Bhu Bharati | తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి పోర్టల్( Bhu Bharati Portal )2025 ఏప్రిల్ 14న శిల్పాకళా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ భూభారతి పోర్టల్‌ను ప్రయోగాత్మకంగా నాలుగు మండలాల్లో అమలు చేస్తున్నారు. నారాయణపేట జిల్లాలో మద్దూరు మండలం, కామారెడ్డి జిల్లాలో లింగంపేట, ములుగు జిల్లాలో వెంకటాపూర్, ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలాల్లో ఈ పోర్టల్‌ను అమలు చేస్తున్నారు. జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు.
ఈ ఏడాది జనవరి 9న రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ -2025 భూభారతి చట్టం( Bhu Bharati Act )రూపం దాల్చింది. 19 సెక్షన్లతో ఏర్పాటైన ఈ చట్టం అమలు దిశగా అప్పట్నుంచే ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. భూ యజమానులు సులువుగా కొత్త చట్టాన్ని వినియోగించుకునేలా.. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, విశ్రాంత రెవెన్యూ అధికారులతో సమావేశాలు నిర్వహించి, సూచనలు, సలహాలు స్వీకరించింది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో చట్టం అమలవుతున్నప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయనే విషయాలపై కూలంకషంగా చర్చించింది. ఆబాదీ భూములకు హక్కులు, రిజిస్ట్రేషన్ సమయంలో సర్వేపటం సమర్పణ, భూములకు గుర్తింపు సంఖ్య భూధార్ తదితర కీలకమైన సేవల అమలుకు కూడా కొత్త చట్టంలో మార్గదర్శకాలను రూపొందించింది.
ఇక నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా కొనసాగుతున్న నేపథ్యంలో.. భూ భారతి చట్టం రైతులకు చుట్టమని సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్‌ను రద్దు చేసి.. రేవంత్ రెడ్డి సర్కార్ నూతనంగా రూపొందించిన భూ భారతి (రికార్డు ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) చట్టం 2025పై ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. భూ భారతి చట్టంపై ఉన్న అనుమానాలను, అపోహలను ప్రభుత్వ పెద్దలు, అధికారులు నివృత్తి చేస్తున్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో భూ సమస్యలు పరిష్కా రం కాకపోగా రైతులు నరకం అనుభవించారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు వేదికల మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఏది చెబితే అదే చట్టంగా ఉండేదని విమర్శలు గుప్పిస్తున్నారు. దొర గారు ధరణి పథకాన్ని భూ స్వాముల కోసం తెచ్చి వేల కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తున్నారు. భూ భార తి చట్టం అలా కాకుండా పకడ్బందీగా పేదోడికి న్యాయం జరిగేలా రూపొందించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం ద్వారా తహసీల్దార్, ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్, సీసీఎల్ఏ ఇలా వివిధ స్థా యిల్లో భూ సమస్యలు పరిస్కారం అవుతాయని రెవెన్యూ మంత్రి చెబుతున్నారు. ఆయా స్థాయిలో పరిష్కారం కాకపోతే స్పెషల్ ట్రిబ్యునల్ ప్రవేశ పెట్టడానికి చట్టంలో వెసులుబాటు కల్పించినట్లు పేర్కొంటున్నారు. రెవెన్యూ అ ధికారులు ఉద్దేశపూర్వ కంగా తప్పులు చేస్తే ఈ చట్టం ద్వారా సదరు అధికారిపై చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు, భూ చట్టాల నిపుణులు ఎం సునీల్ కుమార్(భూమి సునీల్) భూ భారతి గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం..
ధరణిలో ఉన్న ఇబ్బందులేంటి..? భూభారతిలో ఉన్న అనుకూలతలేంటి..?
ధరణి చట్టం చాలా సమస్యలకు పరిష్కారం చూపించడం లేదు. తెలంగాణ రైతాంగం భూమి రికార్డులకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలకు ఆ చట్టంలో పరిష్కారం లేదు. ఆ చట్టాన్ని సవరించితే కూడా సరిపోదు. ఆ చట్టాన్ని సమగ్రంగా మారిస్తే తప్ప తెలంగాణ రైతాంగ సమస్యలకు పరిష్కారం దక్కదు అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ధరణి స్థానంలో కొత్త చట్టం తీసుకురావాలని నిర్ణయం జరిగింది. 24 ముసాయిదాలు తయారయ్యాయి. 25 దఫాలుగా ఈ చట్టాన్ని మార్చుకుంటూ వెళ్లాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. 11వ ముసాయిదా పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చిన తర్వాత అక్కడ్నుంచి ప్రజల అభిప్రాయాలను తీసుకుని విడుతల వారిగా చర్చించాం. ఆ తర్వాత అసెంబ్లీలోకి ముసాయిదా వెళ్లి చట్ట రూపమైంది. ప్రజాస్వామ్యయుతంగా సమస్యలకు పరిష్కారంగా ప్రజాభిప్రాయం మేరకు ముసాయిదా అసెంబ్లీ ముందుకు వెళ్లింది. సమస్యల పరిష్కారానికి సమాధానంగా, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి అనుగుణంగా చట్టం అమల్లోకి వచ్చింది.
ధరణిలో ఉన్న సమస్యలేంటి..?
సమస్యలు ఏంటంటే.. నాలుగు ప్రధాన సమస్యలు ధరణిలో ఉన్నాయి. ధరణి అనేది హక్కుల రికార్డు అంటే భూమి హక్కులు. హక్కులు రికార్డు చేసే చట్టం.. హక్కులు కల్పించే చట్టం కాదు ఇది. నాలుగేండ్లు కావొస్తుంది.. 18 లక్షల ఎకరాల భూమి ఇంకా హక్కుల రికార్డుల్లోకి ఎక్కలేదు. చాలా వరకు పట్టా భూములకు పరిష్కారం లేక పెండింగ్‌లో ఉన్నాయి. 99 శాతం రికార్డు బాగుందని నాటి ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే.. ధరణి తప్పుల మీద 20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రామ సభలు నిర్వహిస్తే ఒక్కో గ్రామంలో 200లకు తక్కువగా సమస్యలు రాలేదు. అంటే 25 లక్షల మంది రైతు కుటుంబాలకు ధరణిలో సమస్యలు ఉన్నాయి. కలెక్టర్, సీసీఎల్ఏ పరిష్కారం చేస్తున్నారనే సందేహం రావొచ్చు. ఆశ్చర్యకరం ఏందంటే ఆర్‌వోఆర్‌లో వారికి అధికారం లేదు. కానీ పరిష్కారం చేస్తున్నారు. ఎట్టా చేస్తారని హైకోర్టులో పిల్ పెండింగ్‌లో ఉంది. దానికి చట్టబద్ధత కల్పించాలి.
సాదా బైనామాకు పరిష్కారం ఉందా..?
సాదా బైనామాకు సంబంధించి 9 లక్షల 24 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనికి ధరణి చట్టంలో పరిష్కారం లేదు. ధరణి అనేది రికార్డు.. తప్పులు జరిగితే అప్పీల్ వ్యవస్థ లేదు. ఎలాంటి సమస్యకైనా కోర్టుకు ఎక్కాల్సిందే. ఇలా ఒక 15 రకాల ఇబ్బందులు ధరణి చట్టంలో ఉన్నాయి. వాటన్నింటిని మారుస్తూ.. ఈ సమస్యలకు భూ భారతి చట్టంలో పరిష్కారం చూపించాం.
అధికారులు ప్రజలకు వద్దకు వెళ్లి రికార్డులు సరి చేసిన వ్యవస్థ పోయి ప్రజలు తన రికార్డును ఎక్కడ చూసుకోవాలో తెలియని స్థితికి ఎందుకు జరిగింది టెక్నాలజీ వస్తున్న కాలంలో..?
ఈ ప్రశ్నలకు అందరం సమాధానాలు వెతుక్కోవాల్సి ఉంది. కాగితాల మీద రికార్డు ఉంటే ట్యాంపరింగ్, లంచగొండితనం పెరుగుతుందని భావించి కంప్యూటరీకరణ ఒక పరిష్కారం మార్గంగా భావిస్తూ వచ్చాం. 80వ దశకంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం భూమి రికార్డులను కంప్యూటరీకరణ చేయాలని నిర్ణయించింది. కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ పేరుతో ప్రాజెక్టు రాగా పైలట్ ప్రాజెక్టులో దేశ వ్యాప్తంగా 6 జిల్లాలు ఎంపిక అయితే ఒకటి రంగారెడ్డి జిల్లా. 2004లో వచ్చిన ఎన్ఆర్ఎల్ ఎంపీ, ఇప్పుడున్న డీఆర్ఎల్ఎంపీ కావొచ్చు.. రికార్డులన్నీ కంప్యూటర్‌లో భద్రపరచాలని చెబుతున్నాం.
భూపరిపాలనలో, రెవెన్యూ రికార్డుల మేనేజ్‌మెంట్‌లో, భూమి హక్కులకు భద్రత కల్పించడంలో కంప్యూటరీకరణ నూటికి నూరు శాతం విజయవంతం అయిందా..? ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా..? కంప్యూటరీకరణ తెచ్చిన కొత్త చిక్కులేంటి..?
వీటికి సమాధానం వెతుక్కోవాలి. ఇంకోటి ఇంత కంప్యూటేషన్ ఎరలో కూడా ఈ దేశంలో ఒక సామాన్య రైతు తన భూమి హక్కులు చూసుకోవాలన్నా.. తన భూమి భద్రంగా ఉందని అనుకోవాలన్నా.. కంప్యూటర్‌లో ఉంటే భద్రంగా ఉంటాయని ఫీలవుతున్నాడా..? కాగితాల రికార్డు ఉండాలని కోరుకుంటున్నాడా..? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలి. భూ రికార్డుల ఆధునీకరణ మీద చాలా మంది రీసెర్చ్‌లు చేశారు. పీహెచ్‌డీలు కూడా చేశారు. వేల సంఖ్యలో వ్యాసాలు కూడా రాశారు. పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. ఇందులో రెండు మూడు అంశాలు పదే పదే చర్చకు వస్తున్నాయి. అవేంటంటే.. కంప్యూటరీకరణ జరిగినంత మాత్రాన అన్ని పరిష్కారం కాలేదు. కంప్యూటర్ ఈజ్ ఏ టూల్. నువ్వు ఏం పెడితే అది ఇస్తది తప్ప.. తప్పుడు రికార్డులను క్లీన్ చేసి పర్‌ఫెక్ట్ ఇవ్వదు. ఎస్ఆర్ శంకరన్ ఏమన్నారంటే.. ఈ రోజుకు కూడా రైతు తన భూమి హక్కులు భద్రంగా ఉండాలన్న కాగితాలే కీలకం. కంప్యూటర్ రికార్డు ఉండాలి.. అదే విధంగా రైతు వద్ద ఓ కాపీ ఉండాలి. ప్రభుత్వాలు కూడా కాగితాలు తెచ్చి ఇవ్వాలి.
భూమి రికార్డుల ఆధునీకరణ – కంప్యూటరీకరణ అనగానే కర్ణాటక గుర్తుకు వస్తుంది. ఆ రాష్ట్రంలో 20 ఏండ్లుగా కంప్యూటరీకరణ జరుగుతుంది. భూమి కావేరి ప్రాజెక్టుల పేరుతో చాలా అభివృద్ధి సాధించిన కర్ణాటకలో రెండేండ్ల కింద ఇంటింటికి తిరిగి భూమి రికార్డుల పత్రాలను పంపిణీ చేశారు. ప్రతి రైతు తన భూమి హక్కులు ఈజీగా తెలుసుకునేందుకు మండల కేంద్రాల్లో ఏటీఎం లాంటి మెషీన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. సర్వే నంబర్ కొడితే నకలు వస్తుంది. దిశాంక్ అనే యాప్ కూడా తీసుకొచ్చారు. దీంతో కర్ణాటక రైతులు తమ భూముల వివరాలను ఎప్పుడు పడితే అప్పుడు తమ హక్కులను తెలుసుకుంటున్నారు. అయినా కూడా రెండేండ్ల కింద భూమి రికార్డుల పత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. అంటే ధరణి కావొచ్చు.. రేపు రాబోయే భూ భారతి కావొచ్చు.. కంప్యూటరీకరణ ద్వారా రైతాంగానికి ఫలితాలు అందాలంటే కాగితాల రికార్డులు కూడా ఉండాలి. ఆన్‌లైన్ రికార్డుతో పాటు ఆఫ్ లైన్ రికార్డులు కూడా ఉండాలని చెబుతుంది భూభారతి. ఒక వ్యక్తికి ఏ విధంగా భూమి మీద హక్కు వచ్చినా రికార్డుల్లోకి ఎక్కేలా ఉండాలి. పీవోడీ చట్టాన్ని సవరించుకున్నప్పుడు పేదోడు అసైన్‌మెంట్ భూమి కొంటే ఆయనకే లావణి పట్టా ఇవ్వాలని చట్టం మార్చుకున్నాం. 2017 డిసెంబర్ 31 కంటే ముందు భూమి లేని పేద వ్యక్తి ఒక అసైన్‌మెంట్ భూమి కొంటే ఆయనకే లావణి పట్టా ఇవ్వాలని కలెక్టర్‌కు అధికారం ఇచ్చాం. మరి కలెక్టర్ రెగ్యులరైజ్ చేసినట్లు ఆర్డర్ ఇస్తే ఆర్వోఆర్‌కు ఎక్కాలి కదా..? కానీ రికార్డుల్లోకి ఎక్కించుకునేందుకు ధరణిలో అవకాశం లేదు. మరి వారి హక్కులకు చిక్కులు వచ్చినట్టే కదా..? మ్యుటేషన్ జరగక చాలా పెండింగ్‌లో ఉన్నాయి.
యాజమాన్య హక్కులు కలిగి ఉండి.. పట్టాకు ఎక్కని వారు ఉన్నారా..?
గడిచిన నాలుగైదు ఏండ్లుగా తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలంగాణలో యాజమాన్య హక్కులు పొందగలిగే అర్హతలు కలిగి ఉండి.. పట్టాకు ఎక్కని వారు బోలేడు మంది ఉన్నారు. 1989లో అప్పటి ఆర్వోఆర్ చట్టం అమలు చేశారు. ఈ ఆర్వోఆర్ చట్టాన్ని యథాతథంగా అమలు చేస్తే 90 శాతం మంది రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వలేం అన్నారు కలెక్టర్లు. ఎందుకంటే వీళ్లందరూ కాస్తులో ఉన్నారు. కాబట్టి కాస్తు కాలంలోకి ఎక్కించగలం కానీ పట్టా కాలంలోకి ఎక్కించేందుకు అర్హతలు లేవన్నారు. కొందరు సాదా బైనామా ద్వారా కొనుక్కున్నారు. సాయుధ పోరాటంలో జెండాలు పాతి భూములను పొందారు. ఆ భూ యజమానులు ఎక్కడో ఉన్నారు. వాళ్లేమో వీళ్లకు రాసివ్వలేదు. కేవలం కబ్జాల్లో ఉన్నారు. రక్షిత కౌలుదార్లు ఉన్నారు. ఇలా ఓ పదిహేను రకాల సమస్యలు కలెక్టర్లు చెప్పారు. 90 శాతం మంది రైతులు కాస్తులో ఉండి భూమి దున్నుకుంటూ ఉన్నారు. వారికి పట్టా కాలేదు. కాబట్టి వారికి కాస్తు కాలంలో ఉన్న పేరే ఏకైక ఆధారం. ఈ రోజున ఆ 90 శాతం మంది రైతులు పట్టా కాలంలోకి ఎక్కలేదు. కాస్తుదారు కాలం తొలగించడం ద్వారా వారి హక్కులకు సమస్యలు వచ్చాయని వారికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ భూ భారతి చట్టంలో ఈ సమస్యలకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేసింది.
పట్టా కాలంకు ఎక్కని వారు ఎంత మంది ఉన్నారంటే..?
2014 నాటికి సాదా బైనామా ద్వారానో మరో రకంగానో, యాజమన్యా హక్కులు ఉండి కాస్తు చేసుకుంటూ ఉండి పట్టా కాలంకు ఎక్కని వారు ఎంతో మంది ఉన్నారు. 2024 ధరణి ప్రకారం పోల్చుకుని చూస్తే ఆ లెక్కలు బయటపడుతాయి. కాస్తు కాలం తొలగించడంతో చాలా మంది తమ యాజమాన్య హక్కులు కోల్పోయారు. కొన్ని లక్షల మంది నష్టపోయి ఉంటారని చెబుతున్నారు. ధరణి వచ్చిన తర్వాత పట్టా కాలంలోకి ఉన్నవారికి బెనిఫిట్ జరిగింది. కాస్తు కాలంలో ఉన్నవారికి తీవ్ర నష్టం జరిగింది. ఇలా ఎంత జరిగిందంటే ఒక ఆడిట్ జరిగితే తప్ప బయట పడదు.
కాస్తు కాలం పెట్టి కబ్జాలను ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.. అని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది..? మరి పేద రైతులకు మేలు జరుగుతుందా..? కీడు జరుగుతుందా..?
1971లో కాస్తు కాలం రాయాలని ఉంది. అంతకు ముందున్న 1948, 1936 చట్టంలో కూడా ఉంది. ఈ రోజున దేశ వ్యాప్తంగా ఆర్వోఆర్ చట్టం ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా ఆర్వోఆర్‌లో ఎవరెవరి పేర్లు రాయాలని ఉందంటే భూ యజమాని పేరు, కాస్తుదారు పేరు రాయాలని అన్నింట్లో ఉంది. ఒక్క ధరణి చట్టం తప్ప ఆంధ్రప్రదేశ్ చట్టంలో ఇంకా ఉంది. ఆక్యుపెంట్ కాలం ఉంటది. ఈ కాలం ఆర్వోఆర్‌తో పాటు విలేజ్ రికార్డుల్లో కూడా ఉంటుంది. ధరణి వచ్చిన తర్వాత ఆర్వోఆర్‌లో ఉన్న ఆక్యుపెంట్ కాలం తీసేశారు. పహణీ రాయడం మానేశారు కాబట్టి పహణీలో ఆక్యుపెంట్ కాలం లేదు. కేవలం ఆక్యుపెంట్ కాలంలో ఉన్నవారికి ఉన్న ఆధారం కాస్త ఎగిరిపోయింది. ఇది జరిగిన వాస్తవం. ఈ భూభారతి చట్టం ఏం చెబుతుందంటే ఆక్యుపెంట్ అనే వారు ఎవరు..? దానికి ఒక నిర్వచనం ఇచ్చారు. భూమి ఇప్పుడు సాగులో ఉండి ప్రభుత్వం నిర్దేశించిన షరతులకు లోబడి ఉన్న వారినే ఆక్యుపెంట్ అంటారు. వారి పేర్లను మాత్రమే ఎక్కిస్తారని చట్టంలో పేర్కొన్నారు. షరతులు ఏంటి..? ఎవరు ఎక్కిస్తారు అనేది చాలా కీలకమైన అంశం. అయితే ఇందులో కౌలుదారు పేరు రాయడానికి వీలు లేదు. కాస్తు కాలంలో యజమాని అయి ఉండి ఇంకా పట్టాకు నోచుకోని వాడి పేరును కాస్తు కాలంలో రాస్తాం. భూమిపై పూర్తి హక్కులు ఉన్నోడే యజమాని. పట్టా కాకపోతే వాడు ఓనర్ కాకుండా పోతాడా..? కాబట్టి టెక్నికల్‌గా ప్రాబ్లం ఉన్న రైతే ఆక్యుపెంట్ కాలంలో ఉంటాడు. చట్టం ప్రకారం.. 2014లో పహణీలో ఉన్న వారందరినీ తీసుకొచ్చి ఆక్యుపెంట్ కాలంలో రాయడానికి కుదరదు. ఒకటి 2014లో పోజిషన్‌లో ఉన్నాయన ఇప్పుడు కూడా ఉండాలి. ఇది కొత్త షరతు. ఇప్పుడు ప్రభుత్వం విధించబోయే షరతులన్నింటికీ లోబడి ఉండాలి. అయితే 12 ఏండ్లు కాదు.. 20 ఏండ్లు భూమి చేసుకున్న కౌలుదారు ఎప్పటికీ యజమాని కాలేడు. కౌలు అనేది అగ్రిమెంట్ ప్రకారం జరిగేది. భూమిని కొనుగోలు చేసినప్పుడే యజమాని అయ్యే అవకాశం ఉంది. 12 ఏండ్ల పాటు కౌలుదారుగా కొనసాగిన తర్వాత.. ఒక వేళ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే ఆ భూమికి యజమాని కావొచ్చు. ఒకటి కొత్త ఆర్వోఆర్ చట్టం కౌలుదారుకు కొత్త ఆధారం సృష్టించదు. కౌలు 12 ఏండ్లు చేసుకున్నంత మాత్రాన యజమాని అయ్యే అవకాశం లేదు.
సర్వే మ్యాప్ తెలంగాణలో అమలు చేయబోతున్నారా..?
ప్రతి సేల్ డీడ్‌కి సర్వే మ్యాప్ పెట్టాలన్న నిబందనను చట్టంలో చేర్చారు. ఇది డిస్ప్యూట్ ఫ్రీ ల్యాండ్ మార్చేందుకు ఉపయోగపడుతుంది. ఇది కర్ణాటక రాష్ట్రంలో విజయవంతమైంది. తెలంగాణలోనూ ఇది అమలు చేసేందుకు భూ భారతిలో పొందుపరిచాం. అయితే ఇది ఇప్పటికిప్పుడు జరగదు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకం జరగాలి. అలాగే ప్లాట్ రిజిస్ట్రేషన్‌కి ఎలాగైతే మ్యాప్ గీస్తున్నారో అలాంటిదే ఇది. అయితే లైసెన్స్‌డ్ సర్వేయర్ కొలతలు వేసి బౌండరీస్, అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన మ్యాప్‌ను ఇస్తారు. దాన్ని రెగ్యులర్ సర్వేయర్ పరిశీలించి ఆమోదిస్తారు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
సర్వే చేయించుకోవాలంటే దరఖాస్తు ఎలా..?
రైతులు సొంతంగా తమ భూమిని సర్వే చేయించుకోవచ్చు. చట్టంలోని సెక్షన్ 5, 7, 8 ప్రకారం మ్యుటేషన్ సందర్భంగా మ్యాప్ కావాలి. మండల సర్వేయర్ సర్వే మ్యాప్ గీసిస్తే దాన్ని పాస్ బుక్‌లో చేర్చేందుకు సెక్షన్ 10 ప్రకారం తహశీల్దార్‌కు అధికారం ఉంది. లైసెన్స్‌డ్ సర్వేయర్ గీసినా దాన్ని మండల సర్వేయర్ పరిశీలించి తహసీల్దార్‌కు సమర్పించనున్నారు. సర్వేయర్ వాలిడేషన్ తర్వాత తహసీల్దార్ పాస్ బుక్‌లో జత చేసేందుకు వీలవుతుంది.
రెవెన్యూ అధికారులకు, ఉద్యోగులకు అవగాహన కల్పించారా..?
ప్రస్తుతం భూ భారతి చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. ప్రతి జిల్లా కలెక్టర్ మండలాల్లో సదస్సులను నిర్వహిస్తున్నారు. చట్టంలోని రూల్స్ గురించి ప్రతి చిన్న విషయం అధికారులకు తెలియాలి. తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లతో పాటు ప్రతి రెవెన్యూ ఉద్యోగికి మార్గదర్శకాల గురించి తెలిసినప్పుడే అమలు చేయడానికి సాధ్యమవుతుంది.
కొత్త పాస్ బుక్స్ కోసం దరఖాస్తు చేయలా..?
భూ భారతి రాగానే మళ్లీ పాసు పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ధరణి పాస్ బుక్ ఉంటే మళ్లీ దరఖాస్తు చేయాల్సిన పని లేదు. దరఖాస్తు పెండింగ్‌లో ఉంటే మళ్లీ పెట్టుకోవాలి. సాదా బైనామా దరఖాస్తులకు అవకాశం లేదు. గతంలో పెండింగ్‌లో ఉన్న 9 లక్షల దరఖాస్తుల పరిశీలన మాత్రమే జరుగుతుంది. ఇక నుంచి తెల్ల కాగితాల మీద కొనుగోళ్లు, అమ్మకాలు చెల్లవు. ప్రతి కమతానికి భూధార్ నంబర్ ఇవ్వాలని భూభారతిలో పొందుపరిచాం. భూధార్ నంబర్ రికార్డుల పరిశీలన తర్వాతే మొదలవుతుంది.