India Crushed by 76 Runs vs South Africa in Super 8; Net Run Rate Slips to –3.8
టి20 ప్రపంచకప్ సూపర్–8: భారత్‌కు భారీ షాక్
దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం పాలైంది. 188 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక 111 పరుగులకే కుప్పకూలి సెమీస్ అవకాశాలను కూడా కఠినతరం చేసుకుంది. దారుణంగా పడిపోయిన నెట్‌రన్‌రేట్ వల్ల మిగిలిన 2 మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవడంతో పాటు ఇతర జట్ల గెలుపోటములపై కూడా ఆధారపడాల్సివస్తోంది.
విధాత క్రీడా విభాగం | 22 ఫిబ్రవరి 2026 | హైదరాబాద్:
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ – దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న సూపర్–8 మ్యాచ్‌లో 76 పరుగుల భారీ తేడాతో భారత్ ఘోర పరాజయం పాలైంది. భారత్ టి20 మ్యాచ్ విజయపరంపరకు అడ్డుకట్ట వేస్తూ, దక్షిణాఫ్రికా భారత్‌ను ఓడించడమే కాకుండా, సెమీస్ అవకాశాలను కూడా గణనీయంగా దెబ్బతీసింది. 76 పరుగుల తేడా వల్ల భారత్ నెట్‌రన్‌రేట్ దారుణంగా పడిపోయి –3.8గా నమోదైంది.
పవర్‌ప్లేలోనే తేలిపోయిన భారత్ ఓటమి – పెవిలియన్‌కు క్యూ కట్టిన బ్యాటర్లు
188 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్‌లు తగిలాయి. ఇషాన్ కిషన్ ఖాతా తెరవకముందే అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ 5 పరుగులు, అభిషేక్ శర్మ 26 పరుగులు చేసి ఔటయ్యారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా 18 పరుగులకే పెవిలియన్ చేరడంతో జట్టు పూర్తిగా ఒత్తిడిలో పడింది.
వికెట్లు వరుసగా పడిపోవడంతో ఛేదన కష్టమైంది. శివమ్ దూబే మాత్రమే కొంత ప్రతిఘటన చూపించి 42 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు 20 పరుగుల మార్క్ కూడా దాటలేకపోయారు. ఫలితంగా భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలి 76 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.
పవర్‌ప్లే ఒత్తిడిని అధిగమించిన ప్రొటీస్ మిడిలార్డర్
కాగా, టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగుల భారీ స్కోరు సాధించింది. పవర్‌ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడినా, బ్రెవిస్ – మిల్లర్లు భారీ భాగస్వామ్యంతో ఆదుకుని జట్టును పటిష్టమైన స్థితిలో నిలిపారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాను పవర్‌ప్లేలోనే భారత్ భారీ దెబ్బ తీసింది. జస్ప్రీత్ బుమ్రా అద్భుత లైన్-లెంగ్త్‌తో టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. అర్ష్‌దీప్ సింగ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బుమ్రాకు సహకారం అందించగా, తొలి ఆరు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా తీవ్ర ఒత్తిడిలో పడింది. అయితే యువ ఆటగాడు డివాల్డ్ బ్రెవిస్ స్పిన్నర్లపై దూకుడుగా దాడి ప్రారంభించాడు. మరో ఎండ్‌లో అనుభవజ్ఞుడు డేవిడ్ మిల్లర్ సమయోచిత షాట్లతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యం రన్‌రేట్‌ను వేగంగా పెంచింది. బ్రెవిస్ 45 పరుగులకు ఔటైనా, మిల్లర్ 63 పరుగులతో అర్ధశతకం పూర్తి చేసి జట్టును పటిష్టమైన స్థితికి చేర్చాడు. వీరిద్దరూ 4 వికెట్‌కు 97 పరుగులు జత చేసారు. ఇదే దక్షిణాఫ్రికా భారీ స్కోరుకు పునాది వేసింది. 15వ ఓవర్‌లో వరుణ్ చక్రవర్తి మిల్లర్‌ను ఔట్ చేయడంతో భారత్‌కు ఊరట లభించింది.
చివరి దశలో మళ్లీ బుమ్రా తన క్లాస్ చూపించి కీలక వికెట్లు సాధించాడు. బుమ్రా నాలుగు ఓవర్లలో కేవలం 15 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసాడు. కానీ, హార్థిక్ పాండ్యా చివరి 20వ ఓవర్‌లో ట్రిస్టన్ స్టబ్స్ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది, మొత్తంగా 20 పరుగులు పిండుకోవడంతో దక్షిణాఫ్రికా స్కోరు అమాంతం పెరిగింది. 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన స్టబ్స్ ఇన్నింగ్స్‌కు మెరుపు ముగింపు ఇచ్చాడు.
ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీసుకోవడం ద్వారా టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అవతరించాడు. అతను 33 వికెట్లతో అర్షదీప్ సింగ్(32)ను అధిగమించాడు.
సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ఇండియా
రెండు ఇన్నింగ్స్‌లలోనూ పవర్‌ప్లే ఇరుజట్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టినా, దక్షిణాఫ్రికా పటిష్టమైన భాగస్వామ్యంతో కోలుకోగా, భారత్ సరిగ్గా అక్కడే విఫలమైంది. సరైన భాగస్వామ్యాలను నెలకొల్పలేక చతికిలపడింది. ఈ భారీ ఓటమి భారత సెమీస్ అవకాశాలను కూడా సంక్లిష్టం చేసింది. మిగిలిన రెండు మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవడంతో పాటు, ఇతర జట్ల గెలుపుపై కూడా ఆధారపడాల్సివస్తోంది. ఫిబ్రవరి 26, గురువారం నాడు చెన్నైలో జింబాబ్వేతో తలపడాల్సిఉండగా, మార్చి 1న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో ఆడాలి.
