Hair Growth Temple | ఈ గుడికి వెళ్లొస్తే బట్టతల మీద కూడా జుట్టు వస్తుందట.. జపాన్‌లో వైరల్‌గా మారిన మికామి ఆలయం

జపాన్‌లోని క్యోటో ఉన్న ఓ ఆలయం ఇప్పుడు సోషల్‌‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆలయానికి వెళ్లి మొక్కుకుంటే జుట్టు రాలిపోవడం తగ్గి బట్టతల రాకుండా ఉంటుందని భక్తుల విశ్వాసం. అందుకే పెద్ద సంఖ్యలో జనాలు ఈ ప్రత్యేక ఆలయానికి క్యూ కడుతున్నారు.

Hair Growth Temple | ఈ గుడికి వెళ్లొస్తే బట్టతల మీద కూడా జుట్టు వస్తుందట.. జపాన్‌లో వైరల్‌గా మారిన మికామి ఆలయం

Hair Growth Temple | ఈ రోజుల్లో జనాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టు రాలిపోవడం. బట్టతల రాకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చివరకు ఏది ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో నిరాశ పడుతుంటారు. ఇలాంటి సమస్యలకు జపాన్‌లోని ఓ ప్రత్యేక ఆలయం జపాన్‌లో పాపులర్ అయ్యింది.

క్యోటో నగరంలోని మికామి ష్రైన్ పుణ్యక్షేత్రానికి వెళ్లి మొక్కుకుంటే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా, ధృఢంగా వస్తుందని ప్రజల విశ్వాసం. అందుకే బట్టతల ఉన్న వారు ఈ ఆలయానికి క్యూ కడుతున్నారు. ట్రావెల్ క్రియేటర్ షెర్విన్ (shervin_travels) ఈ ఆలయాన్ని సందర్శించి ఓ వీడియో పోస్టు చేయడంతో ఇది మరింత ప్రాచుర్యం పొందింది.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఆలయంలో ప్రార్థనా విధానం కూడా విచిత్రంగా ఉంటుంది. భక్తులు ఆలయంలోని వెళ్లడానికి ముందు ఒక ప్రార్థనా కవర్‌ను కొనుక్కొని వెళ్తారు. తర్వాత ఆలయ పూజారి జుట్టును కొంత కత్తిరించి ఆ కవర్‌లో ఉంచుతారు. అనంతరం ఆలయంలోని మసాయుకి పుజివారా దేవుడి వద్ద పెట్టి ప్రార్థిస్తారు. తర్వాత ఆ కవర్‌ను తిరిగి పూజారికి అందిస్తారు. అప్పుడు జుట్టు ఆరోగ్యం కోసం పూజారి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలు ఉండవని.. వెంట్రుకలు కూడా దృఢంగా మారుతాయని నమ్ముతారు. ఈ విశ్వాసంతోనే ఏటా వేలాది మంది భక్తులు ఆ ఆలయాన్ని సందర్శిస్తుంటారట.

 

ఆలయ విశిష్టత

ఈ ఆలయ నిర్మాణం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ఇందులో ఉండే దేవుడి పేరు పుజివారా ఉనెమెనోసుకే మసాయికి. అతను ఒక క్షురకుడు. జపాన్‌‌లోని తొలి హెయిర్ డ్రెస్సర్‌గా చెబుతుంటారు. కమకురా కాలంలో తన కుటుంబాన్ని పోషించేందుకు జుట్టు కత్తిరించడం, అలంకరించడం ప్రారంభించి, ఒక వృత్తికి పునాది వేశాడని చెబుతుంటారు. తన వృత్తిని దైవంగా భావించి అతను పనిచేసేవాడట. అందుకే ఆయ గౌరవార్థం ప్రతి నెల 17వ తేదీన జపాన్‌లోని బార్బర్లు, హెయిర్ సెలూన్లు మూసివేస్తుంటారు.

ఇక హెయిర్ స్టైలిస్ట్‌లు, బ్యూటీషియన్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, అలాగే మంచి హెయిర్ లైన్ కోసం ఆశపడే పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇక్కడ దువ్వెన ఆకారంలో ఉన్న చెక్క పలకలు, జుట్టు థీమ్‌తో ప్రత్యేక తాయత్తులు కూడా భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

Read More:

Onion Hair Oil | జుట్టు రాలుతుందా..? ఉల్లిపాయ నూనెతో చెక్ పెట్టండిలా..!

Hair Double Wash | హెయిర్ వాష్ రెండుసార్లు చేసుకోవాలా..? డెర్మ‌టాల‌జిస్ట్‌లు ఏం చెబుతున్నారు..?