- ఏడాది గడువుపై రైతుల విస్మయం
- 70వేల మంది దరఖాస్తుదారుల్లో ఆందోళన
- కోర్టు మెట్లెక్కించేందుకే అధికారుల చర్యలు!
విధాత, హైదరాబాద్ :
Bhu Bharathi | భూభారతిలో రికార్డుల్లో తప్పొప్పుల సవరణలకు ప్రభుత్వం ఇచ్చిన గడువుకు ఇంకా మూడు నెలలే మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది 2026 ఏప్రిల్ 14 దాటితే.. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నీ ఆటోమేటిక్‌గా బుట్టదాఖలు కానున్నాయి. ఇప్పటికే 70వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో వీరంతా రికార్డుల్లో కరెక్షన్స్ కోసం కోర్టు మెట్లెక్కక తప్పదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం.. వారే న్యాయం కోసం కోర్టులకు వెళ్లాల్సిన దుస్థితిలోకి నెట్టేస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ధరణి స్థానంలో రైతులకు, భూ యజమానులకు ఉపయోగపడే విధంగా భూ భారతి వెబ్ పోర్టల్ తీసుకువచ్చామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు… అందులోని లోపాలను సరిదిద్ధడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పొప్పుల సవరణలకు ఏడాది మాత్రమే వ్యవధి నిర్ణయించడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమి గడువు అంటూ మండిపడుతున్నారు. గడువు దాటిన తరువాత రైతులు తమ సమస్య పరిష్కారం కోసం కోర్టులను ఆశ్రయించే పరిస్థితిని రెవెన్యూ ఉన్నతాధికారులు కల్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా భూ భారతి సమస్యలపై సమీక్షించి, తమకు మేలు కలిగించే నిర్ణయాలు తీసుకోవాలని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తీసుకువచ్చిన ధరణి వెబ్ పోర్టల్‌ను బంగాళాఖాతంలో పడేశామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు.. కనీసం చెత్తకుండీలో కూడా పడేయలేకపోతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ధరణిలో ఉన్న సమస్యలే భూ భారతిలో ఉత్పన్నమవుతున్నాయని రైతులు చెబుతున్నారు. మండల తహశీల్దార్ మొదలు.. సీసీఎల్ఏ వరకు ఎవరూ పరిష్కరించేందుకు చొరవ.. శ్రద్ధ చూపించడం లేదని రైతులు బహిరంగంగా మండిపడుతున్నారు.
- రాష్ట్రవ్యాప్తంగా 70వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అంచనా.
- రెవెన్యూ సదస్సులో స్వీకరించిన ఈ దరఖాస్తులను పరిష్కరించాలని రైతులు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. మోక్షం మాత్రం లభించడం లేదు.
- కేవలం సవరణ (కరెక్షన్) విభాగంలో తహశీల్దార్ పరిధిలో 25వేల దరఖాస్తులు, ఆర్డీవో పరిధిలో 6 వేలు, జిల్లా అదనపు కలెక్టర్ స్థాయిలో 3,500, జిల్లా కలెక్టర్ స్థాయిలో 7వేల వరకు దరఖాస్తులు.. పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
- ఇక నిషేధిత భూముల జాబితాకు వస్తే.. తహశీల్దార్ స్థాయిలో 8,500, ఆర్డీవో పరిధిలో 4 వేలు, అదనపు కలెక్టర్ల స్థాయిలో 7,500, జిల్లా కలెక్టర్ల స్థాయిలో 4వేల వరకు ఉన్నట్లు… లెక్కలు చెబుతున్నాయి.
- పేరు తప్పు పడిందని, సర్వే నంబర్లు సరిగా వేయలేదని, సర్వే నంబర్లలో తప్పులు, అక్షరాల్లో పొరపాట్లు ఉన్నాయని… ఇలా రకరకాల కారణాలతో వేల మంది రైతులు సవరణల కోసం దరఖాస్తులు సమర్పించారు.
నిషేధిత భూముల జాబితా విషయంలో కూడా రెవెన్యూ అధికారులు తమకు నచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆమ్యామ్యాలు ముట్టచెబితే ఒక రకంగా… లేదంటే మరో రకంగా ప్రవర్తిస్తున్నారని భూ యజమానులు ఆరోపిస్తున్నారు. భూ భారతి చట్టం అమల్లోకి తెస్తూ గత ఏడాది ఏప్రిల్ 14న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ఈ ఏడాది ఏప్రిల్ 13వ తేదీతో ముగియనున్నది. భూ రికార్డుల్లో తప్పులు దొర్లినా, వివరాలు సమగ్రంగా లేకపోయినా సంవత్సరంలోపు ఆన్ లైన్ విధానంలో సమరణలు కోరుతూ నిర్ధేశిత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆనాటి ఉత్తర్వుల్లో తెలిపింది.
దానర్ధం..
- గడువు దాటిన తరువాత దరఖాస్తులను పరిష్కరించే అధికారం.. రెవెన్యూ అధికారులకు ఉండదు.
- ఫలితంగా ఆ దరఖాస్తులన్నీ బుట్టదాఖలవుతాయి.
- ఆ తరువాత రైతులు తమ సమస్య పరిష్కారం కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎదురుకానుంది.
అదే జరిగితే.. మళ్లీ లాయర్లను పెట్టుకుని.. వేల రూపాయలు ఖర్చు చేసుకోవాల్సి వస్తుందని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మరో ఏడాది గడువు పెంచి, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి నిర్ధిష్ట కార్యాచరణ ప్రకటించాలనే డిమాండ్ భూ యజమానుల నుంచీ విన్పిస్తున్నది.
Read Also |
Telangana Municipal Elections | తెలంగాణ మునిసిపల్ రిజర్వేషన్ల మాయాజాలం.. పోటీకి వస్తారని తెలిసి ముందే తప్పించారా?
Train Rams Truck | రైల్వే క్రాసింగ్ వద్ద లారీని ఢీకొట్టిన రైలు.. షాకింగ్ వీడియో
KTR SIT Investigation | ఫోన్ ట్యాపింగ్ బ్లాక్ మెయిల్ తో ఎలక్ట్రోరల్ బాండ్లు : కేటీఆర్ కు సిట్ ప్రశ్నలు?
