విధాత, హైదరాబాద్ : భూ చట్టాల అమలులో ప్రభుత్వాలకు నిజాయితీ లోపించడంతో బడుగు, బలహీన వర్గాల, గిరిజన, దళిత వర్గాల భూములు బలవంతులు లాగేసుకుంటున్నారని మాజీ మంత్రి బీజేపీ మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. ధరణితో ఏర్పడిన భూ సమస్యలు భూ భారతీ తీర్చిందా అన్న అంశంపై సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్టూ యూనియన్, తెలంగాణ సోషల్ మీడియా జర్నలిస్టు ఫోరంలు నిర్వహించిన భూ భారతి రౌండ్ టేబుల్ సమావేశంలో ఈటెల మాట్లాడారు. ప్రభుత్వాలు భూసంరక్షణ చట్టాలను అమలు చేయడంలో నిస్వార్థంగా బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడంతో పేదల భూ దోపిడీ బారిన పడుతున్నారని ఈటెల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు గతంలో జారీ చేసిన చట్టాలకు విరుద్దంగా పాలకులు మరికొన్ని జీవోలు తెచ్చి భూ ఆక్రమణలదారులకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు గతంలో వచ్చిన ధరణి మాటున సాగిన భూ అక్రమాలు నిదర్శనమన్నారు.
భూముల విలువ పెరిగిపోవడంతో భూ కబ్జాలు పెరిగిపోయాయని..వీటిని అరికట్టాల్సిన పాలక వర్గాలు భూఆక్రమణలు, భూదందాలలో భాగస్వామిగా మారిపోవడంతో భూ సమస్యలు మరింత జఠిలం అవుతున్నాయని విమర్శించారు. అందుకే భూమి సమస్యల పరిష్కారంలో చట్టాలను నిజాయితీగా అమలు చేసే ప్రభుత్వాలు కావాలని ఈటెల కోరారు. ఈ సమావేశంలో టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎంపీ సీతారాములు నాయక్, న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్ , డిప్యూటీ కలెక్టర్ రాములు, తదితరులు హాజరై మాట్లాడారు.
ఇవి కూడా చదవండి :
King Cobra | కింగ్ కోబ్రా క్యాచింగ్.. బిగ్ డేరింగ్ !
APSRTC & TGSRTC Sankranti Revenue : తెలుగు రాష్ట్రాల ఆర్టీసీకి రికార్డు స్థాయిలో సంక్రాంతి రాబడి!
