అమరావతి : సంక్రాంతి పండుగ వేళ ఏపీ, తెలంగాణ ఆర్టీసీ సంస్థలు రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సాధించాయి. ఏపీఎస్ ఆర్టీసీసంక్రాంతి రద్దీ నేపథ్యంలో జనవరి 19న ఒక్కరోజే రూ.27.68 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఒక్కరోజే 50.6 లక్షల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది. ఆర్టీసీ చరిత్రలో ఒకేరోజులో ఇంత ఆదాయం ఆర్జించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది, సూపర్‌వైజర్లను ఆర్టీసీ ఎండీ ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి సంక్రాంతి పండగ కాసుల వర్షం కురిపించింది. మొత్తం 318 కోట్ల రూపాయలను తెచ్చిపెట్టింది. గత ఏడాది కేవలం 258 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయాన్ని గడించిన ఏపీఎస్ ఆర్టీసీ ఈ ఏడాది ఆదాయాన్ని పెంచుకోగలిగింది. ఈ నెల 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ లక్షలాది మంది ప్రయాణికులను ఆర్టీసీ గమ్యస్థానాలను చేర్చడం ద్వారా ఆదాయాన్ని మెరుగుపరుచుకుంది. మహిళలు కూడా భారీ సంఖ్యలో ఉచిత ప్రయాణాన్ని చేశారు.
తెలంగాణలలో రికార్డు ఆదాయం
సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) రికార్డు స్థాయి ఆదాయాన్ని గడించింది. పల్లె బాట పట్టిన ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోవడంతో ఆర్టీసీ ఖజానా కళకళలాడింది. ఈ నెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఛార్జీల రూపంలో ఏకంగా రూ. 67.40 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఆర్టీసీకి సగటున రోజుకు రూ. 13.48 కోట్ల రాబడి వచ్చినట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఈసారి ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరగడం, దానికి తగ్గట్టుగా సర్వీసులను పెంచడం ఆదాయం పెరగడానికి ప్రధాన కారణమైంది.
ఇవి కూడా చదవండి :
Kavitha : మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి పోటీ!
DGP RamaChandra Rao : సరసాల డీజీపీ అధికారిని సస్పెండ్ చేసిన కర్ణాటక సర్కార్
