ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుషుల మిస్సింగ్ మిస్టరీ కేసులు పోలీసుల పనితీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కాకినాడ జిల్లా తునీ లో సీహెచ్.అగ్రహారం తోటలో రెండేళ్ల సిహెచ్.అగ్రహారం తోటలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టరీ ఓ వైపు.. కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి మాయమైన గాదె సాయికృష్ణ అనే యువకుడి మిస్సింగ్ కేసు మరోవైపు ఆ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టకు సవాల్ విసురుతున్నాయి. ఈ రెండు మిస్సింగ్ కేసులలో అసలు నిజం ఎప్పుడు బయటపడుతుందన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఉత్కంఠగా మారింది.
15రోజులైనా దొరకని జ్ఞానేశ్వరి ఆచూకీ
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 15రోజులు అవుతున్న ఇంకా పోలీసులు ఆచూకీ కనిపెట్టలేకపోయారు. జ్ఞానేశ్వరి అదృశ్యమైన రోజు సీహెచ్.అగ్రహారం వినాయకుని గుడి వద్ద పెంపుడు కుక్క సంచరించిన దృశ్యాలను సీసీ కెమెరాలో గుర్తంచిన పోలీసులు కిడ్నాప్ కోణంలో ఇప్పటి వరకు 6 వేల సెల్ ఫోన్ కాల్స్ ను విశ్లేషించారు.జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
ఈ కేసులో మొదట పెంపు కుక్క చుట్టు, తర్వాత అడవి జంతువులు, సంచార జాతుల చుట్టు తిరిగిన దర్యాప్తు ఇప్పుడు కిడ్నాప్ కోణంలో సాగుతుండటం గమనార్హం. హోంశాఖ మంత్రి అనిత, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు జ్ఞానేశ్వరి తల్లిదండ్రులను పరామర్శించి కేసు దర్యాప్తు వేగంగా కొనసాగించాలని పోలీసులకు సూచించారు. ఇంతవరకు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం విస్మయం కల్గిస్తుంది. మరోవైపు జ్ఞానేశ్వరి కేసులో కీలకంగా ఉన్నపెంపుడు కుక్క ఆకస్మికంగా అనారోగ్యంతో మరణించిందని చెబుతున్నా.. శవపంచనామా, పోస్టుమార్టం నివేదిక ఇంకా అందాల్సి ఉంది. ఇన్నిరోజులు గడుస్తున్నా.. ఆ రిపోర్ట్ రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. . అది నిజంగా చనిపోయిందా? ఎవరైనా చంపేశారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సాయికృష్ణ ఇక లేనట్లేనా..?
కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కస్టడీ నుంచి సాయికృష్ణ మాయమవ్వడం ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. సాయికృష్ణను క్రూరంగా హింసించి కస్టడీలోనే సీఐ నాగరాజు చంపేశాడన్న ఆరోపణల నేపథ్యంలో సాయికృష్ణ హత్య, దహనం కేసు మిస్టరీపై ఆసక్తి నెలకొంది. సాయికృష్ణ తల్లి మాత్రం తన కొడుకును సీఐ నాగరాజు లాకప్ లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టడంతో చనిపోయాడని, ఈ విషయం బయటకొస్తే ఇబ్బంది అవుతుందని, శవాన్ని తగలబెట్టి బూడిద చేశారని ఆరోపిస్తుంది. చట్టం నుంచి తప్పించుకునేందుకు సాక్ష్యాలు లేకుండా చేసేందుకే బూడిద కూడా మిగల్చలేదు అని, సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలి అని విజయలక్ష్మి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కొడుకు జాడ కోసం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ సైతం దాఖలు చేశారు.
కృష్ణలంక స్వర్గపురి స్మశాన వాటికలో పోలీసుల విచారణ
గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసును విచారిస్తున్న సీఐ పవన్ కిషోర్ బృందం కృష్ణలంక స్వర్గపురి స్మశాన వాటికకు చేరుకుని శవ దహనాల రికార్డులను పరిశీలించింది. సాయికృష్ణ దహనం జరిగినట్లు అనుమానిస్తున్న తేదీల్లో వచ్చిన మృతదేహాల వివరాలపై ఆరా తీసింది. స్మశాన వాటికలోని గుర్తుతెలియని డెడ్ బాడీల రికార్డులు, ఫోన్ నెంబర్ల వెరిఫికేషన్ చేసింది. స్వర్గపురి స్మశాన వాటికలో సీసీ కెమెరాలు లేకపోవడంతో కేవలం రిజిస్టర్ రికార్డుల ఆధారంగానే దర్యాప్తు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాయికృష్ణను గుర్తుతెలియని శవంగా దహనం చేశారా? లేదా అనే కోణంలో విచారణ జరుగుతుంది.
పోలీసుల అదుపులో స్మశాన వాటిక ఎలక్ట్రికల్ ఫర్నెస్ ఆపరేటర్ బాషా
అనాధ మృతదేహాల నిర్వహణలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలతో స్వర్గపురి స్మశాన వాటిక ఎలక్ట్రికల్ ఫర్నెస్ ఆపరేటర్ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. కృష్ణలంక స్వర్గపురిలో సాయంత్రం 6 గంటల తర్వాత దహనాలు నిర్వహించకూడదన్న నిబంధన అమల్లో ఉంది. అయితే మే నెల 23వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో రెండు అనాధ మృతదేహాలను అక్కడికి తీసుకువచ్చినట్లు తేలింది. అప్పటికే సమయం ముగిసిందని దహనానికి అవకాశం లేదని ఇంచార్జి బాషా చెప్పినప్పటికీ, పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల సూచనలతో మృతదేహాలను తాత్కాలికంగా అక్కడే నిల్వచేసినట్లు సమాచారం. అనంతరం 24వ తేదీ ఉదయం దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ వ్యవహారం గాదె సాయికృష్ణ కేసుతో అనుసంధానంగా ఉండటంతో విచారణకు కీలకంగా మారింది. రికార్డుల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే కేసుపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.