Bhu Bharathi | భూమి సమస్యా? మంత్రిగారు చెప్పాలె! తప్పించుకుంటున్న జిల్లాల కలెక్టర్లు.. 30% కమీషన్‌పై రంగంలోకి బ్రోకర్లు!

కాంగ్రెస్‌ నాయకులు గొప్పగా చెబుతున్నప్పటికీ.. తెలంగాణలో అమల్లోకి తెచ్చిన భూభారతి.. రైతుల ప్రయోజనాలను ఆశించిన స్థాయిలో నెరవేర్చలేక పోతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఇచ్చినా.. నిషేధిత జాబితాల నుంచి భూములను తొలగించే విషయాల్లో మంత్రుల జోక్యం ఉంటున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

  • Publish Date - July 25, 2025 / 03:30 AM IST

Bhu Bharathi | హైద‌రాబాద్‌, జూలై 24 (విధాత‌): గత బీఆరెస్‌ హయాంలో ఘనంగా తెచ్చిన ధరణి.. రైతులకు దారుణంగా చుక్కలు చూపించింది. ఇదే విషయాన్ని గత ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన కాంగ్రెస్‌ నేతలు.. తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామని, రైతుల సమస్యల పరిష్కారానికి గొప్ప విధానం తీసుకొస్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడానికి ఇది కూడా కీలక అంశంగా పనికి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ధరణి స్థానంలో భూభారతి పేరిట కొత్త చట్టం తీసుకొచ్చింది. భూమి వ్యవహారాల నిపుణుల సారథ్యంలో సామాన్య రైతులకు ఎంతో ప్రయోజనం కలిగించేలా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినా.. అమలు విషయంలో మాత్రం వారిని తీవ్ర నిరాశకు గురి చేస్తున్నది. భూమి వివాదాల పరిష్కారంలో జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలకు పరిష్కారాలకు భూభారతి చట్టం చెబుతున్నది. మిస్సింగ్ స‌ర్వే నంబ‌ర్లు, మిస్సింగ్ ఎక్స్‌టెంట్లు, కోర్టు ఆదేశాల అమ‌లు, ప‌ట్టాదార్ పాస్‌పుస్త‌కాలు, వైవాటి క‌బ్జాలు, సాదా బైనామాలు, భూమి విస్తీర్ణం, పేర్ల త‌ప్పుప్పొప్పుల స‌వ‌ర‌ణ ఇలా దాదాపు 42 ర‌కాల భూమి స‌మ‌స్య‌ల‌ను పరిష్క‌రించే అధికారం భూ భార‌తి చ‌ట్టం ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం క‌లెక్ట‌ర్లు, ఆర్డీవోలకు అప్పగించింది. ఈ చ‌ట్టం అమ‌లులో ముఖ్య‌మంత్రి కానీ, మంత్రులు కానీ జోక్యం చేసుకునే అవ‌కాశ‌మే లేదు. క‌నీసం వారికి ఒక ఫైల్ కూడా వెళ్ల‌దు. అయిన‌ప్ప‌టికీ హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్‌, సంగారెడ్డి, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాల ప‌రిధిలో ప్ర‌తి చిన్న విష‌యానికి క‌లెక్ట‌ర్లు మంత్రితో మాట్లాడుకోమ‌ని చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు.

ఇదే అదనుగా బ్రోకర్లు రంగంలోకి దిగుతున్నారని సమాచారం. సమస్య ఉన్న భూమి విషయం మంత్రి వద్దకు తీసుకెళతామని, సమస్య పరిష్కరించేలా చూస్తామని చెబుతున్నారు. అయితే.. అందుకు సమస్య ఉన్న భూమి విస్తీర్ణంలో 25 శాతం నుంచి 30 శాతం వరకూ తమకు ఇవ్వాల్సి ఉంటుందని డిమాండ్‌ చేస్తున్నట్టు పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందా? అని రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భూభారతి చట్టం గొప్పగా.. ఉన్నా.. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా.. ధరణికంటే అమల్లో దరిద్రంగా తయారైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ వివాదాలను పట్టుకొని రియల్టర్ల వద్దకు వెళుతున్న బ్రోకర్‌ ముఠాలు.. తాము సీఎం సహా పలువురు మంత్రులకు సన్నిహితులమని చెబుతూ.. డబ్బు గుంజేందుకు ప్రయత్నిస్తున్నాయని సమాచారం. గ‌తంలో నిషేధంలో లేని భూముల‌ను కూడా నిషేధిత జాబితాలో చేర్చుతున్నార‌ని, ప్రైవేట్ భూమిని ఏకంగా ప్ర‌భుత్వ భూమి అని న‌మోదు చేస్తున్నార‌ని ఒక నిర్మాణ రంగ ప్ర‌ముఖుడు ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

గ‌తంలో అనేకమంది భూముల‌కు లావాదేవీలను నిషేధిస్తూ కోర్టు ఆదేశాలు ఇస్తే అప్ప‌టి జిల్లా క‌లెక్ట‌ర్ ఆ ఆదేశాల‌ను అమ‌లు చేశారు. పూర్తిస్థాయి విచార‌ణ త‌రువాత అదే కోర్టు ఆ భూముల‌పై విధించిన నిషేధం చెల్ల‌ద‌ని తీర్పు ఇస్తే ప్ర‌స్తుతం బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న జిల్లా క‌లెక్ట‌ర్ కోర్టు ఆదేశాల‌ను అమ‌లు చేయ‌డం లేదని తెలుస్తున్నది. ఆదేశాలు అమలు చేయాలంటే పైవాళ్లతో మాట్లాడుకోవాలని బాధితులకు సలహాలు ఇస్తున్నట్టు తెలిసింది. కొన్నిచోట్ల కోర్టు ఆదేశాలు అమ‌లు చేయ‌క‌పోగా కొత్త‌గా లీగ‌ల్ త‌గాదాలు సృష్టించ‌డం కోసం ఎటువంటి ప‌త్రాలు లేక‌పోయినా, ఫేక్ డాక్యుమెంట్లు చూపించి ఫిర్యాదుల చేయిస్తున్నారని బాధితులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

నిషేధిత జాబితాలో పొందుప‌రిచిన భూమిని తిరిగి ఆ జాబితా నుంచి తొల‌గించ‌డానికి భూ భార‌తి చ‌ట్టం సెక్ష‌న్ 8 వీలు కల్పిస్తున్నది. ఈ సెక్షన్‌ కింద.. నిషేధిత జాబితా నుంచి సదరు భూమిని తొలగించాలని కోర్టు ఆదేశిస్తే.. మీ-సేవా కేంద్రం ద్వారా కానీ స్వ‌యంగా ఆన్‌లైన్‌లో కానీ ఆ ఆదేశాల ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు చేసిన 30 రోజుల్లోగా ఆర్డీవో కానీ, జిల్లా క‌లెక్ట‌ర్ కానీ నిషేధిత జాబితా నుంచి ద‌ర‌ఖాస్తు దారుడి భూమి నుంచి తొల‌గించాల్సిందే. దీనికి మంత్రి సిఫార‌సు కానీ, ముఖ్య‌మంత్రి సిఫార‌సు కానీ అవ‌స‌రం లేద‌ని న్యాయ‌నిపుణులు చెపుతున్నారు. ఏ కార‌ణం చేత‌నైనా క‌లెక్ట‌ర్ కానీ, ఆర్డీవో కానీ కోర్టు ఆదేశాలను అమ‌లు చేయ‌క‌పోతే ద‌ర‌ఖాస్తు దారుడు తిరిగి కోర్టుకు వెళ్లవ‌చ్చున‌ని చెపుతున్నారు.

భూమి స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ముఖ్య‌మంత్రి, మంత్రుల పాత్ర చ‌ట్టం త‌యారు చేయ‌డం వ‌ర‌కేనని పదవీ విరమణ చేసిన ఒక రెవెన్యూ ఉన్నతాధికారి చెప్పారు. చ‌ట్టం అసెంబ్లీ ఆమోదం పొందిన త‌రువాత శాఖ కార్య‌ద‌ర్శి మంత్రితో క‌లిసి వ‌ర్కింగ్ రూల్స్‌ను చ‌ట్టం వెలుగులో రూపొందిస్తారు. ఈ రూల్స్‌లోనే ఏ అధికారి ఏ స‌మ‌స్య‌ను పరిష్క‌రించాలో స్ప‌ష్టంగా ఉంటుంది. చ‌ట్టం అమ‌లులో రోజువారీగా వ‌చ్చే ఇబ్బందులను తొల‌గించి, క‌లెక్ట‌ర్ల‌కు, అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ల‌కు, ఆర్డీవోల‌కు, ఎమ్మార్వోల‌కు స్ప‌ష్ట‌త ఇచ్చే బాధ్య‌త సీసీఎల్ఏది. భూ భార‌తి చ‌ట్టం వంద‌శాతం పకడ్బందీగా రూపొందింది. కానీ రూల్స్ రూప‌క‌ల్ప‌న‌లో తాసిల్దార్ల‌కు ఎలాంటి బాధ్య‌త‌లు ఇవ్వ‌కుండా తప్పు చేశారన్న అసంతృప్తి వ్యక్తమవుతున్నది. తాసల్దార్ల‌కు ధ‌ర‌ణిలో మాదిరిగానే రిజిస్ట్రేష‌న్‌, మ్యూటేష‌న్ వ‌ర‌కే అధికారాలు ఇచ్చారు. ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారంలో అంతా ఆర్డీఓలు, క‌లెక్ట‌ర్ల‌దే కీల‌క పాత్ర కావ‌డం గ‌మ‌నార్హం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ధ‌ర‌ణిలోనే భూమి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే అధికారం తాసిల్దార్లకు ఇచ్చారు. కానీ భూ భార‌తిలో మాత్రం ర‌ద్దు చేశారు. ఇది కూడా భూమి స‌మ‌స్య‌లు పేరుకు పోవ‌డానికి ఒక కార‌ణం అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన రెవెన్యూ అధికారి ఒక‌రు అభిప్రాయప‌డ్డారు.

భూమి సమస్యలకు సంబంధించి ఎక్కువ మంది చదివినవి..

Dharai X bhu Bharathi | ధరణి పెండింగ్ అప్లికేషన్లకు పరిష్కారం.. అన్ని సమస్యలకు ఒకే దరఖాస్తు
Bhu Bharathi  | భూ భారతిలో గ్రామ రెవెన్యూ ప‌టాలు ఎక్క‌డ‌?
Bhu Bharathi । భూ యజమానికి భరోసా కంప్యూటరా? కాగితమా? నిపుణులేమంటున్నారు?