విప్ప సారా ప్రతిపాదనలు పరిశీలిస్తున్నాం: మంత్రి జూపల్లి

తెలంగాణలో విప్ప సారా తయారీ, అమ్మకాలపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన ప్రతిపాదనలు అందాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వాటి సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

విధాత : తెలంగాణలో విప్ప సారా తయారీ, అమ్మకాలకు సంబంధించి జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన ప్రతిపాదనలు అందాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అనిరుద్ రెడ్డి సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. విప్ప సారా ప్రవేశపెట్టడంపై చేసిన ప్రతిపాదనలపై సాధ్యాసాధ్యాలను సమీక్షిస్తున్నామని తెలిపారు.

ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలంగాణలో సారా అమ్మకాలు తిరిగి ప్రారంభించాలని.. అయితే ఆర్గానిక్ విప్ప సారా తయారీ అమ్మకాలు జరపాలని ప్రతిపాదించారు. విప్ప సారాతో వినియోగదారులకు ఆరోగ్యం, రాష్ట్రానికి ఆదాయము, గిరిజనులకు ఉపాధి అంశాలపై నిపుణులతో చర్చించి తాను 200 పేజీలతో నివేదిక తయారు చేశానని తెలిపారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విప్ప సారా ఆవశ్యకత పై ప్రస్తావిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి విప్ప సారాకు సంబంధించి అనిరుద్ రెడ్డి చేసిన ప్రతిపాదనలు అందాయని వాటిని పరిశీలిస్తున్నామని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం ప్రభుత్వం విప్ప సారా పాలసీ తీసుకురావడం వారి పరిధిలోని అంశమని.. మేము లక్షలాదిమంది గీతా కార్మికుల ఉపాధికి సంబంధించిన నీరా అమ్మకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ సమావేశాల్లో విప్ప సారా.. నీరా అమ్మకాలపై ప్రభుత్వం ఎలాంటి వైఖరి అనుసరిస్తుందన్న అంశం చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి :

దేశంలో వంటగ్యాస్‌ కొరత లేదు: కేంద్రం కీలక ప్రకటన
Guntur Farmer Roshaiah : 75సెంట్ల భూమిలో 52రకాల పంటలు.. నెలకు రూ.20వేల ఆదాయం!

Latest News