Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని అగ్నిప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ వారం రోజుల వ్యవధిలోనే రెండు, మూడు చోట్ల అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. గురువారం అర్ధరాత్రి చందానగర్‌లోని ఓ ఫర్నీచర్ షాపులో మంటలు చెలరేగి గంటలోనే మొత్తం కాలి బూడిదైంది. మార్చి 7వ తేదీన సోమాజిగూడ రాజ్‌భవన్ రోడ్డులోని ఓ మద్యం దుకాణంలో మంటలు చెలరేగాయి. తాజాగా శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో టోలిచౌకీ సమీపంలోని కుతుబ్‌షాహి సెవెన్ టూంబ్స్ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
కుతుబ్ షాహి సెవెన్ టూంబ్స్ సమీపంలో ఉన్న సబ్‌స్టేషన్ పక్కన ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట చిన్నగా ప్రారంభమైన ఈ మంటలు కాసేపట్లోనే భారీగా ఎగిసిపడుతూ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది.
రంజాన్ మాసంలో మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న వారు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే మసీదు కమిటీ, స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దాదాపు 2000 మంది ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరగడం వల్ల కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కానీ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
