Postal Department | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల( Govt Job ) కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీయువకులకు పోస్టల్ శాఖ(Postal Department ) తీపి కబురు అందించింది. దేశ వ్యాప్తంగా పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి పోస్టల్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దాదాపు 28,740 ఖాళీలను భర్తీ చేయనుంది.
పోస్టుల వివరాలు ఇవే..
మొత్తం ఉద్యోగ ఖాళీలు – 28,740
బ్రాంచ్ పోస్టల్ ఆఫీసర్ (BPM)
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టల్ ఆఫీసర్ (ABPM)
మెయిల్ పంపిణీ చేసే గ్రామీణ డాక్ సేవక్ (GDS)
అర్హతలు ఇవే..
పదో తరగతి పాసైన ప్రతి విద్యార్థి కూడా ఈ ఉద్యోగాలకు అర్హులే. అయితే పదిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఆధారంగా వయోపరిమితిలో సడలింపు కూడా ఇస్తున్నట్లు నోటిఫికేషన్‌లో స్పష్టంగా తెలిపారు.
ఎలాంటి రాత పరీక్ష లేదు
ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌లో అతిపెద్ద హైలైట్ పరీక్ష లేకపోవడమే. సాధారణంగా, ప్రభుత్వ ఉద్యోగాలు కఠినమైన పోటీ పరీక్షల ద్వారా భర్తీ చేస్తారు. అయితే, ఈ పోస్టల్ శాఖ ఉద్యోగాలకి ఎలాంటి రాత పరీక్ష ఉండదు.
ఈ పోస్టులకు జీతం ఎంత?
ఎంపికైన అభ్యర్థులకు మంచి జీతం కూడా ఇవ్వనున్నారు. పోస్టల్ శాఖ నోటిఫికేషన్ ప్రకారం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసర్, డాక్ సేవక్ పోస్టులకు నెలకు రూ. 10,000 నుండి రూ. 24,470 వరకు వేతనం చెల్లిస్తారు. బ్రాంచ్ పోస్ట్ ఆఫీసర్ (BPM) పోస్టులకు రూ. 12,000 నుండి రూ. 29,380 వరకు ప్రతినెలా జీతం చెల్లిస్తారని నోటిఫికేషన్ తెలిపింది.
ముఖ్యమైన తేదీలు
అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2026 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. దరఖాస్తులో తప్పులను సరిదిద్దుకునేందుకు ఫిబ్రవరి 18, 19 తేదీల్లో అవకాశం ఇవ్వనున్నారు. మెరిట్ జాబితాను 2026 ఫిబ్రవరి 28న విడుదల చేయనున్నారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.inను సందర్శించి మీ వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు చివరి నిమిషంలో సర్వర్ సమస్య తలెత్తకుండా ఉండాలంటే, ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి మార్కులు మాత్రమే మెరిట్ గా చూస్తారు కనుక అవసరం కాబట్టి గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు సైతం ఇది ఒక సువర్ణావకాశం.
