Bomb Scare | అమెరికా నుంచి స్పెయిన్‌కు బయల్దేరిన విమానంలో బాంబ్కలకలం రేపింది. బ్లూటూత్ కనెక్షన్లలో బాంబ్ అని కనిపించడంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది టేకాఫ్ అయిన విమానాన్ని తిరిగి న్యూజెర్సీలోని ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. విమానాన్ని అణువణువునా తనిఖీ చేయడంతో పాటు.. ప్రయాణికులను కూడా చెక్ చేశారు. చివరకు అది 16 ఏళ్ల బాలుడు చేసిన ఆకతాయి పని అని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

అమెరికా న్యూజెర్సీ నుంచి స్పెయిన్‌‌‌కు శనివారం సాయంత్రం యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం బయల్దేరింది. 190మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో ఆ విమానం బయల్దేరింది. రాష్ట్రంలోని నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అయిన గంట వ్యవధిలోనే విమాన సిబ్బంది మొబైల్ బ్లూటూత్ కనెక్షన్లలో బాంబ్ పేరుతో ఓ యాక్టివ్ డివైజ్‌ను గుర్తించారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు.

ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్స్, బ్లూటూత్ డివైజ్‌లను ఆఫ్ చేయాలని పలుమార్లు కోరారు. అయినప్పటికీ బాంబ్ పేరుతో ఉన్న డివైజ్ సిగ్నల్ మాత్రం అలాగే కొనసాగింది. దీంతో సిబ్బందిలో మరింత అనుమానాలు మొదలయ్యాయి. భద్రతా కారణాల దృష్ట్యా వెంటనే విమాన సిబ్బంది యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఆపరేషన్ బృందంతో సంప్రదించారు. అనంతరం విమానాన్ని తిరిగి నెవార్క్ విమనాశ్రయానికే మళ్లించాలని నిర్ణయించారు.

అలా స్థానిక కాలమానం ప్రకారం రాత్రి సుమారు 9.37 గంటలకు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం ప్రయాణిలకు దించి, పోర్ట్ అథారిటీ పోలీసులతో పాటు ప్రత్యేక K9 బృందాలు బోయింగ్ 767 విమానాన్ని క్షుణ్నంగా తనిఖీ చేశాయి. అమెరికా రవాణా భద్రతా సంస్థ (TSA), కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అధికారులు కూడా ప్రయాణికులను స్క్రీనింగ్ చేశారు. కానీ వారికి ఎక్కడా కూడా పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో బాంబ్ అనే బ్లూటూత్ డివైజ్ కనెక్షన్‌పై క్షుణ్నంగా ఆరా తీయగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పదహారేళ్ల బాలుడు చేసిన ఆకతాయి పని అని తేలింది.

ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఓ 16 ఏళ్ల బాలుడు సరదాగా తన స్మార్ట్‌ వాచ్‌ నేమ్‌ను బాంబ్ అని మార్చాడని అధికారులు గుర్తించారు. ఘటన అనంతరం ప్రత్యామ్నాయ సిబ్బందితో అదే విమానం మళ్లీ స్పెయిన్‌కు బయల్దేరి సురక్షితంగా గమ్యస్థానానికి పంపించినట్లు తెలిపారు. ఈ ఘటనపై వెంటనే కేసులు నమోదు చేయలేదని.. కానీ ఫెడరల్ అధికారులు సమీక్ష కొనసాగుతున్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.