- రైతులకే వాలంటీర్ గా అవకాశం
- ఆసక్తి ఉన్నవారు వివరాలు పంపాలని సూచన
Bhu Bharathi | భూ సమస్యలపై రైతులకు సహాయం చేసేందుకు ప్రతి గ్రామానికి ఒక భూ భారతి (Bhu Bharathi) వాలంటీర్‌ను నియమించనున్నామని లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) సంస్థ అధ్యక్షుడు భూమి సునీల్ తెలిపారు. రైతులకు భూ భారతి చట్టాన్ని చుట్టం చెయ్యడానికి లీఫ్స్ సంస్థ ప్రయత్నం చేస్తుందని.. ఇందుకోసం ప్రతి గ్రామానికి భూ భారతి వాలంటీర్‌ను నియమించాలని నిర్ణయించామన్నారు. రైతులకు భూమి ఉంటే చాలదని.. అది రికార్డులకు ఎక్కాలని, పట్టా పాసుపుస్తకం ఉండాలని స్పష్టం చేశారు. అప్పుడే ఆ భూమిపై రైతులకు హక్కులు ఉంటాయని చెప్పారు. ప్రభుత్వం నుండి ఏదైనా లబ్ది పొందగలిగే అవకాశం వారికి ఉంటుందన్నారు. భూమి ఉన్న వారి వివరాలను రికార్డుకు ఎక్కించి పాసుపుస్తకాలు ఇచ్చే చట్టం భూభారతి అని గుర్తు చేశారు. పుస్తకం ఉండి రికార్డుల్లో తప్పులున్నా, పాసుపుస్తకంలో తప్పులు ఉన్నా ఈ చట్టం క్రింది సరిచేసుకోవచ్చని తెలిపారు. సాదాబైనామాలకు పట్టా పొందవచ్చని..ఇంత కీలకమైన చట్టం ప్రతి రైతుకు తెలియాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అందుకోసం ప్రతి గ్రామంలో ఒక రైతుకు ఈ చట్టంపై శిక్షణ ఇచ్చి వారిని భూ భారతి వాలంటీర్ గా తయారు చెయ్యాలని లీఫ్స్ సంస్థ సంకల్పించిందన్నారు. ఈ భూభారతి వాలంటీర్ల ద్వారా ఆ గ్రామంలోని రైతులకు భూభారతి చట్టంపై సలహాలు సూచనలు అందేలా చెయ్యాలనేది లీఫ్స్ సంస్థ లక్ష్యం అని తెలిపారు.
మీరు భూభారతి వాలంటీర్ గా పనిచేయాలంటే..!
భూభారతి వాలంటీర్ గా గ్రామాల్లో పని చెయ్యాలనుకుంటున్న రైతులు వారి వివరాలను ఈ క్రింది చిరునామాకు పోస్ట్ చేయాలని భూమి సునీల్ సూచించారు. భూభారతి వాలంటీర్ గా ఉండాలకునేవారు విధిగా రైతు అయ్యి ఉండాలని, గ్రామంలో నివాసం ఉండాలని, చదవడం వ్రాయడం వచ్చి ఉండాలని తెలిపారు. తోటి రైతులకు సహాయం చెయ్యాలనే తపన ఉండాలన్నారు. ఆసక్తి ఉన్న వారు తమ పేరు, వృత్తి, రెవిన్యూ గ్రామం పేరు, పంచాయతీ పేరు, మండలం, జిల్లా పేరు, వారి ఫోన్ నెంబర్ వివరాలు పంపించాలని సూచించారు. వివరాలను భూమి సునీల్ , లీఫ్స్ సంస్థ అధ్యక్షులు, 12-13-484/9/A..2వ అంతస్తు, నాగార్జున నగర్ రోడ్ నెంబర్ 2, బ్యాంకు ఆఫ్ బరోడా దగ్గర, తార్నాక, హైదరాబాద్ – 500007 చిరునామాకు పంపించాలని తెలిపారు. ఈ సమాచారాన్ని ప్రతి గ్రామానికి చేరేలా చేయడంలో అందరు సహకరించాలని కోరారు.