Telangana Municipal Elections | తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు రాజకీయంగా మంటలు రాజేస్తున్నాయి. మునిసిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ పదవుల కోసం పోటీపడిన వారి ఆశలపై.. ఎమ్మెల్యేలు, ఎంపీలు నీళ్లు చల్లారన్న వాదనలు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. చైర్మన్ లేదా మేయర్‌గా ఎన్నికైతే మున్ముందు తమ సీటుకు ఎసరు పెట్టే అవకాశం ఉండటాన్ని ముందే పసిగట్టిన ఎమ్మెల్యేలు, ఎంపీలు జాగ్రత్తపడ్డారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొగ్గలోనే తుంచేయాలని నిర్ణయించి, అలాంటి నాయకుల రాజకీయ భవిష్యత్తుకు చెక్ పెట్టారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అందుకే.. మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల రిజర్వేషన్లను తమకు అనుకూలంగా మాల్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రిజర్వేషన్ల ఖరారులో వేలు పెట్టి అనుకున్న విధంగా మార్పులు, చేర్పులు చేయించుకున్నారని చెబుతున్నారు.
తెలంగాణలో మున్సిపాల్టీలు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించనున్నారు. బ్యాలెట్ పేపర్ విధానంలోనే ఫిబ్రవరి 15వ తేదీలోపు ఎన్నికలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి మున్సిపల్ అధికారులు వివరాలు పంపించారు. 26వ తేదీ తరువాత ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఈ నెల 16వ తేదీన పోలింగ్ స్టేషన్ల వారీగా ఫొటోలతో ఉన్న ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. మొత్తం 75 గుర్తులను కేటాయిస్తూ గెజిట్ కూడా ప్రచురించారు. 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ సీట్లను ఖరారు చేయగా, తెలంగాణ బీసీ కమిషన్ కుల గణన ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
మొత్తం 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో చైర్మన్లు, మేయర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసి, మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. 50 శాతం పదవులు మహిళలకు కేటాయించారు. కార్పొరేషన్లలో పోటీ చేసే అభ్యర్థుల వ్యయం 10 లక్షల రూపాయలు, గ్రేడ్ వన్ మునిసిపాలిటీలలో 5 లక్షల వరకు వ్యయ పరిమితిని నిర్ణయించారు.
నోటిఫికేషన్ తేదీ దగ్గరపడుతుండటంతో స్థానిక రాజకీయం ఒక్కసారిగా ఊపందుకున్నది. ఎమ్మెల్యే, ఎంపీ, డీసీసీ అధ్యక్షుడు, పీసీసీ వర్గం అంటూ డజన్ల మంది ఆశావహులు.. టికెట్ రేసులో ఉన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. జగిత్యాల, గద్వాల, బాన్సువాడ, పటాన్ చెరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే వర్గం, కాంగ్రెస్ వర్గం అంటూ రెండు గ్రూపులు ఉన్నాయి. ఇందులో ఏ వర్గానికి టికెట్ ఇచ్చినా, మరో వర్గం దూరమయ్యే ప్రమాదముంది. పార్టీ నిర్ణయం ప్రకారం టికెట్లు ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆశావహుల సంఖ్యను చూసి బెదిరిపోతున్నారు. అయితే ఇన్‌చార్జ్ మంత్రులు టికెట్ల ఎంపికలో తమ ప్రమేయం లేకుండా చేయాలని, ప్రచారం చేయడానికి మాత్రం సిద్ధమని పీసీసీ నాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం. కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్‌లో రెబెల్స్ బెడద అధికంగా ఉంది.
కొత్తగా వచ్చినవారు తమకు హామీ ఇవ్వడంతోనే పార్టీలో చేరామని చెబుతుండగా… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని అంటి పెట్టుకుని ఉన్నందున తమకే ఇవ్వాలని పాత నేతలు పట్టుబడుతున్నారు. ఇద్దరినీ సముదాయించలేక జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు.
ఈ సమస్య ఇలా ఉంటే చైర్మన్, మేయర్ పీఠాలపై ఆశలు పెట్టుకున్న నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో చైర్మన్ లేదా మేయర్ పీఠం దక్కుతుందని పలువురు సీనియర్ నాయకులు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడ్డారు. పార్టీ ఖరారు చేసిన అభ్యర్థులను గెలిపించడంలో తమ వంతుగా పనిచేసి, స్వంతంగా డబ్బులు కూడా ఖర్చు చేశారు. అభ్యర్థి నుంచి నయాపైస ప్రయోజనం ఆశించకుండా చేసిన వారు.. ఇప్పుడు రిజర్వేషన్ల ఖరారులో జరిగిన అన్యాయంపై నెత్తి నోరు కొట్టుకుంటున్నారని వారి అనుయాయుల మాటలను బట్టి తెలుస్తున్నది. రిజర్వేషన్ల ఖరారు విషయంలో ఎమ్మెల్యే లేదా ఎంపీ మాటకే ప్రభుత్వం విలువ ఇవ్వడంతో చాలా మంది ఆశావహులకు కోలుకోని విధంగా ఎదురు దెబ్బ తగిలిందని అంటున్నారు.
వచ్చే అసెంబ్లీ లేదా పార్లమెంటు ఎన్నికల నాటికి తమకు ఎక్కడ పోటీ వస్తారోనని గమనించి, పట్టున్న నాయకులను గుర్తించారని, ఆ నాయకుడి కుటుంబం నుంచి ఎవరూ పోటీలో రాకుండా ఉండేందుకు రిజర్వేషన్ల ఖరారును తమకు అనుకూలంగా మార్చుకున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. బలమైన నాయకుడికి టికెట్ దక్కకుండా ఉండేందుకు పావులు కదిపి, మరో వర్గానికి దక్కేలా ఖరారు చేయించారనే వైరివర్గీయులు ఆరోపిస్తున్నారు. రిజర్వేషన్లను ప్రకటించిన తరువాత పలువురు ఆశావహులు హతాశులయ్యారు. తాము ఇప్పుడున్న నేతలకు భవిష్యత్తులో పోటీగా వస్తామని భావించే.. వ్యూహాత్మకంగా తమను తప్పించారని లబోదిబోమంటున్నారు. ఇలా ఒక నియోజకవర్గం అనేది కాకుండా మెజారిటీ నియోజకవర్గాల్లో రిజర్వేషన్లను అస్త్రంగా మలుచుకుని, గట్టి పట్టు ఉన్న నాయకులకు వ్యతిరేకంగా ఖరారు చేశారని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
