బెంగళూరులో పోస్టాఫీసుకు పోటెత్తిన మహిళలు.. ఇదీ కారణం!

బెంగళూరులోని ఆ పోస్టాఫీసు మామూలుగా సాధారణ రద్దీతో ఉంటుంది. కానీ.. ఇప్పుడు మహిళలతో పోటెత్తుతున్నది. ప్రతి ఒక్కరూ తమకు ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకు ఖాతాలు కావాలంటూ దరఖాస్తులు పెట్టుకుంటున్నారు.

  • Publish Date - May 29, 2024 / 09:06 PM IST

ఇండియా కూటమి గెలిస్తే ప్రతి మహిళకు నెలకు రూ.8,500
ముందే ఖాతా తీయించుకుంటున్న మహిళలు
ఎన్నికల్లో కూటమి విజయంపై పూర్తి విశ్వాసం

బెంగళూరు: బెంగళూరులోని ఆ పోస్టాఫీసు మామూలుగా సాధారణ రద్దీతో ఉంటుంది. కానీ.. ఇప్పుడు మహిళలతో పోటెత్తుతున్నది. ప్రతి ఒక్కరూ తమకు ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకు ఖాతాలు కావాలంటూ దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. దీనికి కారణం.. ప్రస్తుతం ముగింపు దశకు వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుస్తుందనే విశ్వాసమే. కూటమి గెలిస్తే ప్రతి పేద మహిళ ఖాతాలో నెలకు 8,500 రూపాయలు జమ చేస్తామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై విశ్వాసం ఉంచిన మహిళలు పెద్ద సంఖ్యలో పోస్టాఫీసులకు చేరుకుని, పొడవాటి క్యూ లైన్లలో నిలబడి ఖాతాలు తెరిపించుకుంటున్నారు.

తమకు ఐపీపీబీ ఖాతా ఉంటే కూటమి ప్రభుత్వం ఇచ్చే డబ్బు జమ చేయడానికి వీలుగా ఉంటుందని పలువురు మహిళలు చెబుతున్నారు. తాను ఉదయం నుంచి క్యూ లైన్‌లో ఉన్నానని ఒక మహిళ చెప్పారు. ఖాతా తెరిచిన రోజు నుంచే అందులో డబ్బులు పడతాయని తమ ప్రాంతంలో అందరూ అనుకుంటున్నారని మరో మహిళ తెలిపారు. వీరిలో చాలా మంది శివాజీనగర్‌, చామరాజ్‌పేట్‌ తదితర నగర శివారు ప్రాంతాల వారు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది.

పోస్టాఫీసు వారే వారి ఖాతాల్లో 2వేలు లేదా 8500 వేస్తారని చాలా మంది మహిళలు భావిస్తున్నారని బెంగళూరు జీపీవో చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ హెఎం మంజేశ్‌ మీడియాకు చెప్పారు. ‘వాస్తవానికి అవి వదంతులు మాత్రమే. ఎవరో వీటిని పుట్టించారు. వారికి పోస్టల్‌శాఖ డబ్బులు ఇవ్వదు. అయితే.. ఈ ఖాతాను నగదు బదిలీ పథకంతోపాటు ఎలాంటి ఆన్‌లైన్‌ లావాదేవీలకైనా ఉపయోగించుకోవచ్చు’ అని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ విషయంలో తాము తమ వినియోగదారులకు సమాచారం అందించామని మంజేశ్‌ చెప్పారు. ‘మేం కొన్ని పోస్టర్లు కూడా అతికించాం. అయినా కస్టమర్లు ఐపీపీబీ ఖాతా తెరవాలని కోరుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో మరిన్ని కౌంటర్లు తెరిచాం’ అని ఆయన చెప్పారు.

గతంలో తాము ఒక్కో కౌంటర్‌ను 50 నుంచి 60 ఖాతాలు తెరిచేందుకు ఏర్పాటు చేశామని, ఇప్పుడు రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు కౌంటర్లు తెరుస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు రోజుకు ఐదారువందల ఖాతాలు తెరుస్తున్నామని, ఒక్కో సందర్భంలో అవి వెయ్యి దాటిపోతున్నాయని ఆయన వివరించారు. గత మూడు రోజులుగా పోస్టాఫీసుల వద్ద ఈ రద్దీ ఉంటున్నదని సిబ్బంది చెబుతున్నారు. కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చెప్పడంతోనే వారంతా పోస్టాఫీసుకు వస్తున్నారని తెలిపారు.

 

Latest News