హైదరాబాద్, ఆగస్టు 23 (విధాత):
Land Values Revision | రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువలు (Land Values) భారీగా (drastically) పెంచడానికి సిద్దమైందని సమాచారం. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ (registrations department) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని తెలుస్తున్నది. ఈ నెల చివరి వారంలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ (cabinet) సమావేశంలో నిర్ణయం తీసుకొని, సెప్టెంబర్ 1వ తేదీ (september 1st) నుంచి పెంచిన ధరలను అమలు చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. భూముల విలువలను శాస్త్రీయ పద్ధతిలో సవరణ చేస్తామని ఇప్పటికే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. భూముల విలువ సవరణ ద్వారా బ్లాక్ మనీ చెలామణీకి కూడా అడ్డుకట్ట వేయవచ్చునని సర్కారు భావిస్తున్నదని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా భూముల లావాదేవీలు ఏ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతున్నాయో గుర్తించి, ఆ యా ప్రాంతాల్లో రెండు నుంచి మూడు రెట్లు భూముల విలువ అదనంగా పెంచాలన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కారు కృత నిశ్చయంతో ఉందని విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం భారీగా పడిపోవటంతో రిజిస్ట్రేషన్ల ద్వారా దానిని పూడ్చుకునే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిసింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో భూముల ధరల సవరణపై మరోసారి కమిటీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు తెప్పించుకున్నదని చెబుతున్నారు. వాటి ఆధారంగానే సవరణ చేస్తారని సమాచారం. భూముల ధరల సవరణతో అదనంగా రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా వేసింది. ఈ మేరకు గత నెలలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
2021లో 20 శాతం, 2022లో 33 శాతం పెంపు
భూముల విలువలను 2021లో అప్పటి బీఆరెస్ ప్రభుత్వం 20 శాతం పెంచింది. ఆ తరువాత 2022లో 33 శాతం పెంచింది. అదే చివరిసారి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత గత ఏడాది జూన్‌లోనే భూముల ధరలు సవరించాలని అనుకున్నారు. కానీ ఏకారణాల చేతనో ఆచరణరూపం దాల్చలేదు. అలాగే అర్బన్ ఏరియాల వరకు మాత్రమే మార్కెట్ ధరలు పెంచాలనుకున్నప్పటికీ, తాజాగా రాష్ట్రవ్యాప్తంగా సవరించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తున్నది. వ్యవసాయ భూముల ధరలు కూడా సవరించాలన్న నిర్ణయంతో ఉన్నట్టు తెలిసింది. కొన్నిచోట్ల బహిరంగ మార్కెట్ కంటే చాలా తక్కువగా రిజిస్ట్రేషన్ల ధరలు ఉంటే.. మరికొన్ని చోట్ల బహిరంగ మార్కెట్ ధర కంటే అధికంగా రిజిస్ట్రేషన్ విలువ ఉన్నది. బహిరంగ మార్కెట్ ధరకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ధరలు ఉండే విధంగా సవరణ చేయనున్నారు. ఈ మేరకు కొన్ని చోట్ల వ్యవసాయ భూముల ధరలు మూడింతలు పెరిగే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. అయితే మహిళలకు1.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించాలన్న నిర్ణయంతో రేవంత్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.
ఔటర్ లోపలి ప్రాంతాల నుంచే భారీ ఆదాయం
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతాల నుంచే రిజిస్ట్రేషన్ల శాఖకు భారీ 60శాతం ఆదాయం వస్తున్నది. తాజాగా ఇక్కడ భూముల ధరల సవరణతో ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాల్లోని ప్లాట్లు, భూముల విలువ మూడింతలు పెరిగే అవకాశం ఉంది. రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో భూముల వ్యాపారం బాగా పెరింది. బహిరంగ మార్కెట్‌లో భూముల విలువలు భారీగా పెరిగాయి. మరో వైపు ఫ్యూచర్ సిటీలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకునే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ వరకూ ఉన్న ఏరియాల్లో భారీగా భూముల మార్కెట్ విలువను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆదాయం పెరగడంతో పాటు మార్కెట్‌లో అసమానతలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తున్నది.
కోర్ అర్బన్ ఏరియాల్లో…
ప్రస్తుతం వ్యవసాయ భూములకు మార్కెట్ విలువ ఎకరానికి రూ. 6 లక్షల వరకు ఉన్నది. ఆ యా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌లో ఉన్న రేట్లను పరిశీలించి ఎకరాకు రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో (కోర్ అర్బన్ ఏరియాల్లో) ఎకరానికి రిజిస్ట్రేషన్ ప్రకారం మార్కెట్ విలువ రూ. 20 లక్షలు మాత్రమే ఉండగా బహిరంగ మార్కెట్‌లో ఆయా ప్రాంతాల్లో డిమాండ్‌ను బట్టి కోటి రూపాయల నుంచి రూ.5 కోట్లు, రూ.10 కోట్లు రూ.15 కోట్లు, రూ. 20 కోట్ల వరకు ధరలు పలుకుతున్నాయి. ఇలాంటి ప్రాంతాలను గుర్తించి, వాటి విలువ బహిరంగ మార్కెట్ ప్రకారంగా ఉండేలా 300 శాతం వరకు పెంచే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఫ్లాట్ల ధరలు పెంపు, వాణిజ్య స్థాలాల ధరల తగ్గింపు
ఔటర్ రింగ్ రోడ్ లోపల భారీ ఎత్తున భనవ నిర్మాణాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున అపార్ట్‌మెంట్‌లు, విల్లాల నిర్మాణం జరుగుతున్నది. దీనిని గుర్తించిన ప్రభుత్వం చదరపు అడుగుకు ప్రస్తుతం ఉన్న రూ.2,200 మార్కెట్ ధరను రూ.2,800లకు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే నగరంలో వాణిజ్య స్థలాల మార్కెట్ అంతగా లేదు. వాణిజ్య కార్యకలాపాలకు ఊతం ఇవ్వాలన్న నిర్ణయంతో ఉన్న రేవంత్ సర్కారు వాణిజ్య స్థలాల విలువను తగ్గించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాణిజ్య స్థలాలకు మార్కెట్ విలువ చదరపు అడుగుకు రూ. 7 వేలు ఉన్నది. దీనిని రూ. 6500 లకు తగ్గించాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతిపాదనల్లో పొందు పరిచినట్లు తెలుస్తోంది. ఈ తగ్గింపు మందగించిన వాణిజ్య కార్యకలాపాలు పుంజుకోవడానికి వీలు కల్పిస్తుందని అంచనా వేసినట్టు సమాచారం.