విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టంచేశారు. రేపటి నుంచి రాష్ట్రంలో మార్కెట్ విలువ మేరకు భూముల ధరలు ఏరియాను బట్టి 50నుంచి 100శాతం పెరుగుదల అమలులోకి వస్తుందని ప్రైమ్ ఏరియాలో 10పెరుగుతాయని తెలిపారు. దీంతో ప్రభుత్వానికి రూ.1,400 కోట్ల ఆదాయం సమకూరుతుంది. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, ఖాజాగూడ వంటి ప్రాంతాల్లో అధిక పెంపు ఉంటుందని తెలిపారు. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచే ఆలోచన లేదు అని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచిందని..ఇప్పుడు ఒక్క శాతం పెంచినా కూడా వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై పడుతుందనే ఆలోచనతో ప్రజాకోణంలో నిర్ణయం తీసుకొని వాస్తవానికి దగ్గరగా శాస్త్రీయ పద్దతిలో భూముల విలువలను సవరించామని తెలిపారు.

ప్రజలకు వేగవంతంగా పార‌ద‌ర్శకంగా అత్యుత్తమ సేవలు అందించాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో స‌మూల మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టామ‌ని వెల్లడించారు. గచ్చిబౌలిలోని తాలిమ్ లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయ నిర్మాణ పనులను గురువారం నాడు మంత్రి పరిశీలించారు. అంతకుముందు సచివాలయంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు.

సందేహాల కోసం టోల్ ఫ్రీ, వాట్సాప్ నెంబర్లు

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలల్లో వ్యవసాయ భూముల విలువ ఎకరానికి కనీసం 2.75 లక్షలుగా నిర్ణయించామని, మున్సిపల్ కార్పొరేషన్ లలో ఎకరానికి 5 లక్షలుగా, హెచ్.యం.డి.ఏ. పరిధిలో 10 లక్షలుగా, ఓ.ఆర్.ఆర్. పరిధిలో 15 లక్షలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. సవరించిన భూములు విలువలపై ఎక్కువ తక్కువలుంటే సమీక్షిస్తామని తెలిపారు. సవరించిన భూముల విలువలు, సందేహాలు ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 4788, వాట్స్ యాప్ నెంబర్ 8247619983 నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. భూములమార్కెట్‌ విలువల పెంపుతో భూసేకరణ వేళ ప్రభుత్వంపై భారం పడుతుందని, కాని రైతులకు మేలు జరుగుతుందన్నారు.

సబ్ రిజిస్ట్రార్ ల అధికారాల కుదింపు

ప్రజలకు పారదర్శకమైన, అవినీతి రహిత సేవలు అందించేందుకు రెవెన్యూ శాఖలో, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం అని మంత్రి పొంగులేటి తెలిపారు. స్లాట్ బుకింగ్ విధానం ద్వారా సమయాన్ని ఆదా చేయడమే కాకుండా అత్యాధునిక సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నాం. ఎలాంటి అక్రమాలకు తావు ఇవ్వకూడదన్న ఆలోచనతో సబ్ రిజిస్ట్రార్ ల అధికారాలను కుదించడం జరిగిందన్నారు. రెవెన్యూ రికార్డుల నిర్వహణలో తెలంగాణ మోడల్ గా నిలుస్తుందని, ఏడాదిన్నరలో 90శాతం గ్రామాల సర్వే పూర్తవుతుందన్నారు. త్వరలో తహశీల్ధార్ల బదిలీలు ఉంటాయని తెలిపారు.

తొలి దశలో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

మొదటి దశ లో ఔట‌ర్ రింగ్ రోడ్డు ప‌రిధిలో 39 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను 13 క్లష్టర్‌లుగా విభ‌జించి ప్రభుత్వంపై ఎలాంటి ఆర్ధిక‌ భారం ప‌డ‌కుండా ప్రైవేటు నిర్మాణ రంగ సంస్ధల‌తో నిర్మిస్తున్నాం అని పొంగులేటి తెలిపారు. నిర్మాణంతో పాటు ఐదు సంవ‌త్సరాల నిర్వహాణా బాధ్యత‌ను కూడా ఆ సంస్ధలకే అప్పగించాం. మూడు నుంచి ఐదు ఎక‌రాల స్ధలంలో కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేస్తున్నాం. వివాహ రిజిస్ట్రేష‌న్ల కోసం మినీ మ్యారేజీ హాల్‌, గ‌ర్బిణీల‌కు, వృద్దుల‌కు ప్రత్యేక వ‌స‌తులు, విశాల‌మైన వెయిటింగ్ ఏరియా మ‌హిళ‌ల కోసం ఫీడింగ్ రూమ్‌, చిన్నపిల్లల కోసం క్రెచ్‌, వృద్దులు, దివ్యాంగుల కోసం ఆధునిక లిఫ్ట్ సౌక‌ర్యం త‌దిత‌రాల‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే నాలుగు ఇంటిగ్రేటెడ్ భవానలకు శంకుస్థాపన చేసుకొని పనులు ప్రారంభించాం. ఈ గచ్చిబౌలి లో నిర్మిస్తున్న భావనాన్ని డిసెంబర్ లోగా అందుబాటులోకి తీసుకోస్తాం. ఒకటి, రెండు రోజుల్లో కోహెడలో శంకుస్థాపన చేయబోతున్నాం. రెండ‌వ విడ‌త‌లో జిల్లా కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ భ‌వ‌నాల‌ను నిర్మిస్తాం అని వెల్లడించారు.

ఏ ఫైల్ పై గుడ్డిగా సంతకం పెట్టలేదు

మంత్రుల శాఖాల మార్పుపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు మంత్రి పొంగులేటి స్పందిస్తూ “తాను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. దేవుడి దయతో ఇంతవరకు వచ్చాను. నాకు ఏ శాఖ ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేస్తాను. నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేసే వ్యక్తిని కాను. ఏ ఫైల్ పై గుడ్డిగా సంతకం పెట్టలేదు. చట్ట ప్రకారం పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖలో అక్రమాలకు పాల్పడ్డవారిపై ఏసీబీ ట్రాప్ అయిన వారిపై గత ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విచారణ జరగకుండా తప్పు చేసిన వారిని తప్పించే ప్రయత్నం చేశారు. మూడు, నాలుగు సంవత్సరాలపాటు ఫైళ్లను తొక్కిపెట్టారు. నేను రెవెన్యూ శాఖ మంత్రిగా భాద్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3,500 ఫైళ్లను క్లియర్ చేసాను. తప్పు చేసిన వారికి శిక్ష పడే విధంగా నిర్ణయాలు తీసుకున్నాను. ఎవర్ని క్షమించలేదు, ఉపేక్షించలేదు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు 10 సంవత్సరాలు గడిచిన కూడా ఆ నాటి ప్రభుత్వంలో కనీసం జవాబులు ఇవ్వలేదు. అడిగిన సభ్యుల పదవి కాలం కూడా ముగిసింది. ఇటీవల అన్నీ ఫైళ్లను క్లియర్ చేశాను. గత ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ జరిగిన అసైన్డ్ భూములను ఇప్పుడు నిషేదిత జాబితాలో పెట్టడం జరిగింది. భూములకు సంబంధించిన ప్రతీ డాక్యుమెంట్ ను డిజిటలైజేషన్ చేస్తాం అని తెలిపారు.

ఫ్యూచర్ సిటీ రద్దు అసాధ్యం

ఫ్యూచర్ సిటీ రద్దుచేయడం సాధ్యంకాదు అని మంత్రి పొంగులేటి అన్నారు. ఫ్యూచర్ సిటీ లో లాండ్స్ ఫ్రీ గా ఇవ్వడం లేదు. రద్దు చేస్తే ప్రభుత్వం డబ్బు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. ఇది సాధ్యమయ్యే పనికాదు అన్నారు.  ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, నేను స్పష్టంగా ఉన్నామని, అయితే కేబినెట్ సబ్ కమిటీ తీర్మానం చేయనందునా సీఎం అధికారిక ప్రకటన చేయలేదన్నారు.

మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల పథకం విజయమంతమైందన్నారు. నిరుపేదల స్వంత ఇంటి కలలను తీర్చే అవకాశం నాకు దక్కింది. ఇది నాకు చాలా తృప్తినిచ్చిందని, ఇప్పటిదాకా రూ.7వేల కోట్లు చెల్లించామని తెలిపారు. ప్రారంభంలో ఎన్ని వత్తిడిలు వచ్చినా కూడా వెనుకకు తగ్గలేదు అన్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ 90శాతం పూర్తయ్యిందని, మొత్తం ధాన్యం కొనుగోలు ప్రభుత్వం చేస్తుందన్నారు. రాష్ట్రంలో అసెన్డ్ భూములకు పాలసీ తీసుకొస్తామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసైన్డ్ భూములు కూడా రిజిస్ట్రేషన్ జరిగాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వాటిని నిషేధిత జాబితాలో చేర్చిందన్నారు.