Bhu Bharathi | ధరణి పోయి భూభారతి వచ్చినా.. బుద్ధులు అవే..

రైతులకు అన్యాయం చేసిన ధరణిని బంగాళాఖాతంలో పడేసి.. న్యాయం చేసే విధంగా భూభారతి చట్టాన్ని తెచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఊదరగొడుతున్నా.. భూభారతిలోనూ సమస్యలు అలానే పడి ఉంటున్నాయని, పైగా కమీషన్లతోనే పనులు అవుతున్నాయని రైతులు, బిల్డర్లు వాపోతున్నారు.

Bhu Bharathi | ధరణి దరిద్రం వల్లనే గత ప్రభుత్వం ఓడిపోయిందని, అందుకే దానిని రద్దు చేసి భూభారతి చట్టం తెచ్చామని ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి ఇటీవల గొప్పలు చెప్పుకున్నారు. ఆచరణలో మాత్రం ధరణికి భూభారతికి ఏమీ తేడాలేదని భూయజమానులు, బిల్డర్లు వాపోతున్నారు. భూమి రికార్డుల్లో దిద్దుబాట్లు చేయడానికి గత ప్రభుత్వంలో ఏమి జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతున్నదని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కలెక్టర్లు కనీసం కొన్ని సమస్యలయినా స్వతంత్రించి పరిష్కరించేవారని, ఇప్పుడు కలెక్టర్లు గుమస్తాలుగా వ్యవహరిస్తున్నారని ఒక భూయజమాని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిపై నిషేధం ఎత్తివేయాలని కోర్టు తీర్పుతోపాటు భూభారతి టీఎం 15లో దరఖాస్తు చేస్తే మీరు మంత్రితో మాట్లాడుకోవాలని కలెక్టర్లు చెబుతున్నారని పేరు బయటపెట్టవద్దని కోరుతూ ఒక భూయజమాని తెలిపారు.

బాలాపూర్‌ భూమి కథ

రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని ఒక గ్రామంలో ఒక సర్వే నంబరులో 4.12 ఎకరాల భూమి ఒక యజమాని పేరుమీద ఉంది. ఆ భూమిపై వక్ఫ్‌ వాళ్లు వివాదం లేవనెత్తగానే ఆ భూమిని నిషేధంలో పెట్టి, నాడు ధరణి నుంచి, ఇప్పుడు భూభారతి నుంచి పక్కనబెట్టారు. వక్ఫ్ వాదన కరెక్టు కాదని హైకోర్టు సింగిల్ బెంచ్‌, ఇద్దరు జడ్జిల ధర్మాసనం, సుప్రీంకోర్టు వరుసగా కొట్టివేశాయి. ఆ తీర్పులన్నింటిలో పన్నెండు వారాలలో ఈ సమస్యను పరిష్కరించాలని కలెక్టరుకు ఆదేశాలిచ్చాయి. అయినా కలెక్టర్లు పట్టించుకోలేదు. ఆ యజమాని తిరిగి 2022లో తన భూమిని క్రమబద్ధీకరించాలని మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి.. పన్నెండు వారాలలోపు ఆ యజమాని ఆస్తులను నిషేధ జాబితానుంచి తొలగించాలని కలెకర్‌ను 2024 డిసెంబర్‌ 10న ఆదేశించారు. తీర్పు వచ్చి పది మాసాలు గడుస్తున్నది. ఆ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఇటువంటి కేసులు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో కోకొల్లలు.

30 శాతం ముట్టజెప్పాల్సిందేనట!

తమ భూమిని నిషేధం నుంచి తొలగించాలని కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకుంటే మంత్రిగారితో మాట్లాడుకొమ్మని చెబుతున్నారని గండిపేట మండలానికి చెందిన ఒక భూ యజమాని తెలిపారు. మంత్రిగారి సన్నిహితులేమో (మధ్యవర్తులు) భూమిపై నిషేధం తొలగిపోవాలంటే 30 శాతం భూమి వాటాగా ఇవ్వాలని కోరారని ఆ యజమాని ఆరోపించారు. ఈ 30 శాతం ఒక్క మంత్రికే కాదని, ఆయన పైవాళ్లకు కూడా ఆయన అప్పచెప్పుకోవాల్సి ఉంటుందని మధ్యవర్తులు చెబుతున్నారు. కొన్ని కేసుల్లో 20, 25 శాతం వాటాలు అడిగినట్టు మరో రియల్టర్ చెప్పారు. చట్టం ఏదయినా పద్ధతి మాత్రం మారలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూవివాదాలను పరిష్కరించే అధికారం కలెక్టర్లదే అయినప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ అంటూ వేసి సమస్యను జటిలం చేస్తున్నారని ఒక రెవెన్యూ అధికారి ఆరోపించారు.

సెటిల్మెంట్ల కోసమే కొత్త చట్టం!

చట్టంలో రాష్ట్ర స్థాయి కమిటీ వేయడానికి సంబంధించి ఎటువంటి వెసులుబాటు లేదని ఆ అధికారి తెలిపారు. సెటిల్మెంట్ల కోసమే ఈ కొత్త ఏర్పాటు వచ్చిందని ఆయన అన్నారు. మొత్తంగా కలెక్టర్లను డమ్మీలను చేసి, మంత్రులు భూరికార్డులతో ఆడుకుంటున్నారని ఒక రియల్ ఎస్టేట్ ప్రముఖుడు వ్యాఖ్యానించారు. భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ చేసుకోలేమన్న ఆబతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఆ ప్రముఖుడు చెప్పారు. ప్రభుత్వంలోని పెద్దల బుద్ధులు మారనంతవరకు చట్టాలు మారినా ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నవారికి 20 శాతం, 30 శాతం భూమి కమిషన్‌గా ఇచ్చి ప్రాజెక్టులు చేపడితే తాము మునిగిపోతామని, భూమి డెవలప్‌మెంట్‌కు ఇచ్చిన యజమానులు కూడా నష్టపోతారని, అందుకే తమ ప్రాజెక్టులను వాయిదా వేసుకుంటున్నామని ఒక రియల్టర్ చెప్పారు. పరిస్థితులు ఎప్పుడూ ఒక తీరుగా ఉండవు కదా కొంతకాలం ఆగి చూద్దాం అని ఒక రియల్టర్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి..

Junior IAS Corruption | భూమి సమస్య పరిష్కారమా? 17 కోట్లు ఇవ్వు! రియల్టర్‌కు ఒక జిల్లా కలెక్టర్‌ డిమాండ్‌!
Bhu Bharathi | భూ భారతి చట్టం అమలులో జాప్యం.. ప్రభుత్వంలో అస‌లేం జరుగుతోంది?
Bhu Bharathi | భూమి సమస్యా? మంత్రిగారు చెప్పాలె! తప్పించుకుంటున్న జిల్లాల కలెక్టర్లు.. 30% కమీషన్‌పై రంగంలోకి బ్రోకర్లు!