Photographer | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అద్దె ఇంటికోసం వెతుకుతూ (house hunting).. భారీ చోరీకి పాల్పడ్డాడు. ఓ ఇంటి షూ ర్యాక్‌లో ఉన్న తాళాన్ని తీసుకుని లోపలికి ప్రవేశించాడు. ఇంట్లోని రూ.లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. ఈ ఘటన వైట్‌ఫీల్డ్ (Whitefield) ప్రాంతంలోని నాగొండనహళ్లిలో వెలుగు చూసింది.
ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ టు దొంగ..
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. 32 ఏళ్ల కిరణ్ (Kiran) అనే వ్యక్తి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్. అయితే, కొవిడ్ సమయంలో తీవ్ర ఆర్థిక నష్టాలు రావడంతో స్టూడియోని మూసేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి చిన్న చిన్న ఈవెంట్స్‌కు ఫొటోగ్రఫీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, అతను గత కొన్ని రోజులుగా ఓ అద్దె ఇంటి కోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో వైట్‌ఫీల్డ్ పరిధిలోని నాగొండనహళ్లి (Nagondanahalli) ప్రాంతంలో ఇంటికోసం వేట మొదలు (house hunting) పెట్టాడు. ఆ సమయంలో అతడికి ఓ చోట టూలెట్ బోర్డు కనిపించింది.
షూ ర్యాక్‌లో ఉన్న తాళం తీసుకొని..
వెంటనే ఆ ఇంటి వద్దకు వెళ్లగా.. తాళం వేసి ఉంది. అయితే, ఇంటి యజమాని తన కుమారుడి కోసం తాళం చెవిని బయట షూ ర్యాక్‌లో పెట్టి వెళ్లిపోయాడు. కిరణ్‌కు ఆ తాళం చెవి కనిపించింది. వెంటనే దాన్ని తీసుకుని లోపలికి ప్రవేశించాడు. అక్కడ చేతివాటం ప్రదర్శించాడు. ఇంట్లో ఉన్న రూ.55 లక్షల విలువ చేసే 348 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించుకుని అక్కడి నుంచి ఉడాయించాడు.
యజమాని షాక్..
ఇంటి యజమాని జగదీష్ ఇంటికి వచ్చే సరికి తాళం తెరిచి ఉంది. లోపలికి వెళ్లి చూడగా.. దొంగతనం వ్యవహారం బయటపడింది. నగలు మాయమవడాన్ని గుర్తించి అతడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే వైట్‌ఫీల్డ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని అని స్కూల్‌కు వెళ్లిన తన కుమారుడికోసం తాళం షూర్యాక్‌లో పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అక్కడ కిరణ్ కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో.. అతడి కోసం గాలింపు చేపట్టారు.
పశ్చాత్తాపంతో గుండు గీయించుకున్నాడు..
దొంగతనం అనంతరం కిరణ్ పశ్చాత్తాపం పడ్డాడు. సమీపంలోని గుడికి వెళ్లి గుండుగీయించుకున్నాడు. అనంతరం తిరిగి వస్తూ పోలీసులకు చిక్కాడు. కిరణ్‌ను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. నేరం అంగీకరించాడు. పోలీసులు అపహరణకు గురైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన నేపథ్యంలో నివాసితులకు పోలీసులు కీలక విజ్ఞప్తి చేశారు. ఇంటి తాళాలను పూల కుండీలు, షూ ర్యాక్స్, కిటికీల్లో ఉంచకూడదని సూచించారు. ఇలా చేయడం వల్ల దొంగలు ఈజీగా కీలను గుర్తిస్తారని.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Dolphins | కొంకణ్ తీరంలో అరుదైన దృశ్యం.. ఒకేసారి 75 డాల్ఫిన్లు కనువిందు
Kulavardhan death news| బాలిక హత్య కేసులో మరో ట్విస్టు.. నిందితుడు కులవర్ధన్ మృతి
