- ఈ ఏడాది మే 15 నాటికి పనుల పూర్తికి డెడ్‌లైన్
- పూడికతీతకు రూ.16.10 కోట్లకు పెరిగిన నిధులు
- రూ.9 కోట్ల నుంచి ఏడాదిలో డబులైన వ్యయం
- గత ఏడాది వరద ముంపునకు గురైన వరంగల్ సిటీ
- పూడికతీత పనులకు అవినీతి మరకలు, ఆరోపణలు
- భద్రకాళి చుట్టూరా పర్యాటకాభివృద్ధికి చర్యలు
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Bhadrakali Lake | గత ఏడాది ఆగమేఘాల మీద ప్రారంభించి, పనులు పూర్తిచేయకుండా అర్ధాంతరంగా నిలిపివేసిన వరంగల్ భద్రకాళి చెరువు పూడికతీత పనులు ఈసారైనా ‘సకాలం’లో అంటే వర్షకాలం రాక ముందే పూర్తి చేస్తారా? లేదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధుల, అధికారుల అనాలోచిత, నిర్లక్ష్యం వల్ల నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. గత ఏడాది ఎండాకాలంలో చెరువు పూడికతీత పనులు చేపట్టి, వర్షకాలం రాకముందే పనులు పూర్తి చేయాలనే లక్ష్యం విఫలమైంది. ఈ ప్రభావం వరంగల్ నగరం తీవ్ర ప్రభావం కనబరిచి, వరద నీటిపాలు చేసింది. వరంగల్ నగరంలోని విశాల ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరు కొంత డ్రైనేజీల ద్వారా బయటికి వెళ్ళిపోగా, మరి కొంత భద్రకాళి చెరువులోకి వచ్చి చేరి నీటిని బ్యాలెన్స్ చేసేది.
గత ఏడాది భద్రకాళి చెరువు పూడికితీత పనులు చేపట్టి వర్షకాలంలోపు పూర్తి చేయకపోవడంతో చెరువులోకి వర్షం నీరు వెళ్ళకుండా అడ్డుకట్టలు వేశారు. దీంతో పెద్ద ఎత్తున కురిసిన వర్షం నీరు పూర్తిగా ఒకేసారి బయటికి వెళ్ళలేక నగరాన్ని పూర్తిగా ముంచేసింది. ఆకస్మిక కుండపోత వర్షానికితోడు, భద్రకాళి చెరువు మూసివేత వల్ల ఈ నష్టం వాటిల్లినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు తమ తమ బాధ్యతలు లేనట్లు చేతులు దులుపుకొని ప్రకృతిపై నెట్టేసి తప్పించుకున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం తిరిగి చేపట్టిన భద్రకాళి పూడికతీత పనులను వర్షాలు రాకముందు పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే వర్షకాంలో తిరిగి తాము ఇబ్బందులపాలయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్యం మంచిదైనప్పటికీ సరైన సమయంలో అమలు చేయకపోతే ఇలాంటి ప్రకృతిపరమైన ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. అందుకే లక్ష్యం మేరకు మే 15 నాటికి రెండు నెలల కాలంలో పనులు పూర్తి చేసి ప్రజలను ఆందోళన నుంచి కాపాడాలని కోరుతున్నారు.
గత ఏడాది పనులు ప్రారంభించినపుడు రూ. 9 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పూడికతీత పనుల వ్యయం పెరిగి ప్రస్తుతం రూ. 16.10 కోట్లకు చేరింది. పనులు పూర్తయ్యే వరకు ఇంకా పెరుగుతాయా? లేక ఈ నిధులతో పూర్తి చేస్తారా? అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే ఈ పూడిక తీత పనుల పై రాజకీయ విమర్శలు, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.
పూడికతీత పనులకు అవినీతి మరకలు
వరంగల్ నగర ప్రజల వేసవి మంచి నీటి రిజర్వాయర్ గా ఉపయోగిస్తున్న భద్రకాళి చెరువులో కాల క్రమేణా పూడిక పెరిగిందని గుర్తించి, గత ఏడాది ఈ పనులు ప్రారంభించారు. ఏడు దశాబ్దాలుగా పూడిక తీయకపోవడంతో నగర ప్రజాప్రతినిధులు శ్రమకోర్చి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించి పూడికతీత పనులకు నిధులు విడుదలయ్యే విధంగా కృషి చేశారు. ఈ మేరకు రూ. 9 కోట్ల అంచనా వ్యయంతో చెరువు పూడికతీత పనులు మొదలయ్యాయి.
- గత ఏడాది చెరువులోని నీటిని తొలగించి కొంత మేరకు పూడిక మట్టిని తొలగించారు.
- ఈ సందర్భంగా అందులోని చేపలు, జీవరాశులన్నీ చనిపోయాయి.
- ఎండాకాలం పూర్తయ్యేలోపు పనులు పూర్తి చేయలేకపోయారు.
- దీంతో వర్షాలు కురవడంతో పనులు నిలిచిపోయాయి. చెరువులో ఉన్న నీళ్ళు తొలగించారు.
- కొత్త నీళ్ళు నింపే పరిస్థితి లేకుండా పోయింది.
- ప్రస్తుతం చెరువు ఎండిపోయి నీళ్ళులేక జలజీవరాశులు లేక భద్రకాళి చెరువు వెలవెలబోతోంది.
- దాదాపు ఏడాది కాలంగాచెరవు వట్టిపోయి ఏడారిని తలపిస్తోంది.
ఈ లోపు పూడికతీత పనుల విషయలో అవినీతి, కమీషన్లు దండుకున్నారనే విమర్శలు, మట్టిని అమ్ముకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య సవాళ్ళు ప్రతిసవాళ్ళతో పూడికతీత పనులు రాజకీయ రచ్చకు కారణమయ్యాయి. ప్రస్తుత పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, గత ఎమ్మెల్యే వినయభాస్కర్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ వేడిని రగిలించారు. సకాలంలో పూర్తిచేస్తే నగర వాసుల ఇబ్బందులతో పాటు నిధుల పెరుగుదల తప్పేదని భావిస్తున్నారు.
పూడిక తీత పనులకు మే 15 డెడ్‌లైన్
గత ఏడాది వేసవికాలంలో భద్రకాళి చెరువు పూడికతీత పనులు చేపట్టనప్పటికీ వర్షాకాలం నాటికి పూర్తి చేయలేకపోయినందున మిగిలిన పనులను శుక్రవారం ప్రారంభించారు. సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీత పనులను పూర్తి చేయాలని ఆధికారులు అంచనా వేశారు. పనులను మే 15 తేదీ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అందువల్ల మే 15 అంటే దాదాపు రెండు నెలల కాలంలో పనులు పూర్తి చేసి వరద నీటి నుంచి కాపాడాలని నగర ప్రజలు కోరుతున్నారు.
భద్రకాళి పర్యాటకాభివృద్ధికి చర్యలు: మేయర్, ఎమ్మెల్యే
భద్రకాళిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మేయర్ గుండు సుధారాణి, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రకాళి పూడికతీత, సుందరీకరణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రకాళి ఆలయాన్ని జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, చెరువును పునరుద్ధరించి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. గతంలో రూ. 9 కోట్ల అంచనా వ్యయం తో ప్రారంభించిన పూడికతీత పనులు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో ప్రస్తుతం రూ.16.10 కోట్ల నిధులతో సమగ్రంగా చెరువు పూడికతీత పనులను చేపడుతున్నామన్నారు. భద్రకాళి నుంచి బండ్ వైపు గ్లాస్ వంతెన ఏర్పాటు చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, మామిండ్ల రాజు, ఇరిగేషన్ ఎస్ ఈ రాంప్రసాద్, ఈఈ కిరణ్ కుమార్, కుడా ఈఈ భీమ్ రావు, ఇరిగేషన్ డిఈ మధుసూదన్, ఏఈలు వేణు గోపాల్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రేవంత్ బినామీ కంపెనీ అక్రమాలపై దర్యాప్తు జరిపించాలి : కేంద్ర మంత్రులకు కేటీఆర్ లేఖ
Cheedikada BC Hostel | ఇన్ని సమస్యలా?..వైరల్ గా బీసీ హాస్టల్ బాలికల వీడియో!
దేశంలో వంటగ్యాస్ కొరత లేదు: కేంద్రం కీలక ప్రకటన
