Beach Landing in Mogadishu | బీచ్‌లో దిగిన విమానం… షాక్​లో ప్రయాణీకులు! – సోమాలియాలో అద్భుతం!

మొగాదిషులో సాంకేతిక లోపంతో ఫోకర్–50 విమానం రన్‌వే దాటి సముద్రతీరంలో ఆగింది. 55 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. పైలట్ సమయస్ఫూర్తి పెద్ద ప్రమాదాన్ని తప్పించింది.

StarSky Aviation Fokker 50 emergency landing incident in Mogadishu Somalia

Somalia Plane Makes Dramatic Beach Landing in Mogadishu: 55 Passengers Safe After Technical Glitch

బీచ్‌లో దిగిన విమానం – మొగాదిషు ఘటన

సోమాలియాలోని మొగాదిషులో సాంకేతిక లోపంతో ఫోకర్–50 విమానం అత్యవసరంగా బీచ్‌లో ల్యాండ్ అయింది. పైలట్ సమయోచిత నిర్ణయంతో 55 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రయాణికులు నీళ్లలో నడుచుకుంటూ బయటకు వచ్చిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

విధాత వైరల్​ డెస్క్​ | హైదరాబాద్​:

Beach Landing in Mogadishu | విచిత్రమైన ఫోటో ఒకటి సోషల్​ మీడియాలో విపరీతంగా వైరల్​ అయింది. సముద్ర తీరంలో ఒక విమానం… కొంతమంది మోకాళ్ల లోతు నీళ్లలోనుండి నడుచుకుంటూ రావడం… సినిమా సన్నివేశంలా కనిపించిన ఈ దృశ్యం నిజంగా జరిగింది. సోమాలియా రాజధాని మొగాదిషులో జరిగిన ఈ అద్భుత ఘటనలో 55 మంది ప్రాణాలతో బయటపడటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పైలట్ తీసుకున్న క్షణకాల నిర్ణయం పెద్ద ప్రమాదాన్ని తప్పించింది.

టేకాఫ్ తర్వాతే సాంకేతిక లోపం… రన్‌వే దాటి సముద్రతీరంలో ఆగిన ఫోకర్–50

మంగళవారం ఉదయం సోమాలియాలోని రాజధాని మొగాదిషు(Mogadishu) లో ఉన్న Aden Adde International Airport నుంచి బయలుదేరిన స్టార్‌స్కై ఏవియేషన్‌కు చెందిన ఫోకర్–50 విమానంలో గాల్లోకి లేచిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. విమానాన్ని నడుపుతున్న పైలట్ సమస్యను గుర్తించి వెంటనే తిరిగి ల్యాండింగ్‌కు సిద్ధమయ్యాడు. ఈ విమానాశ్రయం, హిందూ మహాసముద్రతీరంలోనే ఉంటుంది. రన్​వేకు కొంచెం దూరంలోనే తీరం ఉండటం గమనార్హం.

సిబ్బంది తెలిపిన ప్రకారం, విమానం రన్‌వేను తాకినా, ఆగలేదు. అలాగే ముందుకు దూసుకెళ్లిన విమానం సముద్రం వైపు ప్రయాణించి హిందూ సముద్రపు బీచ్​లో ప్రవేశించింది.  పైలట్​ చాకచక్యంలో విమానాన్ని అదుపు చేసి ఆపగలిగాడు. అలల మధ్య ఇసుకలో ఆగిపోయిన విమానం దృశ్యం అక్కడి ప్రజలను షాక్​కు గురిచేసింది. ఇక ప్రయాణీకుల పరిస్థితి చెప్పే అవసరం లేదు. తమ ప్రాణాలు గాల్లో కలిసాయనుకున్న వారందరూ నీళ్లలోనుండి బయటకొచ్చారు. వారికే కాదు, అందరికీ జరిగిందొక అద్భుత ఘటన.

విమానంలో అయిదుగురు సిబ్బంది, 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సాధారణంగా అమలు చేసే ఎమర్జెన్సీ ఎగ్జిట్ విధానాన్ని సిబ్బంది వెంటనే ప్రారంభించారు. రక్షణ వాహనాలు చేరుకునేలోపు ప్రయాణికులు విమానం నుంచి బయటకు వచ్చి బీచ్ మీదుగా నీళ్లలో నడుచుకుంటూ సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు.

‘సమయస్ఫూర్తి’తో ప్రాణాలు కాపాడిన పైలట్… విచారణలో అసలు కారణాలు

ఈ ఘటనపై సోమాలియా పౌర విమానయాన సంస్థ అయిన Somali Civil Aviation Authority స్పందిస్తూ, “విమానం సురక్షితంగా ల్యాండ్ అయినప్పటికీ రన్‌వే దాటి బీచ్‌లో ఆగింది. ఎవరూ గాయపడలేదు” అని తెలిపింది. విమానాన్ని నిర్వహిస్తున్న StarSky Aviation సంస్థ ప్రతినిధి హసన్ మొహమ్మద్ అదెన్ మాట్లాడుతూ, “పైలట్ సమయోచిత నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి వేరేలా ఉండేది. ఆయన నిబ్బరంగా వ్యవహరించి అందరి ప్రాణాలు కాపాడారు” అని ప్రశంసించారు.

ఘటన వెంటనే ఐక్యరాజ్య సమితి, African Union Mission in Somalia దళాలు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. సోమాలియా రవాణా మంత్రి కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జరిగిన దుర్ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇంజిన్ వైఫల్యమా? బ్రేకింగ్ వ్యవస్థలో లోపమా? లేక రన్‌వే పరిస్థితుల ప్రభావమా? అన్న అంశాలపై నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఫ్లైట్ డేటా రికార్డర్ (బ్లాక్ బాక్స్) ఆధారంగా తుది నివేదిక వెలువడే అవకాశముంది.

ఈ ఘటనతో విమాన భద్రతా ప్రమాణాలపై మళ్లీ చర్చ మొదలైంది. చిన్న సాంకేతిక లోపం కూడా ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందో ఈ సంఘటన గుర్తు చేసింది. అయితే సమయస్ఫూర్తి, శిక్షణ, ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ సరైన విధంగా అమలు అయితే ప్రమాదం నివారించవచ్చని ఇది స్పష్టం చేసింది.

Latest News