పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఓ వైపు పాక్ వ్యతిరేక అల్లర్లతో ప్రాణనష్టం ఆగకముందే..మరోవైపు ఆ దేశ ఆర్మీ హెలికాప్టర్ కూలి మరింత ప్రాణ నష్టం వాటిల్లింది. తాజాగా పీవోకేలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ)పై నిషేధానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న పౌరులపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ క్రమంలో మొత్తం 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 200 మంది వరకు గాయపడ్డారు. ఈ అల్లర్లు సద్దుమణుగక ముందే పాక్ ఆర్మీకి చెందిన ఎంఐ 17 హెలికాప్టర్ ముజఫరాబాద్ లో కూలిపోయిన ప్రమాదంలో 21మంది మరణించారు.
సాంకేతిక లోపంతో హెలికాప్టర్ ను ఎమర్జన్సీ ల్యాండింగ్ చేస్తుండగా..అది క్రాష్ అయినట్లుగా పాకిస్తాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. పీవోకేలో అల్లర్లను అణిచివేసేందుకు అదనపు బలగాలను తరలిస్తున్న క్రమంలో ఈ హెలికాప్టర్ కూలిపోయిందని పేర్కొంది. ప్రమాదంలో హెలికాప్టర్ లోని ఎవరు ప్రాణాలతో మిగలలేదని, మృతులకు ఆర్మీ చీఫ్ మునీర్ నివాళులు అర్పించారని పాక్ మీడియా తెలిపింది.
పాక్ సైన్యం పీవోకేలో తిరుగుబాటుదారులపై అణిచివేత చర్యలను కొనసాగిస్తుంది. ఇంకోవైపు ప్రత్యేక బలూచ్ అర్మీతో పోరాడుతుంది. మరోవైపు ఆఫ్ఘానిస్తాన్ పై సైనిక దాడులు కొనసాగిస్తుంంది. ఇలా పాక్ ఆర్మీ మూడు మేజర్ మిలటరీ ఆపరేషన్లతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుండటం గమనార్హం.