Bhu Bharathi | తెలంగాణలో ప్రతి సర్వే నంబర్ భూమికి మ్యాప్ (పటం) ఉన్నది. రెవెన్యూ గ్రామానికి కూడా పటం ఉంది. నిజాం కాలంలో తయారు చేసిన టిప్పన్ల ఆధారంగా గ్రామ రెవెన్యూ పటాలను సర్వే సెటిల్ మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగం రూపొందించింది. ఈ పటాలన్నింటినీ రాష్ట్ర విభజనకు ముందుగానే కంప్యూటీకరణ చేసి, సీసీఎల్ఏ పోర్టల్‌లో నాటి ప్రభుత్వం పొందుపరిచి, ప్రజలకు అందుబాటులో ఉంచింది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) దీనిని నిర్వహించేది. ప్రతి ఒక్క రైతు భూ వివాదం కానీ గెట్టు సమస్య కానీ వచ్చినప్పుడు మీ-సేవ కేంద్రానికి వెళ్లి మ్యాప్ తీయించుకుని పరిశీలించుకునేవాడు. మీ సేవ కేంద్రాల నిర్వాహకులు రైతు అడిగిన వెంటనే మ్యాప్ ప్రింట్ కూడా తీసి ఇచ్చేవాళ్లు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కేసీఆర్ ప్రభుత్వం సీసీఎల్ఏ పోర్టల్‌ను మార్చి ధరణి పోర్టల్ తీసుకు వచ్చినప్పటికీ పటాలను అందుబాటులో ఉంచింది. కానీ రైతుల సమస్యలు పరిష్కరించే అవకాశం అధికారులకు ఇవ్వలేదు. దీంతో లక్షలాది మంది రైతుల సమస్యలు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన భూ భారతి చట్టంలో రైతుల సమస్యలు పరిష్కరించే అధికారం పూర్తిగా అధికారులకు అప్పగించారు. అధికారులు చేసిన పరిష్కారం నచ్చక పోతే అప్పీల్‌కు వెళ్లడానికి కూడా అవకాశం ఇచ్చారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ భూ భారతి వెబ్ పోర్టల్‌లో సర్వే నంబర్ల వారీగా గ్రామ రెవెన్యూ పటాలు ఎందుకు పొందుపరచలేదన్న సందేహాలు యావత్ రైతాంగంలో వ్యక్తం అవుతున్నాయి.
మళ్లీ డిజిటలైజేషన్?
ఈ మధ్యకాలంలో భూమి రికార్డులపై సమీక్ష నిర్వహించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. గ్రామ పటాలన్నీకాగితాలకే పరిమితం అయ్యాయని, వాటన్నింటినీ డిజిటలైజేషన్ చేస్తామని ప్రకటించారు. వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే కేంద్రంలోని యుపీఏ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ పటాలన్నీడిజిటలైజ్ చేసింది. డిజిటలైజేషన్ అయిన మ్యాప్‌లన్నింటినీ సీసీఎల్ఏ పోర్టల్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచారు. అప్పటి నుంచి అందుబాటులో ఉన్న గ్రామ పటాలను తాజాగా తీసి వేసి, మళ్లీ డిజిటైజేషన్ చేస్తామని ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. భూ భారతిలో గ్రామ రెవెన్యూ పటాలు ప్రదర్శించక పోవడంపై రైతుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. గ్రామ రెవెన్యూ పటం ఆన్‌లైన్‌లో ఒక్కో సర్వే నంబర్‌లో ఎన్నిఎకరాల భూమి ఉంది? ఆ భూమి ఎంత మంది పేరుతో.. ఎన్ని సబ్ డివిజన్‌లుగా ఉంది? అనే విషయాలపై స్పష్టతను ఇస్తుంది. ఇలా ఒక్కో సర్వే నంబర్ ఆర్ఎస్ఆర్ ఎంత? ఆ భూమి ఎంత మందికి ఉన్నదనేది క్రెడిస్టియల్ మ్యాప్‌లో స్పష్టంగా ఉండేది. ఇలా రైతుల సమాచారం స్పష్టంగా హద్దులతో సహా కనిపించే మ్యాప్‌లు, భూ భారతి రావడంతోనే మాయం కావడం, తాజాగా మంత్రి మ్యాప్‌లను డిజిటలైజ్ చేస్తామని ప్రకటించడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఒక రైతు వ్యాఖ్యానించారు.
ధరణికే స్వల్ప మార్పులు?
భూ భారతి చట్టం అమలులోకి వచ్చే నాటికి ప్రత్యేక పోర్టల్ రూపొందించి అమలు చేయాల్సి ఉండేది. కానీ ధరణి వెబ్ సైట్‌నే పేరు మార్చి.. కొంత ఆధునీకరించి అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా భూముల సమగ్ర సర్వే నిజాం కాలంలో చేపట్టారు. నాటి గ్రామ పటాలే నేటికీ అమలులో ఉన్నాయి. అయితే ఒక్కో సర్వే నెంబర్‌లో అనేక బై నంబర్లు వచ్చాయి. వాటన్నింటినీ కూడా గ్రామ రెవెన్యూ పటంలో చూపించే వివరాలలో సబ్ డివిజన్ నెంబర్లవారీగా కనిపించేవి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం భూ సమగ్ర సర్వే చేయాలన్న ఆలోచనలో ఉన్నది. ఈ మేరకు ఐదు గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఈ సర్వే కూడా దాదాపు పూర్తికావస్తున్నది. భూ భారతిలో రిజిస్ట్రేషన్ జరిగే భూ కమతానికి ప్రత్యేకంగా సర్వే చేసి మ్యాప్ రూపొందించాలని నిర్ణయించారు. ఆ తరువాతే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలన్న నిబంధన తీసుకువచ్చారు. భూ సమగ్ర సర్వే పూర్తిచేసి, కొత్త పటాలు రూపొందించే వరకు ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న పాత పటాలను భూ భారతి పోర్టల్‌లో పొందుపరచాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పటాలు లేని భూ భారతి పోర్టల్ ను కొనసాగిస్తే అనేక అనుమానాలకు తావిచ్చే ప్రమాదం ఉందని రియల్టర్లు, భూమి నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
భూమి సమస్యలకు సంబంధించి ఎక్కువ మంది చదివిన వార్తలు
Dharai X bhu Bharathi | ధరణి పెండింగ్ అప్లికేషన్లకు పరిష్కారం.. అన్ని సమస్యలకు ఒకే దరఖాస్తు
Dharani Vs Bhu Bharati | ధరణి Vs భూ భారతి.. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలేంటి..? రైతులకు మేలైంది ఏది..?
Bhu Bharati | ‘భూ భారతి’తో భూములు భద్రమేనా..? పేద రైతులకు మేలా..? కీడా..?