Groom Arrest | తాళి క‌ట్టే వేళ వ‌రుడు అరెస్ట్.. క‌న్నీరు పెట్టుకున్న న‌వ వ‌ధువు

Groom Arrest | అత‌నో గ్యాంగ్‌స్ట‌ర్.. నిత్యం సెటిల్‌మెంట్లు చేస్తూ కాలం వెల్ల‌దీస్తున్నాడు. ఈ విష‌యం అత‌న్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి తెలియ‌దు. ఇంకేముంది.. అత‌ను ఆమెకు న‌చ్చ‌డంతో.. పెద్ద‌లు కూడా పెళ్లికి సిద్ధ‌మ‌య్యారు.

Groom Arrest | అత‌నో గ్యాంగ్‌స్ట‌ర్.. నిత్యం సెటిల్‌మెంట్లు చేస్తూ కాలం వెల్ల‌దీస్తున్నాడు. ఈ విష‌యం అత‌న్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి తెలియ‌దు. ఇంకేముంది.. అత‌ను ఆమెకు న‌చ్చ‌డంతో.. పెద్ద‌లు కూడా పెళ్లికి సిద్ధ‌మ‌య్యారు. ఇక తాళి క‌ట్టే స‌మ‌యానికి ఆ గ్యాంగ్‌స్ట‌ర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. షాకైన వ‌ధువు.. క‌నీసం పోలీసు కస్ట‌డీలోనైనా త‌మ వివాహం జ‌రిపించాడ‌ని వేడుకుంది. అయినా కూడా పోలీసులు క‌ర‌గ‌లేదు. క‌రుడుగ‌ట్టిన ఆ నేర‌స్థుడిని రిమాండ్‌కు త‌ర‌లించారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్‌కు చెందిన ఆకాశ్ అలియాస్ భూరా స్థానికంగా గ్యాంగ్‌స్ట‌ర్‌. ఇక ఆకాశ్‌కు ఇటీవ‌లే పెళ్లి సంబంధం కుదిరింది. సీమా అనే యువ‌తితో నిన్న మూడు ముళ్లు వేయాల్సి ఉండే. ఈ ఘ‌ట్టానికి ముందు హ‌ల్దీ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. ఇత‌ర సాంప్ర‌దాయ కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌య్యాయి. ఇక మిగిలింది తాళి క‌ట్ట‌డ‌మే. స‌రిగ్గా తాళి క‌ట్టే వేళ‌కు పోలీసులు పెళ్లి మండ‌పంలోకి రంగ ప్ర‌వేశం చేశారు. గ్యాంగ్‌స్ట‌ర్ ఆకాశ్‌ను అదుపులోకి తీసుకుని కోహ్ ఏ ఫిజా పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

షాకైన న‌వ వ‌ధువు.. త‌న వ‌రుడి కోసం పోలీసు స్టేష‌న్ మెట్లెక్కాల్సి వ‌చ్చింది. నా జీవితాన్ని నాశ‌నం చేస్తున్నారు. అత‌ను చేసిన నేరాల గురించి త‌న‌కేమీ తెలియ‌దు. ఇందులో నా త‌ప్పేముంది..? ఇంటి ద‌గ్గ‌ర అతిథులు వేచి చూస్తున్నారు. హ‌ల్దీ, ఇత‌ర కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. తాళి క‌ట్ట‌డ‌మే మిగిలింది అని క‌న్నీరు పెట్టుకుంది సీమా.

మ‌రో రెండు గంట‌లైతే పెళ్లి పూర్త‌వుతుంది. ఈ రెండు గంట‌ల పాటు మీ క‌స్ట‌డీలోనే పెళ్లి జ‌రిపించండి అంటూ సీమా పోలీసుల‌ను వేడుకుంది. కానీ వారు ఏ మాత్రం క‌ర‌గ‌లేదు. చివ‌ర‌కు సీమా ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించారు. ఆకాశ్‌తో పాటు ఠాకూర్, అభిషేక్ ఉపాధ్యాయ‌, అభిషేక్ మీనా, నీర‌జ్ ఖంగే, అమిత్ ఓస్వాల్‌ను కోర్టులో హాజ‌రు ప‌రిచి, రిమాండ్‌కు త‌ర‌లించారు.

Latest News