విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో తాను కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని..కొత్త పార్టీపై త్వరలోనే ప్రకటన చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ పేరుతోనే తన కొత్త పార్టీ ఉంటుందని తెలిపారు. గురువారం బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణమండపంలో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో కవిత మాట్లాడారు. తెలంగాణ జాగృతి రాజకీయ శక్తిగా మారబోతుందని తెలిపారు. స్వీయ అస్థిత్వం, ఉద్యమ ఆకాంక్షలు, తెలంగాణ వాదాన్ని నిలబెట్టుకోవడం కోసమే రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు కవిత వెల్లడించారు. తమ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీగా ఉండబోదన్నారు. రాజకీయ పార్టీ స్థాపిస్తానంటే.. తనపై దాడి చేస్తున్నారని అసహనం వెలిబుచ్చారు.
త్యాగాలు, బలిదానాలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పదేళ్లు బీఆర్ఎస్ కు ఉద్యమకారులు అధికారం ఇస్తే అన్ని చేదు జ్ఞాపకాలే మిగిలాయని కవిత విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్య విలువలను కాలరాశారు అని, అహంకారం పెరిగి సోషల్ మీడియాలో చిన్న కామెంట్ పెట్టినా గత ప్రభుత్వం పోలీసులతో అరెస్ట్ చేయించింది అని, ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ఎత్తేశారని దుయ్యబట్టారు. అందుకే బీఆర్‌యస్ అధికారానికి దూరమైందని కవిత అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత.. చిన్న వారికి లాభం జరగలేదని తెలిపారు. కానీ మెగా కృష్ణారెడ్డి మాత్రమే కుబేరుడు అయ్యాడంటూ విమర్శించారు. ఉద్యమకారులకు ప్రభుత్వం తరఫున సాయం చేయాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అడిగితే, “ఎవరు ఉద్యమకారులు?” అని అన్నారు అని కవిత వెల్లడించారు. తెలంగాణ వచ్చాక ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఉద్యమ సోయి లేని రేవంత్ రెడ్డి సీఎం అవ్వడం దౌర్యాగ్యమన్నారు. గత పాలకులు అహంకారం ఎక్కువై ఓడిపోయారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలపై విమర్శలు సంధించారు. బీఆర్ఎస్ పాలకుల మాదిరిగా నా పక్కన పైరవీకారులు లేరని.. ఎప్పుడూ ఉద్యమకారులే ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కేసీఆర్ హయాంలో అసెంబ్లీ ముందు ఉద్యమకారుడు ఆత్మాహుతి చేసుకుని చనిపోయాడన్నారు. కేబీఆర్ పార్క్ వద్ద జయశంకర్ సార్ విగ్రహాం పెట్టాలని అప్పటి మున్సిపల్ మినిస్టర్ ను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసిన ఫలితం లేకపోయిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు అధికారం ఇస్తే.. అన్ని పార్టీలను విలీనం చేసుకున్నారంటూ విమర్శించారు.
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్లు ఉద్యమం అనే అగ్గి పుట్టాక 2001లో కేసీఆర్ పార్టీ పెట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని కవిత చెప్పారు. 1995లోనే వరంగల్ డిక్లరేషన్‍తో మలిదశ ఉద్యమం మొదలైందని ఈ ఉద్యమంలో మారోజు వీరన్న, గద్దర్ లాంటి ఎంతోమంది విప్లవకారులు, ప్రజాసంఘాల నాయకులు కీలకంగా వ్యవహరించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతునిచ్చిన ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తదితరుల లాంటి వారి వల్లే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్యమకారులు నమ్మారన్నారు. అయితే రెండేళ్లుగా హామీలు అమలు చేయకపోయినా వారు ఎందుకు మాట్లాడటం లేదంటూ కవిత సూటిగా ప్రశ్నించారు. హామీలు అమలు చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డిని సైతం ఉద్యమకారులు బంగ్లా నుంచి బయటకు గుంజుతారని జోస్యం చెప్పారు.ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సంక్షేమ బోర్డు ప్రకటన చేయాలంటూ రేవంత్ ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో 25 శాతం కోటాను ఉద్యమకారుల పిల్లలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాబోయే బడ్జెట్‍లో నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
iPhone 18 Pro Leaks | సరికొత్త అవతారంలో ఐఫోన్ 18 ప్రొ – చిన్న డైనమిక్ ఐలండ్, కొత్త రంగులు
Ambati Rambabu : అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్
