Dolphins | కొంక‌ణ్ తీరంలో అరుదైన దృశ్యం.. ఒకేసారి 75 డాల్ఫిన్లు క‌నువిందు

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ (Sindhudurg) జిల్లా పరిధిలో గల కొంకణ్‌ తీరం (Konkan coast)లో ప‌ర్యాట‌కుల‌కు డాల్ఫిన్ల (Dolphins) గుంపు క‌నువిందు చేసింది. సముద్రంలో దాదాపు 70 నుంచి 75 డాల్ఫిన్లు ఈదుతూ కనిపించాయి.

Dolphins | కొంక‌ణ్ తీరంలో అరుదైన దృశ్యం.. ఒకేసారి 75 డాల్ఫిన్లు క‌నువిందు

Dolphins | పశ్చిమ కనుమలు, అరేబియా సముద్ర తీర ప్రాంతం మధ్య విస్తరించిన అందమైన ప్రదేశం కొంకణ్ (Konkan). నిత్యం ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున ప‌ర్యాట‌కులు వ‌స్తుంటారు. అక్క‌డి ప్ర‌కృతి అందాల‌ను చూసి మైమ‌ర‌చిపోతుంటారు. తాజాగా కొంక‌ణ్ తీర ప్రాంతంలో ప‌ర్యాట‌కుల‌కు ఓ అరుదైన దృశ్యం క‌నువిందు చేసింది.

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ (Sindhudurg) జిల్లా పరిధిలో గల కొంకణ్‌ తీరం (Konkan coast)లో ప‌ర్యాట‌కుల‌కు డాల్ఫిన్ల (Dolphins) గుంపు క‌నువిందు చేసింది. దేవ్‌బాగ్‌ – తార్కర్లీ బీచ్‌ సమీపాన సముద్రంలో దాదాపు 70 నుంచి 75 డాల్ఫిన్లు ఈదుతూ కనిపించాయి. ఒకేచోట అన్ని డాల్ఫిన్లు క‌నిపించ‌డంతో ప‌ర్యాట‌కులు ఆశ్చ‌ర్య‌పోయారు. అంతేకాదు, నిత్యం చేప‌ల వేట‌కోసం స‌ముద్ర జ‌లాల్లో సంచ‌రించే మ‌త్స్య‌కారులు సైతం ఈ అరుదైన దృష్యాన్ని చూసి న‌మ్మ‌లేక‌పోయారు. ఇంత పెద్ద సంఖ్య‌లో డాల్ఫిన్లు ఒకేచోట క‌నిపించ‌డం ఇదే మొద‌టిసారి అని వారు పేర్కొన్నారు.

డాల్ఫిన్లు స్విమ్ చేస్తున్న దృశ్యాల‌ను సముద్ర జీవ శాస్త్రవేత్త విశాల్‌ భావే (Vishal Bhave) డ్రోన్ సాయంతో చిత్రీక‌రించారు. వాటిని సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ఇది చూసిన నెటిజ‌న్లు, ప‌లువురు ప‌ర్యావ‌ర‌ణ నిపుణులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది అరుదైన దృశ్యంగా పేర్కొంటున్నారు. కాగా, సింధుదుర్గ్, రత్నగిరి తీర ప్రాంతాలు డాల్ఫిన్ల ఆవాసాలుగా ప్రసిద్ధి. ఇక్క‌డ డాల్ఫిన్లు క‌నువిందు చేస్తుంటాయి. కానీ ఒకేసారి పెద్ద మొత్తంలో డాల్ఫిన్లు స్విమ్ చేస్తూ క‌నిపించ‌డం ఇదే తొలిసారి. ఈ డాల్ఫిన్లు హిందూ మహాసముద్రంలోని హంప్‌బ్యాక్ జాతికి (Humpback Dolphins) చెందిన‌విగా నిపుణులు చెబుతున్నారు.

 

ఇవి కూడా చదవండి :

Kulavardhan death news| బాలిక హత్య కేసులో మరో ట్విస్టు.. నిందితుడు కులవర్ధన్ మృతి
TG EAPCET | రేప‌ట్నుంచే టీజీ ఎప్‌సెట్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌.. అమ్మాయిల‌కు శుభ‌వార్త‌..!