Honeymoon Tragedy | పదేళ్ల ప్రేమకథ సుఖాంతమైందని సంబరపడేలోపే విధి వారి జీవితాలతో ఆడుకుంది. కొత్త జీవితాన్ని ప్రారంభించిన వెంటనే హనీమూన్‌కు బయల్దేరిన నవదంపతుల విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో భారత సంతతికి చెందిన వరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. వధువు తీవ్రగాయాలతో చికిత్స పొందుతుంది. పెళ్లి వేడుక జరిగిన కొద్ది గంటల్లోనే ఈ ప్రమాదం జరగడంతో రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో నివాసం ఉండే యువ పైలట్ దేవ్ ఫిజి(26) భారత్‌లోని కేరళ సంతతికి చెందిన వ్యక్తి. అతని తాతల సమయంలోనే జార్జియాలో స్థిరపడ్డారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన దవే.. తన చిరకాల స్నేహితురాలైన జెస్నీనిని తాజాగా వివాహం చేసుకున్నాడు. దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న తమ ప్రేమాయణాన్ని మరో మెట్టు ఎక్కించి.. డాసన్‌విల్లే సమీపంలోని ది రివరీ వెడ్డింగ్ వేదికలో వివాహం చేసుకున్నాడు. రిసెప్షన్ అనంతరం హనీమూన్‌కు వెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.
రిసెప్షన్ అనంతరం హనీమూన్ కోసం అట్లాంటా నగరంలోని ఓ హోటల్‌కు కొత్త జంట హెలికాప్టర్‌లో బయల్దేరింది. అయితే వారు ప్రయాణిస్తున్న రాబిన్సన్ ఆర్66 (Robinson R66) హెలికాప్టర్ డికాల్బ్-పీచ్‌ట్రీ ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. పెళ్లి వేదికకు కొద్దిదూరంలోనే ఈ హెలికాప్టర్ కూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ నడుపుతున్న పైలట్‌తో పాటు.. కొత్త పెళ్లికొడుకు దేవ్ ఫిజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక తీవ్రంగా గాయపడిన జెస్నీని హెలికాప్టర్ శకలాల మధ్య చిక్కుకుపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలిని గుర్తించడానికి చాలా సమయం పట్టింది. దీంతో జెన్సీ దాదాపు ఆరు గంటల పాటు శిథిలాల కిందనే ఇరుక్కుని ఉండాల్సి వచ్చింది.
కాగా, ప్రమాదం తర్వాత స్పృహలోకి వచ్చిన తర్వాత దేవ్ పక్కనే ఉండటాన్ని జెస్నీని గమనించింది. ఆమె నర్సు కావడంతో దేవ్‌ను పరిశీలించి, అతను అప్పటికే మరణించినట్లు గుర్తించిందని దేవ్ తండ్రి జార్జ్ ఫిజీ తెలిపారు. తీవ్రంగా గాయపడిన జెన్సీని ప్రస్తుతం అట్లాంటా మెట్రో ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు.
అయితే ఈ ఘటనకు సంబంధించి షాకింగ్ విషయం కూడా ఒకటి వెలుగులోకి వచ్చింది. హనీమూన్‌కు బయల్దేరే ముందు వాతావరణ పరిస్థితులు, తక్కువ విజిబిలిటీపై స్వతహాగా పైలట్ అయిన దేవ్ ఆందోళన వ్యక్తం చేసినట్లుగా అతని తండ్రి జార్జ్ ఫిజీ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా విమానాలు ఎగరవని హెలికాప్టర్‌కు చెప్పాడని పేర్కొన్నారు. కానీ ఎక్కువ ఎత్తులో ప్రయాణిస్తాం.. కాబట్టి ఏం ఫర్వాలేదని పైలట్ నమ్మకంగా బదులిచ్చాడని చెప్పారు. ఈ ఘటనపై అమెరికా జాతీయ రవాణా భద్రతా మండలి(NTSB) దర్యాప్తు చేపట్టింది.