హైలైట్స్:

  • కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు పట్ల కేంద్రం నిర్లక్ష్యం
  • తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మోడీకి, బీజేపీకి ఇష్టం లేదు
  • రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడానికే ఇద్దరికి మంత్రి పదవులు
  • ఇద్దరు మంత్రులకు ప్రాజెక్టు తీసుకువచ్చే సత్తా లేదు
  • సీఎంను తెలంగాణ ద్రోహి అనడం కేటీఆర్ అహంకారం
  • మీడియా సమావేశంలో కడియం ఆగ్రహం

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

తెలంగాణ అభివృద్ధికి అదనంగా ఒక్క రూపాయి తీసుకురాలేని సిగ్గులేని దద్దమ్మ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. పైగా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడానికే ప్రధాని మోదీ వీళ్లకు మంత్రి పదవులు ఇచ్చాడని ఎద్దేవా చేశారు. కేంద్రం నుండి రాష్ట్ర అభివృద్ధికి ఒక్క ప్రాజెక్టు అయిన తీసుకువచ్చారా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ 13 లక్షల కోట్లు తెచ్చామని బండి సంజయ్‌ సిగ్గులేకుండా చెబుతున్నారని మండిపడ్డారు. 13 లక్షల కోట్లతో ఏ అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు అయిన వచ్చిందా?’ అని ప్రశ్నించారు. 12ఏళ్లుగా తెలంగాణ అభివృద్ధికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం సహకరించడం లేదని, అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే ప్రధాని మోదీకి, బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు. అందుకే తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు సృష్టించడమే బీజేపీ పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్షణం కాజీపేట డివిజన్ ప్రకటించాలి

బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల నిజంగా వివక్ష లేకుంటే వెంటనే కాజీపేట రైల్వే డివిజన్‌ను ప్రకటించాలని కడియం డిమాండ్ చేశారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ జూన్ 1నుండి ప్రారంభం అయిందన్న కడియం.. కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని వరంగల్ జిల్లా ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. డివిజన్ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. కాజీపేటకు అన్ని అర్హతలు ఉన్నాయని, డివిజన్ పరిధిలో అపారమైన బొగ్గు నిల్వలు, అటవీ సంపద, జల వనరులు, సారవంతమైన భూములు ఉన్నాయని అన్నారు.

"పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు, యూనివర్సిటీలు, జాతీయ ప్రాజెక్టు, బడ్జెట్ లో వేల కోట్ల అదనపు నిధులు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు తప్ప ఒక్క రూపాయి అదనంగా ఇవ్వలేదు. తెలంగాణ బీజేపీ నాయకులు బుద్ధి తక్కువ మాటలు మానుకొని పద్ధతి తెచ్చుకోవాలి."

- కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి

అదనంగా రూపాయి కూడా ఇవ్వలేదు

పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు, యూనివర్సిటీలు, జాతీయ ప్రాజెక్టు, బడ్జెట్ లో వేల కోట్ల అదనపు నిధులు ఇస్తున్నారని కడియం అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు తప్ప ఒక్క రూపాయి అదనంగా ఇవ్వలేదని స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీ నాయకులు బుద్ధి తక్కువ మాటలు మానుకొని పద్ధతి తెచ్చుకోవాలని సూచించారు. బీజేపీ నాయకులకు అభివృద్ధి పట్ల బాధ్యత ఉంటే తక్షణమే తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టును, కాజీపేట రైల్వే డివిజన్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు.

సీఎంను తెలంగాణ ద్రోహి అనడం కేటీఆర్ అహంకారం:

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడని కడియం ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని తెలంగాణ ద్రోహి అని సంభోదించడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనం అని మండిపడ్డారు. అధికారం పోయిందనే అక్కసుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఇప్పటికైనా బాష మార్చుకోవాలని లేదంటే నీకు అదే రీతిలో బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, జిల్లా స్థాయి, మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.