NRI Life | విదేశాలకు వెళ్లిన భారతీయులు అందుకే తిరిగి రావాలనుకోరు.. సూటిగా అసలు కారణం చెప్పేసిన ఎన్ఆర్ఐ మహిళ!

NRI Life | అమెరికా వెళ్లిన వారు అక్కడే ఎందుకు సెటిల్ అవుతారు? కోట్లు సంపాదించిన తర్వాత కూడా ఇండియాకు తిరిగి రాకుండా ఎందుకు ఉండిపోతారు? ఈ ప్రశ్నలకు ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళ ఓపెన్‌గా సమాధానాలిచ్చింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

  • By: Chandram |    nri |    Published on : Apr 28, 2026 9:40 PM IST
NRI Life | విదేశాలకు వెళ్లిన భారతీయులు అందుకే తిరిగి రావాలనుకోరు.. సూటిగా అసలు కారణం చెప్పేసిన ఎన్ఆర్ఐ మహిళ!

NRI Life | చదువుల కోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు చాలామంది అక్కడే స్థిరపడిపోతారు. తిరిగి స్వదేశానికి వచ్చేందుకు ఇష్టపడరు. అసలు అక్కడికి వెళ్లిన తర్వాత ఎందుకు మారిపోతారు? దీనికి అమెరికాలో సెటిల్ అయిన ఓ భారతీయ మహిళ ఇచ్చిన వివరణ ఇప్పుడు సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

‘అమెరికాకు వెళ్లిన వారు మళ్లీ తిరిగి ఎందుకు రారు అని నన్ను చాలామంది అడుగుతుంటారు. కోట్లు సంపాదించిన తర్వాత కూడా వెనక్కి ఎందుకు రారని ప్రశ్నిస్తారు’ అని ఆ మహిళ వీడియోలో తెలిపారు. నేను అమెరికాలోనే ఉంటున్నా కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెబుతానని చెప్పుకొచ్చారు. ఇది కేవలం డబ్బు విషయం మాత్రమే కాదు.. జీవనశైలి, జీవన నాణ్యత కూడా పెద్ద కారణం అని స్పష్టం చేసింది.

భారతదేశంలో చాలామంది అమెరికాలో రూ.5-6 కోట్లు సంపాదిస్తే చాలు.. తిరిగి వచ్చి సుఖంగా జీవించవచ్చని భావిస్తారని తెలిపింది. కానీ వాస్తవానికి అక్కడ అంత సులభంగా డబ్బు కూడబెట్టడం సాధ్యం కాదని పేర్కొంది. బయట నుంచి కనిపించే దానికీ, అక్కడ నిజ జీవితానికి చాలా తేడా ఉంటుందని వివరించింది. ఈ డబ్బు విషయం పక్కన పెడితే అమెరికా వంటి దేశాల్లో జీవన నాణ్యత ఎంతో మెరుగ్గా ఉంటుందని తెలిపింది. పరిశుభ్రమైన గాలి, స్వచ్ఛమైన పరిసరాలు, మంచి ఆహారం, తాగునీటి నాణ్యత, క్రమబద్ధమైన ప్రజా వ్యవస్థలు వంటి అంశాలు రోజువారీ జీవితాన్ని సౌకర్యంగా మారుస్తాయని పేర్కొంది.

 


అలా అక్కడి ప్రశాంతమైన, నియంత్రిత జీవన శైలిని వదులుకుని భారత్‌కు తిరిగి రావడం చాలా కష్టమని ఆ మహిళ తెలిపింది. అమెరికాలో లైఫ్‌స్టైల్ అలవాటు అయిన తర్వాత భారత్‌లోని గబిజిబిగా నగర జీవితానికి అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టమని పేర్కొంది.

సదరు మహిళ చేసిన ఈ వీడియోకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కొందరు ఆమె అభిప్రాయంతో ఏకీభవించగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. విదేశాల్లో జీవన నాణ్యత మెరుగ్గా ఉంటుందని అంగీకరించినప్పటికీ.. సొంత దేశంలో ఉన్న అనుభూతి, కుటుంబ బంధాలు, స్నేహితులు, ఆత్మీయత వంటివి ముఖ్యమని చెప్పుకొచ్చారు.

Read More:

Hair Growth Temple | ఈ గుడికి వెళ్లొస్తే బట్టతల మీద కూడా జుట్టు వస్తుందట.. జపాన్‌లో వైరల్‌గా మారిన మికామి ఆలయం

Chai Guy | లేఆఫ్‌లో ఉద్యోగం పోతే.. అమెరికాలో ఛాయ్ అమ్ముతూ సక్సెస్ అయ్యాడు!