CM Revanth Reddy | ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తే తప్పేంటి? : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | ప్రజల్ని ఆందోళనకు గురిచేసేలా కొంతమంది ఉద్దేశ పూర్వకంగా, మరికొందరు అసంపూర్ణ సమాచారంతో అర్ధసత్యాలను ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy | విధాత, హైదరాబాద్ : ప్రజల్ని ఆందోళనకు గురిచేసేలా కొంతమంది ఉద్దేశ పూర్వకంగా, మరికొందరు అసంపూర్ణ సమాచారంతో అర్ధసత్యాలను ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అధికారాన్ని కాపలాదారుగా వినియోగిస్తాం తప్ప… ప్రజలపై ఆధిపత్యం చెలాయించడానికి కాదు అనేది మా ప్రభుత్వం నమ్ముతుంది అని స్పష్టం చేశారు.

ఇవ్వాళ మూసీ ఇన్వైట్స్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతతో ఈ కార్యక్రమం ద్వారా వాస్తవాలను ప్రజలకు చెప్పాలని భావించామన్నారు. మానవ నాగరికత నది చుట్టూనే అభివృద్ధి చెందింది. ప్రపంచ దేశాలు అభివృద్ధి పథంలో నడుస్తుంటే.. మనం వెనకబడితే భవిష్యత్ తరం మనల్ని క్షమించదు అన్నారు. అన్నివర్గాల మేధావులతో సమావేశమై ఎలాంటి అభివృద్ధి చేయాలనే అంశంపై సూచనలు తీసుకున్నామన్నారు. 1908 మూసీ వరదలు నగరాన్ని ముంచెత్తాయి. ఆ సమయంలో ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో సంప్రదించి వరదల నియంత్రణకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లను నిజాం నిర్మించారు. వందేళ్లుగా వరద ముప్పు నుంచి నగరాన్ని కాపాడటమే కాదు.. నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆ రిజర్వాయర్లు ఉపయోగపడుతున్నాయి. గొప్ప వారసత్వ సంపద కలిగిన ఈ నగరాన్ని ఇలాగే వదిలేద్దామా? నేను ఎవరినీ విమర్శించదలచుకోలేదు, కానీ విజ్ఞప్తి చేయదలచుకున్నాను అని రేవంత్ రెడ్డి అన్నారు.

పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్లు ఎందుకు మూసీ ప్రక్షాళన అడ్డుకుంటున్నారు. అభివృద్ధిని అడ్డుకోవడం సమస్యకు పరిష్కారం కాదు.. ఎందుకు అడ్డుకుంటున్నారో కారణం చెప్పండి అని సవాల్ చేశారు. ఏదైనా తప్పులు ఉంటే సూచనలు చేయండి. పాలకులు మారినా నగర అభివృద్ధి ఆగలేదు… 1994 నుంచి ఇప్పటి వరకు పరిపాలనలో పాలసీ పెరాలసిస్ ఎప్పుడూ రాలేదు. ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినా కొంతమందినే గుర్తుంచుకుంటాం. దార్శనికతతో అభివృద్ధి ప్రణాళికలు రచించి అభివృద్ధి చేసిన వారే చరిత్రలో గుర్తుంటారు. ఆనాడు హైదరాబాద్ నగరాన్ని నిజాం ఎకనామిక్ జోన్ గా తీర్చిదిద్దారు. అలాంటి నగరాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం. మూసా, ఈసా నదుల సంగమం వద్ద మహాత్మా గాంధీ ఆనాడు అస్థికలు కలిపారు. అంతటి చరిత్ర ఉన్న బాపూ ఘాట్ ను ఎంతమంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. కాలుష్యంతో మూసీ నది విషతుల్యంగా మారింది. మానవ తప్పిదాలతో నల్లగొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో పుట్టిన మూసీ నది హైదరాబాద్ కు వచ్చే సరికి కాలుష్యమయంగా మారుతోంది. మూసీకి, హైదరాబాద్ నగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఆ చరిత్రను కాలగర్భంలో కలిపేద్దామా? లేక మూసీనదితో పాటు హైదరాబాద్ నగరాన్ని పునరుజీవింపజేసుకుందామా? ఎవరికో నష్టం కలిగించాలన్నది మా ప్రభుత్వ ఉద్దేశం కాదు అన్నారు.

మూసీ పరివాహక ప్రాంతంలో బుల్డోజర్లు తీసుకెళ్తున్నారని కొందరు అంటున్నారు. కేంద్రం తెచ్చిన చట్టాన్ని అమలు చేస్తామంటే కొందరు అడ్డుపడతామంటున్నారు. కేవలం ఇది మూసీ పునరుజ్జీవనం మాత్రమే కాదు… మన సంస్కృతిని, చరిత్రను కాపాడుకోవడం. అందులో భాగంగానే నల్ల చెరువు, బతుకమ్మ కుంట బమ్రూక్ ఉద్దౌలా వంటి చెరువులను పునర్దుద్ధరించాం. ఇవాళ మూసీ పునరుజ్జీవనాన్ని అడ్డుకుంటున్నవారు మూసీ పరీవాహకంలో నివసించగలరా అని ప్రశ్నించారు. వాళ్లు ఉంటానంటే అన్ని సౌకర్యాలతో కంటైనర్ హౌస్ ఇస్తా.. మూడు నెలలు అక్కడ ఉండగలరా? ఎందుకు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. పేదలకు సరైన మౌలిక వసతులు కల్పించొద్దా? బ్లూ కాలర్ జాబ్స్ క్రియేట్ చేయొద్దా? పర్యటక అభివృద్ధి జరగొద్దా? నైట్ ఎకానమి అభివృద్ధి చెందొద్దా? అభివృద్ధిని అడ్డుకుని ఇంకా వెనక్కి రాతి యుగాల వైపు వెళ్ళిపోదామా అని ఆయన అడిగారు.

నిజాం చేసినదాంట్లో పది శాతం కూడా మనం చేయకపోతే చరిత్ర మనల్ని క్షమిస్తుందా? బ్యూటిఫికేషన్.. లూటిఫికేషన్ అని కొందరు మాట్లాడుతున్నారు. రూ.5 వేల కోట్లతో గాంధీ విగ్రహం అంటూ సొంత తెలివి ప్రదర్శిస్తున్నారు. ఎంత పెద్ద యుద్ధాన్నైనా శాంతితో గెలవచ్చని మహాత్మా గాంధీ నిరూపించారు. అలాంటి మహాత్ముడి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మనపై లేదా? మన చరిత్రను తిరిగి రాసుకునే అవకాశాన్ని మనం వదులుకుందామా? దేవతలు యజ్ఞాలు చేసినపుడు రాక్షసులు భగ్నం చేసే ప్రయత్నం చేశారు. సుబాహు, మారీచుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తే లోక కళ్యాణం కోసం చేసే యజ్ఞం ఆగిందా? లోక కళ్యాణం కోసం చేసే పనులకు సహకరించకపోయినా ఫరవాలేదు.. కానీ దయచేసి అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు. ఈ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదు.. ఎవరి ఆస్తులు గుంజుకునేందుకు కాదు అన్నారు. ఇది భవిష్యత్తరాల కోసం మనం చేస్తున్న అభివృద్ధి. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం. మూసీ పునరుజ్జీవనంతో రాష్ట్రం గ్రోత్ ఇంజన్ గా మారుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగినపుడు కూడా కొందరు భూములు కోల్పోయారు. మూసీ బాధితులకు ఎలాంటి పరిహారం ఇద్దామో చెప్పండి అని అడిగారు. మూసీ పరివాహక నిరాశ్రయుల పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నాయి. జన ఆందోళన్ సంఘంతో మాట్లాడి మా ప్రభుత్వం ఇండ్లు నిర్మించే ప్రయత్నం చేస్తోంది. స్కూల్స్, ఇతర సౌకర్యాలతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో వారికి ఉపాధి కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. పేదలకు మేలు చేయడానికే మా ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తే తప్పేంటి? పర్యాటకం అభివృద్ధి చేస్తే తప్పేంది? ప్రపంచమంతా మన హైదరాబాద్ వైపు చూస్తోంది. హైదరాబాద్ సురక్షిత నగరం. పేదవాళ్లను నిరాశ్రయులను చేయాలని మేం అనుకోవడంలేదు అన్నారు. పేదలతో శత్రుత్వం పెంచుకుంటే ఎవరైనా మళ్లీ అధికారంలోకి వస్తారా? మూసీ పునరుజ్జీవం జరిగితే కాంగ్రెస్ కు, రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుందని, ఇక వాళ్లకు అధికారం కలగానే మిగులుతుందని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కడుపులో కుళ్ళు, మాటల్లో విషం, చూపుల్లో పగతో అడ్డుకోవాలని చూస్తున్నారు. నేను మీలో ఒకడిని.. మీ సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందరి సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుందామని రేవంత్ రెడ్డి అన్నారు.

Latest News