Municipal Elections | మున్సి‘పోల్స్‌’లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ? బీజేపీ నామమాత్రమేనా…

రాష్ట్రంలో మరో ఎన్నికల సంగ్రామానికి తెర లేచింది. మున్సిపల్‌ ఎన్నికలకు నగారా మోగింది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్‌ ఆ ఫలితాలను రిపీట్‌ చేయాలనే సంకల్పంతో ఉండగా.. తాను మద్దతు పలికిన అత్యధికులు విజయం సాధించిన ఉత్సాహంలో బీఆరెస్‌ సైతం మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. ఈ రెండు పార్టీల పోటీ మధ్య బీజేపీ నామమాత్రంగానే ఉంటేందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telangana Municipal Election Schedule

విధాత, హైదరాబాద్:
Municipal Elections | రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు నగారా మోగింది. జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 1.30 గంటల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ జరుగుతుండగా, 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు ప్రకటించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం ఓటర్లు 52,43,000 ఉండగా, అందులో పురుష ఓటర్లు 25,62,000, మహిళా ఓటర్లు 26,80,000. ఫిబ్రవరి 16వ తేదీన మునిసిపాలిటీ ఛైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ల ఎన్నిక జరుగనున్నది.

తెలంగాణలోని 31 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్ నెలలో నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 5,5749 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలు, 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మద్ధతు పలికిన అభ్యర్థులు తలపడగా, కొన్ని చోట్ల బీజేపీ మద్ధతుతో పోటీ చేసిన వారు రెండు పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. మొత్తం సర్పంచి స్థానాలలో 6,821 కాంగ్రెస్ మద్ధతుదారులు గెలుచుకోగా, బీఆర్ఎస్ మద్ధతు ఇచ్చిన వారు 3,520 సర్పంచి స్థానాలను దక్కించుకున్నది. కేవలం 703 సర్పంచి పదవులను బీజేపీ మద్ధతుదారులు కైవసం చేసుకున్నారు. తొలి విడతలో ఎక్కువగా 395 సర్పంచ్‌ ఏకగ్రీవాలు అధికార కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డాయి. నువ్వా నేనా అనే విధంగా రెండు పార్టీల అభ్యర్థులు పోటీపడ్డారు.

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌, బీఆరెస్‌ పార్టీలు ఓటరు మొగ్గు ఎటువైపు ఉందనే విషయంలో ఇప్పటికే సర్వేలు చేయించుకున్నట్టు తెలుస్తున్నది. పట్టణంలో ఎన్ని వార్డులు ఉన్నాయి, ఏ వార్డులలో బలహీనంగా ఉన్నాం, మెరుగయ్యేందుకు ఏం చేయాలనే దానిపై వ్యూహ, ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకున్నాయని చెబుతున్నారు. చైర్మన్‌, మేయర్ స్థానాలను కైవసం చేసుకునేందుకు రెండు పార్టీలు తమదైన శైలిలో ముందుకు సాగుతున్నాయి.

స్థానిక జోష్ కాంగ్రెస్ కొనసాగించేనా?

స్థానిక సంస్థల్లో అత్యధిక స్థానాలను గెలుపొందిన జోష్‌మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ… మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లను దక్కించుకునేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకున్నది. అత్యధిక స్థానాలను సాధించేందుకు లోకసభ నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జ్‌లను నియమించింది. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు, పాత నాయకుల మధ్య విభేధాలు ఉన్నట్లు గమనించి రాష్ట్ర నాయకత్వం… వాటి పరిష్కారంపై దృష్టిసారించింది. రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సమావేశాలు కూడా నిర్వహించారు. గద్వాల, చేవెళ్ల, పటాన్‌చెరు, జగిత్యాల, బాన్సువాడ, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నేతల మధ్య విభేధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్య చిన్నదే అయినా నిర్లక్ష్యం చేస్తే ఫలితాలపై ప్రభావం చూపిస్తుందని రాష్ట్ర నాయకత్వం అంచనా వేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు జిల్లా స్థాయిలో కాంగ్రెస్ నాయకులతో సమావేశాలు నిర్వహించారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పట్ణణాల్లో ఆగమేఘాల మీద అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఏకపక్షంగా ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఒక్కో వార్డు నుంచి ఐదుగురు ఔత్సాహికుల పేర్లు ఇవ్వాలని పీసీసీ నాయకత్వం ఇన్‌చార్జ్‌లకు సూచించిందని సమాచారం. సర్వే నివేదికలో వెల్లడైన పేర్ల ప్రకారం జాబితాను పంపించాలని, ఆ పేర్లను ఎమ్మెల్యే ద్వారా సిఫారసు చేయించాలని స్పష్టం చేశారు.

అభివృద్ధిని చూసి ఓటేయాలంటున్న సీఎం

సర్పంచ్‌ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను రిపీట్ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దావోస్ పర్యటనకు ముందుగా జిల్లాల బాట పట్టారు. అదిలాబాద్ జిల్లా పర్యటనతో శ్రీకారం చుట్టారు. నిర్మల్ లో ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఒక్క సీటు తగ్గకుండా చూసుకోవాలని, ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో మంత్రులు బాధ్యత తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ వైపు ఓటర్లు మొగ్గుచూపకుండా చూడాలని ఆయన ఇన్‌చార్జ్‌లకు దిశా నిర్ధేశం చేశారు. అమెరికా పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 2వ తేదీన హైదరాబాద్ చేరుకోనున్నారు. మరుసటి రోజు నుంచి ఆయన రాష్ట్రంలో ఆయన సుడిగాలి పర్యటన చేసి అభ్యర్థులకు మద్ధతుగా ప్రచారం చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు క్షేత్రస్థాయిలో ఉండనున్నారు.

కాంగ్రెస్ వైఫల్యాలే బీఆరెస్‌ టార్గెట్‌!

మున్సిపల్‌ ఎన్నికలపై బీఆర్ఎస్ నాయకులు ఫోకస్ పెట్టారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్ధతిచ్చిన అభ్యర్థులు భారీ సంఖ్యలో గెలుపొందండంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. మున్సిపల్‌ ఎన్నికలకు ఎప్పుడైనా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో రెండు రోజుల క్రితం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టీ.హరీశ్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలో సన్నద్ధం చేయాలని అధినేత ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలు చేయకుండా మోసం చేస్తున్న వైనాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. మున్సిపల్‌ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, అందరూ సమన్వయంతో పనిచేయాలని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. మున్సిపాల్టీల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించాలని ఆదేశించారు. కేసీఆర్ ఆదేశం మేరకు మూడు రోజుల క్రితం కార్పొరేషన్లు, మున్సిపాల్టీల వారీగా సమన్వయకర్తల జాబితాను కేటీఆర్ విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం మొదలు చైర్మన్లు, మేయర్ల ఎన్నిక వరకు వీరు పార్టీ శ్రేణులు, నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తారని ప్రకటించారు. స్థానికంగా పరిస్థితులను అంచనా వేసి గెలుపొందే అభ్యర్థులను ఎంపిక చేయడం, బూత్ స్థాయి లో ప్రచారం పై నిమగ్నమవుతారని వెల్లడించారు.

పార్టీ మారుతున్న నేతలు

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పలువురు నాయకులు పార్టీలు మారుతున్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీ వెళ్లిన నాయకులు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకుంటున్నారు. వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీని వీడి బీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గత ఎన్నికల్లో వరంగల్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పార్టీలో సరైన ఆదరణ లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన… తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఒక ముఖ్య నేత పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇలా పలు నియోజకవర్గాల్లో నాయకులు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటూ అన్నట్లుగా జంప్‌చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ప్రధానంగా కాంగ్రెస్‌, బీఆరెస్‌ మధ్యే పోటీ నెలకొని ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read Also |

Mother of All Deals | భారత్–ఈయూ వాణిజ్య ఒప్పందం: ’మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా చరిత్రలో నిలిచిపోయే ఘట్టం
Viral Video : బిగ్ అనకొండ..చూసేయండి వీడియో
Postal Department | 28,740 పోస్టుల భ‌ర్తీకి పోస్ట‌ల్ శాఖ నోటిఫికేష‌న్‌.. ప‌ది పాసైతే చాలు ఉద్యోగం..!

Latest News