్పించే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుంది. అయితే కార్పొరేషన్ ను ఆర్థిక శాఖ పరిధిలోనా లేదా సాధారణ పరిపాలనా విభాగంలోనా (జీఏడీ) అనేది ప్రభుత్వం ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
TGEJAC | ఆర్థికంతో సంబంధం లేని సమస్యలే ఎక్కువ : టీజీఈజేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు
Bhu Bharathi | గ్రామానికో భూ భారతి వాలంటీర్ : లీఫ్స్ అధ్యక్షులు భూమి సునీల్
Giant Persons | 10 అడుగుల ఎత్తున్న మనుషులు ఈ భూమిపై నడిచారా? వారి కథేంటి?
Universe End | ఆకాశ పెను తుఫాన్‌తో తుడిచిపెట్టుకుపోనున్న విశ్వం! నిజమేనా? శాస్త్రవేత్తలేమంటున్నారు?
Hyderabad: గోపనపల్లిలో భారీ ఐటీ పార్క్! కంచగచ్చిబౌలి వివాదంతో.. మరో ప్రాంతంపై సర్కార్ కన్ను