Feeding Pigeons | విదేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడి పౌరులు ప్రభుత్వ రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా పావురాలకు మేత (Feeding Pigeons) వేసినందుకు ఓ భారత సంతతికి చెందిన మహిళ (Indian origin elderly woman)కు సింగపూర్ కోర్టు (Singapore court) భారీ జరిమానా విధించింది.
టో పాయో హౌసింగ్ ఎస్టేట్‌లో భారత సంతతికి చెందిన షణ్ముగంనాథన్ షమ్లా (Sanmugamnathan Shamla) అనే 71 ఏళ్ల వృద్ధురాలు నివసిస్తోంది. అయితే, ఆమె తన నివాసం వద్దకు వచ్చిన పావురాళ్లకు ఆహారం వేసింది. ఆరు నెలల్లో అంటే గత జులై నుంచి ఈ ఏడాది జనవరి వరకూ ఏకంగా తొమ్మిదిసార్లు పావురాలకు దాణా వేసింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా కోర్టు ఆమెకు భారీగా జరిమానా విధించింది. ఏకంగా 3,200 సింగపూర్ డాలర్లు ఫైన్ వేసింది. అంటే మన భారత కరెన్సీలో రూ.2.27 లక్షలన్నమాట.
తప్పు ఒప్పుకుని..
కేసు దర్యాప్తు సందర్భంగా ఆ వృద్ధురాలు కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన తప్పును అంగీకరించారు. తాను అంత జరిమానా కట్టలేనని వేడుకున్నారు. అయినా కోర్టు ఆమె వాదనలను పరిగణనలోకి తీసుకోలేదు. భారీ జరిమానా విధిస్తేనే ఇలాంటి తప్పులు మళ్లీ మళ్లీ చేయరని కోర్టు అభిప్రాయపడింది. దీంతో చేసేదేమీ లేక ఆమె ఆ మొత్తాన్ని అక్కడే చెల్లించేసింది.
కఠిన చట్టం..
సింగపూర్ వైల్డ్‌లైఫ్ యాక్ట్ ప్రకారం.. ప్రభుత్వ అనుమతి లేకుండా అడవి జంతువులకు లేదా పక్షులకు ఆహారం వేయడం చట్టరీత్యా నేరం. సింగపూర్ ప్రభుత్వం పారిశుద్ధ్యం, పర్యావరణ సమతుల్యతకు పెద్దపీట వేస్తుంది. పక్షులకు, జంతువులకు ఆహారం వేయడం వల్ల ప్రజలకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని, ఎక్కడపడితే అక్కడ పక్షుల మలం వల్ల అపరిశుభ్రత ఏర్పడుతుందని అక్కడి అధికారులు భావిస్తుంటారు. అందుకే కఠిన చట్టాలను అమలు చేస్తుంటారు. ఇందులో భాగంగా నిబంధనలను పాటించకుండా పక్షులకు, జంతువులకు ఆహారం వేస్తే 10 వేల సింగపూర్ డాలర్ల వరకూ జరిమానా విధిస్తారు. ఈ విషయం తెలియక ఆ వృద్ధురాలు కోర్టు ఆగ్రహానికి గురైంది.
ఇవి కూడా చదవండి :
Mother Suprise Son Girlfriend : మెట్రో స్టేషన్ లో గర్ల్ ఫ్రెండ్ తో కొడుకు..తల్లి చేసిన పని వైరల్ !
అందుకేనా.. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం: బీఆర్ఎస్ కీలక ఆరోపణలు
